ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం  | Hyderabad Mandi Chicken Biryani Special Story | Sakshi
Sakshi News home page

మండీ.. ట్రెండీ..

Published Sun, Feb 23 2020 8:10 AM | Last Updated on Sun, Feb 23 2020 9:06 AM

Hyderabad Mandi Chicken Biryani Special Story - Sakshi

సాక్షి, సనత్‌నగర్‌: హైదరాబాద్‌ అంటే ఫుడ్‌ లవర్స్‌కి గుర్తొచ్చే బిర్యానీకి ఇప్పుడు పెద్ద పోటీ వచ్చి పడింది. అచ్చం బిర్యానీనే తలపించే ఒకనాటి సంప్రదాయ మండీ... నగరవాసులకు లేటెస్ట్‌ క్రేజీ డిష్‌గా మారిపోయింది. ఇటీవలి కాలంలో మరే డిష్‌ కూడా ఇంత వేగంగా సిటిజనులకు చేరువ కాలేదని ఫుడ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.  ఆరేబియన్‌ రెస్టారెంట్లలో మండీ, ఖబ్సా వంటకాలే ప్రధానం. వీటిని  మటన్, చికెన్, బోన్‌లెస్‌ ఫిష్, కౌజుపిట్టలతో తయారుచేస్తుంటారు.  

ఒకనాటి అరబిక్‌ సంప్రదాయ యెమిని వంటకం అయిన మండీని మటన్, రైస్‌కు తగినన్ని మసాలాలు కలిపి మాంసంలోని కొవ్వులతో దీనిని వండుతారు. కొన్ని చోట్ల మండీని డ్రైఫ్రూట్స్, మటన్‌ సూప్‌ను మిక్స్‌ చేసి కూడా అందిస్తారు. పాతబస్తీలోని బార్కాస్‌ ప్రాంతంలో ఒకప్పుడు ఇది బాగా పాపులర్‌ కాగా..  ఇప్పుడు నగరవ్యాప్తంగా అంతకు మించి భోజన ప్రియుల ఆదరణ పొందుతోంది. మండి పుణ్యమాని బార్కాస్‌కి కూడా సిటీ ఫుడ్‌ మ్యాప్‌లో చెప్పుకోదగ్గ స్థానమే లభించింది.

అడుగడుగునా..
కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే మండీ సిటి వ్యాప్తమైంది. బార్కాస్‌ తర్వాత  బంజారాహిల్స్‌లోని స్పైస్‌ 6  ఈ అరబిక్‌ ఫుడ్, ఆ తర్వాత మెహదీ పట్నం అలా అలా... ఇప్పుడు  మండీని నగరంలోని దాదాపు ప్రతి రెస్టారెంట్‌ అందించడం ప్రారంభించాయి. స్విగ్గీ జాబితా ప్రకారం... ప్రతి చోటా సగటున 10 ప్రాంతాల్లో ఇది లభ్యమవుతోంది.  ఖైరతాబాద్‌లో 22, అత్తాపూర్‌లో 17, సైనిక్‌పురిలో 10, అమీర్‌పేట్‌లో 23 చోట్ల మండీ అందుబాటులో ఉంది. ఇక ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ వంటి ప్రాంతాల్లో సైతం పెద్ద సంఖ్యలో ఆరేబియన్‌ రెస్టారెంట్లు వెలుస్తున్నాయంటే కారణం మండీయే. 

ఆ‘ధర’ణ అందుకే..
ఇది రూ.200 సమీప ధరలో అందుబాటులో ఉండడం వల్ల యువతకు బాగా చేరువైంది. అలాగే మరోవైపు చూడడానికి బిర్యానీ తరహా రుచి, పొడిగా ఉండడం వల్ల హైదరాబాదీలకు బాగా నచ్చుతోందని ఫుడ్‌ ఎక్స్‌పర్ట్స్‌ విశ్లేషిస్తున్నారు.  ప్రస్తుతం దీనిలో  చికెన్, ఫిష్‌ మండీ కూడా లభిస్తోంది.

ఒకే కంచం...‘ఆరు’గించు తలా కొంచెం 
అందరూ కలిసి ఒకే కంచంలో తినడం అనేది అరబిక్‌ సంప్రదాయంలో  భాగం. యెమన్, సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది.  పీట చుట్టూ కూర్చొని ఆ పీటపై ఉంచిన పెద్ద ప్లేటులో వడ్డించిన మండీని అందరూ కలసి భుజిస్తారు. అదే ఇప్పుడు భోజన ప్రియులను కట్టిపడేసింది. .గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేసే సంస్కృతి  దాదాపుగా కనుమరుగైపోయింది. ఎవరికి సమయాన్ని బట్టి వారు తినేస్తున్నారు. బయట రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు కలసి భోజనం చేస్తుంటారు.

కానీ ఒకే కంచంలో కలిసి భోజనం చేసే సంస్కృతి ని అరేబియన్‌ మండీ రెస్టారెంట్లు తిరిగి తెచ్చాయని చెప్పవచ్చు. ఫుడ్రిఫ్టర్‌కు చెందిన అశిష్‌ నాయక్‌ ఏమంటారంటే... పలువురు స్నేహితులతో కలిసి కూర్చుని కబుర్లతో పాటు తినడం చాలా ఆనందాన్ని అందిస్తుంది. మండీ గెట్‌ టు గెదర్‌ ఓవర్‌ ఫుడ్‌ లాంటిది  కమ్యూనిటీ డైనింగ్‌కు ఇది మంచి ఊతమిస్తోంది’’ అంటున్నారు. 


పాత ఒక కొత్త... 
సిటీ ప్రజలు కొత్త రకం వంటకాలను కోరుకుంటుంటారనడానికి మండీ రెస్టారెంట్లకు వస్తున్న ఆదరణే సాక్ష్యం. ఒకప్పుడు ఓల్డ్‌సిటీలోనే ఉన్నప్పటికీ చాలా మందికి వీటి గురించి తెలియదు. దీంతో వారికి ఇది కొత్తగా పరిచయమైంది.  అరేబియన్‌ సంప్రదాయం అయినప్పటికీ ఎక్కువ శాతం ముస్లిమేతరులే రెస్టారెంట్‌కు వస్తున్నారు. 
– మహ్మద్‌ ఇమ్రాన్, ఆరేబియన్‌ మండీ రెస్టారెంట్‌ మూసాపేట 


కలిసి తింటే కలదు రుచి... 
ఇంట్లో ఉన్నప్పుడు కలసి భోజనం చేసే సమయం కుదరదు. అందులోనూ ఒకే కంచంలో తినడం  జరగని పని. ఆరేబియన్‌ మండీ రెస్టారెంట్‌లో కలసి భోజనం చేయడమే కాదు..ఒకే కంచంలో చేయడం, అందులోనూ ఎంచక్కా కింద కూర్చొని తినడం మధురానుభూతిని ఇస్తోంది.  – జ్యోతి, కూకట్‌పల్లి. 

కాక్‌టైల్‌ మిక్సింగ్‌ 
మిక్సింగ్‌ అనేది ఒక కళ. కలపడంలో మెళకువలు తెలిస్తే కాక్‌టెయిల్‌ కింగ్‌ అనిపించుకోవచ్చు. నగరానికి చెందిన మిక్సాలజిస్ట్‌ చాపాయ్‌ ఆనంద్‌ అదే సాధించారు. తాజాగా ఢిల్లీ జరిగిన బ్రౌన్‌ఫోర్మన్‌ అమెరికన్‌ విస్కీ లెగసీ కాక్‌టైల్‌ ఛాలెంజ్‌ 2020 గెలుచుకున్నారు. 

భారతదేశపు బెస్ట్‌ మిక్సాలజిస్ట్‌ పురస్కారం కోసం నిర్వహించిన వేట ముగిసింది. నగరంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న చపాయ్‌ ఆనంద్‌ ఈ పోటీలో విజేతగా నిలిచాడు. ఈ చాలెంజ్‌లో దేశవ్యాప్తంగా 250 మంది  పాల్గొన్నారు. వీరిలో 8మంది ఫైనలిస్టులుగా ఎన్నికయ్యారు ఢిల్లీలోని ఏరో సిటీలో ఉన్న జెడబ్ల్యూ మారియట్‌ హోటల్‌ ప్లే గ్రౌండ్‌ బార్‌లో ఈ పోటీ నిర్వహించారు. దేశంలోని మరో ఏడుగురు ఫైనలిస్ట్స్‌తో పోటీ పడి చపాయ్‌ ఆనంద్‌ ఈ టైటిల్‌ దక్కించుకున్నారు. ముంబయికి చెందిన ఓమ్‌ చౌహాన్,  ఈ పోటీలో ఏకైక మహిళ బెంగుళూర్‌కి చెందిన ఆరతీ మెర్సీ వీరిద్దరూ ఫస్ట్, సెకండ్‌ రన్నరప్‌ టైటిల్స్‌ అందుకున్నారు.  

ది డార్క్‌ సోల్, ది చాంటిక్‌ జాక్, ది మానికర్స్‌ వంటి కాక్‌టైల్స్‌ను ప్రదర్శించి ఆనంద్‌ ప్రశంసలు పొందాడు. ‘‘నా అవార్డ్‌ని నా కో కాంటెస్టెంట్స్‌ అందరికీ అంకితం చేస్తున్నా. ఆహారం వృథా చేయడానికి నేను వ్యతిరేకిని.  బైకర్‌గా ట్రెక్స్, రైడ్స్‌కి వెళ్లినప్పుడు కొన్ని సార్లు ఏ రకమైన ఆహారం దొరకని చోట ఇరుక్కుపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అందుకే ఫుడ్‌ వేస్ట్‌ లేని ముడిదినుసులనే నా కాక్‌టైల్‌ మేకింగ్‌లో వినియోగించానని చెప్పాడు  ఆనంద్‌. ఈ టైటిల్‌ విజయాలకు సంబంధించి అమెరికా తదితర దేశాల్లోని ప్రసిద్ధ డిస్టలరీలు సందర్శించడం, విస్కీ మేకింగ్‌ మెళకువలను నేర్చుకోవడం వంటివి ఆనంద్‌ అందుకోనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement