మలేషియాలో హైదరాబాద్‌ వ్యాపారి హత్య | Hyderabad businessman killed in Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో హైదరాబాద్‌ వ్యాపారి హత్య

Published Sat, Nov 11 2017 2:56 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

Hyderabad businessman killed in Malaysia - Sakshi

కిడ్నాపర్ల చెరలో ఉన్న వాసుదేవ్‌సింగ్‌ (ఫైల్‌) , కిడ్నాపర్‌గా భావిస్తున్న ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌: స్నేహితులతో కలసి విహారయాత్ర కోసం మలేషియా వెళ్లిన ఓ హైదరాబాద్‌ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. వ్యాపారిని కిడ్నాప్‌ చేసిన దుండగులు కుటుంబీకుల్ని రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి బేరసా రాలు సాగుతుండగానే అతనిని చంపేశారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం కుషాయిగూడ ప్రాంతంలో కలకలం రేపింది. రాజస్తాన్‌లోని పాలి జిల్లాకు చెందిన వాసుదేవ్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌(32) కుటుం బం 15 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. వాసుదేవ్‌తోపాటు అతని అన్న రాధేశ్యాం కుషాయిగూడ మహేశ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరు ఈసీఐఎల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఇంటీరియర్‌ డెకరేటర్స్‌ దుకాణాలు నిర్వహి స్తున్నారు.

గత నెల 27న వాసుదేవ్, సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన టైలర్‌ వెంకటేశ్, అతని బావమరిది శ్రీనివాస్‌తో కలసి విహారయాత్ర కోసం మలేషియా బయలుదేరారు. 28న సింగపూర్‌ చేరుకుని.. అక్కడ నుంచి 31న మలేషియా వెళ్లి కౌలాలంపూర్‌లోని హోటల్‌ రాయల్‌లో బస చేశారు. ఆ రోజు వెంకటేశ్, శ్రీనివాస్‌ హోటల్‌లోనే ఉండగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వాసుదేవ్‌ మలేషియాలో ఉంటున్న పాకిస్తాన్‌ జాతీయుడు ఖాన్‌తో కలసి బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హోటల్‌కు వచ్చిన ఖాన్‌ వెంట వాసుదేవ్‌ లేడు. వెంకటేశ్, శ్రీనివాస్‌ అడగగా.. తాను గంట ముందే హోటల్‌ వద్ద వదిలి వెళ్లినట్లు ఖాన్‌ బదులిచ్చాడు. అదే రోజు రాత్రి మలేషియా నుంచి వాసుదేవ్‌ సెల్‌ నుంచే సైనిక్‌పురిలో ఉంటున్న అతడి అన్న శ్యాంకు ఫోన్‌ వచ్చింది. మీ సోదరుడిని కిడ్నాప్‌ చేశామంటూ రూ.30 లక్షల డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత వాసుదేవ్‌ ఫోన్‌ నుంచి శ్యాంకు వాట్సాప్‌ కాల్స్, చాటింగ్స్‌ మొదలయ్యాయి. నవంబర్‌ 1న ఖాన్‌ ఫోన్‌ (0107682994) నుంచి శ్యాంకు కొన్ని వీడియో, వాయిస్‌ రికార్డులు వచ్చాయి.

కౌలాలంపూర్‌ ఠాణాలో కేసు
ఈ పరిణామాల నేపథ్యంలో వాసుదేవ్‌తో కలసి వెళ్లిన వెంకటేశ్, శ్రీనివాస్‌ నవంబర్‌ 1నే కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్, శ్రీనివాస్‌ వీసా గడువు గత శుక్రవారంతో ముగుస్తుండటంతో ఆ రోజు వారు తిరిగి వచ్చేశారు. వాసుదేవ్‌ కుటుంబీకుల్ని కలసి జరిగింది చెప్పడంతో ఆందోళనకు గురైన వారు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయన సహాయంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు విదేశాంగశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లారు. వాసుదేవ్‌ సోదరులు శ్యాం, ప్రవీణ్, విక్రమ్‌ గురువారం అక్కడికి చేరుకు న్నారు. అప్పటికే కిడ్నాపర్లు బాధితుడిని హత్య చేసినట్లు తెలిసింది. వాసుదేవ్‌ మృత దేహం ఆదివారం నగరానికి చేరుకోనుంది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెంకటేశ్, శ్రీనివాస్‌ ఆచూకీ లభించట్లేదు. వీరిద్దరినీ దర్యాప్తు నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

మూడేళ్లుగా పరిచయం
వాసుదేవ్‌కు ఖాన్‌తో మూడేళ్లుగా పరిచయం ఉందని, ఫేస్‌బుక్‌ ద్వారా ఒకరికొకరు సంప్ర దింపులు జరిపేవారని వాసుదేవ్‌ కుటుంబీకు లు చెప్తున్నారు. గతంలో వాసుదేవ్‌ మలేషి యా వెళ్లినప్పుడు అక్కడ ఖాన్‌ను కలిశాడని, ఆ తర్వాత వారి మధ్య స్నేహం పెరిగిందని అంటున్నారు. వాసుదేవ్‌ ఫోన్‌ నుంచే వాట్సాప్‌ ద్వారా అతడిని బంధించిన, దాడి చేస్తున్న, మెడపై కత్తి పెట్టిన ఫొటోలు ఖాన్‌ పంపాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆపై ఖాన్‌ తన ఫోన్‌ నుంచే వాసుదేవ్‌ సోదరులతో చాటింగ్‌ చేశాడని చెపుతున్నారు. కిడ్నాపర్‌ గురువారం వరకు వాసుదేవ్‌ కుటుం బీకుల్ని డబ్బు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాడు. డిపాజిట్‌ చేయాలని మలేషియాలోని బ్యాంక్‌ ఖాతా నంబర్‌ కూడా ఇచ్చాడు.

పూర్తి సహకారం అందిస్తున్నాం
వాసుదేవ్‌ హత్యకు సంబంధించిన కేసు కౌలాలంపూర్‌లో నమోదైంది. అక్కడి పోలీసులు మాతో సంప్రదింపులు జరిపారు. కొన్ని ఫోన్‌ నంబర్ల వివరాలు అడిగారు. అవి వారికి అందించాం. ఈ కేసును ఛేదించేందుకు కౌలాలంపూర్‌ పోలీసులు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. అక్కడి రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తోంది.    
– మహేష్‌ ఎం.భగవత్, రాచకొండ సీపీ

కీలకంగా మారిన ఫోన్‌ కాల్‌..
రెండు రోజుల క్రితం వాసుదేవ్‌ సోదరుడికి వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ కీలకంగా మారింది. ఓ మహిళ తెలుగులో తాను వరంగల్‌ నుంచి మాట్లాడుతున్నానని, వాసుదేవ్‌ పాస్‌పోర్ట్‌ మలేషియాలోని తమ పరిచయస్తులకు దొరికిందని, వారు చెప్పడంతో తాను ఫోన్‌ చేస్తున్నట్లు చెప్పింది. తన భర్త కొన్నాళ్లు మలేషియాలో ఉన్నారని, అక్కడి కిడ్నాపింగ్‌ గ్యాంగ్స్‌ ప్రమాదకరమని హెచ్చరించి.. వారు డిమాండ్‌ చేసిన నగదులో రూ.5 లక్షలైనా చెల్లించాలని చెప్పిందని వాసుదేవ్‌ సంబంధీకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హతుడి పరిచయస్తులే కిడ్నాప్‌నకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement