Merchant murder
-
మలేషియాలో హైదరాబాద్ వ్యాపారి హత్య
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలసి విహారయాత్ర కోసం మలేషియా వెళ్లిన ఓ హైదరాబాద్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు కుటుంబీకుల్ని రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బేరసా రాలు సాగుతుండగానే అతనిని చంపేశారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం కుషాయిగూడ ప్రాంతంలో కలకలం రేపింది. రాజస్తాన్‌లోని పాలి జిల్లాకు చెందిన వాసుదేవ్‌సింగ్ రాజ్‌పురోహిత్(32) కుటుం బం 15 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. వాసుదేవ్తోపాటు అతని అన్న రాధేశ్యాం కుషాయిగూడ మహేశ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరు ఈసీఐఎల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఇంటీరియర్ డెకరేటర్స్ దుకాణాలు నిర్వహి స్తున్నారు. గత నెల 27న వాసుదేవ్, సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన టైలర్ వెంకటేశ్, అతని బావమరిది శ్రీనివాస్‌తో కలసి విహారయాత్ర కోసం మలేషియా బయలుదేరారు. 28న సింగపూర్ చేరుకుని.. అక్కడ నుంచి 31న మలేషియా వెళ్లి కౌలాలంపూర్‌లోని హోటల్ రాయల్‌లో బస చేశారు. ఆ రోజు వెంకటేశ్, శ్రీనివాస్ హోటల్లోనే ఉండగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వాసుదేవ్ మలేషియాలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుడు ఖాన్‌తో కలసి బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హోటల్‌కు వచ్చిన ఖాన్ వెంట వాసుదేవ్ లేడు. వెంకటేశ్, శ్రీనివాస్ అడగగా.. తాను గంట ముందే హోటల్ వద్ద వదిలి వెళ్లినట్లు ఖాన్ బదులిచ్చాడు. అదే రోజు రాత్రి మలేషియా నుంచి వాసుదేవ్ సెల్ నుంచే సైనిక్‌పురిలో ఉంటున్న అతడి అన్న శ్యాంకు ఫోన్ వచ్చింది. మీ సోదరుడిని కిడ్నాప్ చేశామంటూ రూ.30 లక్షల డిమాండ్ చేశారు. ఆ తర్వాత వాసుదేవ్ ఫోన్ నుంచి శ్యాంకు వాట్సాప్ కాల్స్, చాటింగ్స్ మొదలయ్యాయి. నవంబర్ 1న ఖాన్ ఫోన్ (0107682994) నుంచి శ్యాంకు కొన్ని వీడియో, వాయిస్ రికార్డులు వచ్చాయి. కౌలాలంపూర్ ఠాణాలో కేసు ఈ పరిణామాల నేపథ్యంలో వాసుదేవ్‌తో కలసి వెళ్లిన వెంకటేశ్, శ్రీనివాస్ నవంబర్ 1నే కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్, శ్రీనివాస్ వీసా గడువు గత శుక్రవారంతో ముగుస్తుండటంతో ఆ రోజు వారు తిరిగి వచ్చేశారు. వాసుదేవ్ కుటుంబీకుల్ని కలసి జరిగింది చెప్పడంతో ఆందోళనకు గురైన వారు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయన సహాయంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు విదేశాంగశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లారు. వాసుదేవ్ సోదరులు శ్యాం, ప్రవీణ్, విక్రమ్ గురువారం అక్కడికి చేరుకు న్నారు. అప్పటికే కిడ్నాపర్లు బాధితుడిని హత్య చేసినట్లు తెలిసింది. వాసుదేవ్ మృత దేహం ఆదివారం నగరానికి చేరుకోనుంది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెంకటేశ్, శ్రీనివాస్ ఆచూకీ లభించట్లేదు. వీరిద్దరినీ దర్యాప్తు నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా పరిచయం వాసుదేవ్‌కు ఖాన్‌తో మూడేళ్లుగా పరిచయం ఉందని, ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు సంప్ర దింపులు జరిపేవారని వాసుదేవ్ కుటుంబీకు లు చెప్తున్నారు. గతంలో వాసుదేవ్ మలేషి యా వెళ్లినప్పుడు అక్కడ ఖాన్‌ను కలిశాడని, ఆ తర్వాత వారి మధ్య స్నేహం పెరిగిందని అంటున్నారు. వాసుదేవ్ ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా అతడిని బంధించిన, దాడి చేస్తున్న, మెడపై కత్తి పెట్టిన ఫొటోలు ఖాన్ పంపాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆపై ఖాన్ తన ఫోన్ నుంచే వాసుదేవ్ సోదరులతో చాటింగ్ చేశాడని చెపుతున్నారు. కిడ్నాపర్ గురువారం వరకు వాసుదేవ్ కుటుం బీకుల్ని డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. డిపాజిట్ చేయాలని మలేషియాలోని బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇచ్చాడు. పూర్తి సహకారం అందిస్తున్నాం వాసుదేవ్ హత్యకు సంబంధించిన కేసు కౌలాలంపూర్‌లో నమోదైంది. అక్కడి పోలీసులు మాతో సంప్రదింపులు జరిపారు. కొన్ని ఫోన్ నంబర్ల వివరాలు అడిగారు. అవి వారికి అందించాం. ఈ కేసును ఛేదించేందుకు కౌలాలంపూర్ పోలీసులు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. అక్కడి రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తోంది. – మహేష్ ఎం.భగవత్, రాచకొండ సీపీ కీలకంగా మారిన ఫోన్ కాల్.. రెండు రోజుల క్రితం వాసుదేవ్ సోదరుడికి వచ్చిన ఓ ఫోన్‌కాల్ కీలకంగా మారింది. ఓ మహిళ తెలుగులో తాను వరంగల్ నుంచి మాట్లాడుతున్నానని, వాసుదేవ్ పాస్‌పోర్ట్ మలేషియాలోని తమ పరిచయస్తులకు దొరికిందని, వారు చెప్పడంతో తాను ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. తన భర్త కొన్నాళ్లు మలేషియాలో ఉన్నారని, అక్కడి కిడ్నాపింగ్ గ్యాంగ్స్ ప్రమాదకరమని హెచ్చరించి.. వారు డిమాండ్ చేసిన నగదులో రూ.5 లక్షలైనా చెల్లించాలని చెప్పిందని వాసుదేవ్ సంబంధీకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హతుడి పరిచయస్తులే కిడ్నాప్‌నకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఒక హత్య... ఒక సాక్షి... అసలేం జరిగింది?
చేయని నేరం నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. కానీ అమాయకుల మీద నేరం మోపబడితే? పోలీసుల అందమైన కథనంతో నిర్దోషులు దోషులుగా నిర్ధారణ అయితే ఏమవుతుంది? రికీ జాక్సన్, విలీ బ్రిడ్జ్మాన్ల జీవితం అవుతుంది. క్లీవ్‌లాండ్... అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో జనసమ్మర్దం గల నగరం. నలభై ఏళ్ల కిందట... అంటే 1975 మే 19న క్లీవ్‌లాండ్‌లో ఏం జరిగిందంటే... ఓ వ్యాపారి హత్య జరిగింది. హెరాల్డ్ ఫ్రాంక్స్ అనే వ్యాపారిని దుండగులు అతడి దుకాణంలోనే అత్యంత దారుణంగా హతమార్చారు. దుండగులు హతుడిని చితకబాదారు. ముఖంపై యాసిడ్ పోశారు. చివరకు పాయింట్ 38 కేలిబర్ తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒక తూటా హతుడి భార్య ఆనారాబిన్స్ను గాయపరచింది. ఈ సంఘటనకు ఎడ్డీ వెర్నాన్ అనే పన్నెండేళ్ల బాలుడు తప్ప వేరే సాక్షులెవరూ లేరు. నిందితులకు వ్యతిరేకంగా సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు కూడా లేవు. పోలీసులు ఏం చేశారంటే..? నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా, క్లీవ్‌లాండ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ హత్య కేసులో ముగ్గురు యువకులను నిందితులుగా ఇరికించారు. కోర్టులో తమదైన శైలిలో ఒక కథ వినిపించారు. ఆ కథకు అనుకూలంగా పన్నెండేళ్ల బాలుడు ఎడ్డీ వెర్నాన్‌ను ప్రత్యక్ష సాక్షిగా ప్రవేశపెట్టారు. పోలీసుల కథ ప్రకారం... రికీ జాక్సన్, విలీ బ్రిడ్జ్‌మాన్ హత్యకు పాల్పడ్డారు. ఫ్రాంక్స్‌ను చంపేశాక, అతడి బ్రీఫ్‌కేసును దోచుకున్నారు. ఆ సమయానికి విలీ మరో సోదరుడు రోనీ బ్రిడ్జ్‌మాన్ కారులో ఫ్రాంక్స్ దుకాణం వెలుపలే సిద్ధంగా ఉన్నాడు. నేరం పూర్తయ్యాక ముగ్గురూ పరారయ్యారు. పోలీసుల కథకు ‘ప్రత్యక్ష’సాక్షి వెర్నాన్ సాక్ష్యం బలం చేకూర్చింది. రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్‌లకు కోర్టు తొలుత మరణశిక్ష విధించింది. వారికి సహకరించిన రోనీకి యావజ్జీవ శిక్ష విధించింది. అయితే, 1977లో జరిగిన పునర్విచారణలో రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్‌లకు మరణశిక్ష బదులుగా యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును సవరించింది. విలీ, రోనీలు 2002, 2003లో పెరోల్‌పై విడుదలయ్యారు. పెరోల్ నిబంధనలు ఉల్లంఘించడంతో విలీ స్వల్ప వ్యవధిలోనే మళ్లీ జైలు పాలయ్యాడు. రికీకి ఎలాంటి పెరోల్ దొరకలేదు. ఇక జైల్లోనే తన బతుకు తెల్లారిపోతుందనుకున్నాడు. ఆశలు వదిలేసుకున్న దశలో అనుకోని మలుపు. మలుపు తిరిగిందిలా.. కేసులో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం చెప్పిన వెర్నాన్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఎదిగిన తర్వాత ఆత్మసాక్షి అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. పోలీసుల ప్రోద్బలంతోనే రికీ జాక్సన్, బ్రిడ్జిమాన్ సోదరులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానంటూ గత ఏడాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. సంఘటనా స్థలానికి దరిదాపుల్లో తాను లేనని, ఆ సమయానికి తాను స్కూలు బస్సులో ఉన్నానని తెలిపాడు. దీంతో రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి, విడుదల చేసింది. నేరం చేయకపోయినా అత్యధిక కాలం జైలులో గడిపిన రికీకి 20 లక్షల డాలర్లకు పైగా పరిహారం లభించనుంది. జైలులో మగ్గిన కాలానికి అనుగుణంగా బ్రిడ్జిమాన్ సోదరులకూ పరిహారం అందుతుంది. ఓహయో లెక్కల ప్రకారం నిరపరాధిగా జైలులో గడిపిన ప్రతి ఏడాదికి 40,330 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని సవరిస్తారు. పరిహారంతో తీరిపోతుందా..? పరిహారంగా డబ్బిస్తారు సరే! కటకటాల వెనుక కరిగిపోయిన యవ్వన కాలాన్ని తిరిగిచ్చేదెవరు..? ఏ రకంగా లెక్కించి పరిహారం చెల్లిస్తారు..? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక్క నిరపరాధికైనా శిక్ష పడరాదన్న సహజ న్యాయసూత్రం ప్రపంచంలో సజావుగా అమలు కావడం లేదనేందుకు రికీ జాక్సన్, బ్రిడ్జిమాన్ల ఉదంతమే ఒక తాజా నిదర్శనం. నియంతృత్వ దేశాల్లో నిరపరాధులు కటకటాల వెనక్కి చేరడంలో విడ్డూరం ఏమీ లేకున్నా, ప్రజాస్వామ్యానికి పెద్దన్న వంటి అమెరికాలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తుండటమే వైచిత్రి! కథనాల అల్లికలో అమెరికా పోలీసులూ మెరికలేనన్నమాట. -
కాళ్లూ చేతులు కట్టేసి వ్యాపారి హత్య
సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: భార్యకు విడాకులిచ్చి తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు.. ఉగాదికి తల్లి ఊరెళ్లింది.. ఏం జరిగిందో ఏమో తెలియదు ఓ వ్యాపారి ఇంట్లో దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితుడు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు సనత్‌నగర్ ఎస్సై రమేష్‌నాయక్ తెలిపిన ప్రకారం..ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి అనిల్(42) నగరానికి వలసొచ్చి మోతీనగర్ అవంతినగర్తోటలో నివాసముంటున్నాడు. బల్కంపేటలో ఫ్యాన్లకు అమర్చే రెగ్యులేటర్లు,స్విచ్‌బోర్డులు తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఈయనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. కుటుంబ తగాదాల కారణంగా 2004లో భార్యకు విడాకులిచ్చి తల్లి ప్రమీలారాణితో కలిసి ఉంటున్నాడు. ఉగాదికి తల్లి ఊరికి వెళ్లడంతో ఇంట్లోఒక్కడే ఉంటున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి ఇంటికొచ్చిన అనిల్ తెల్లారేసరికి దారుణహత్యకు గురయ్యాడు. అయితే బుధవారం ఉదయం అనిల్ స్నేహితుడు తారాసింగ్ ఫోన్చేస్తుండగా స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో అనుమానంతో ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచి లోపలికి వె ళ్లి చూడగా అనిల్ రక్తపుమడుగులో ఉండడంతో భయంతో వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హత్యకుగల కారణాలను ఆరాతీశారు. క్లూస్‌టీం,డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దుండగులు కాళ్లు,చేతులు కట్టి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కత్తులతో మెడకోసి హతమార్చారు. తలపై కూడా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనాస్థలంలో ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌కు పాతకక్షలు ఏమైనా ఉన్నాయా లేక భార్యతో గొడవలున్నాయా, స్నేహితులే హతమార్చారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.