హైదరాబాద్ నగర పోలీసులు ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటో
సాక్షి, హైదరాబాద్: ‘డ్రైవింగ్‌లో ఉండగా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే బండి పక్కకు ఆపి, ప్రశాంతమైన చోటు వెదుక్కుని ఆయనతో మాట్లాడండి. ఒకవేళ దేవుడిని చూడాలనుకుంటే డ్రైవింగ్‌లో ఉండగా మొబైల్‌లో మెసేజ్‌లు పెడుతుంటే నేరుగా ఆయనకు దగ్గరకు వెళ్లిపోవచ్చు’ ఇది ఒక వాహనం వెనుక భాగంలో రాసివున్న సందేశం. ఈ ఫోటోను హైదరాబాద్ నగర పోలీసు అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఈ ఫొటో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా?
సెల్‌ఫోన్ల వినియోగం పెరగడంతో వాహనదారుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగిపోతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ, ఛాటింగ్ చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇలా వచ్చిందే ఈ ఫొటో. కాబట్టి సెల్‌ఫోన్ వాడుతూ వాహనాలు నడపకండి, ప్రమాదాలు కొనితెచ్చుకోకండి.
Comments
Please login to add a commentAdd a comment