బేగంపేటకు చెందిన హర్షవర్థన్‌కు సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరం చూస్తే 100 డిగ్రీలు దాటింది.. భరించలేని ఒంటి నొప్పులు. మంచంపై నుంచి లేచి కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి.. డాక్టర్ దగ్గరికెళ్తే.. చికెన్ గున్యాగా అనుమానించి.. పరీక్షలు చేయించారు. తీరా చూస్తే.. వైరల్ ఫీవర్ అని తేలింది.
నాగోల్‌కు చెందిన రాజేశ్వరి వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితి. ఇంట్లోని బంధువులు ఆమెను చేయిపట్టి లేపేందుకు యత్నిస్తే.. నొప్పిని భరించలేక విలవిల్లాడింది. చికిత్స కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్తే.. డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. పరీక్షలు చేయించారు. ఇక్కడా అదే.. సాధారణ వైరల్ ఫీవర్.
సాక్షి, హైదరాబాద్ : హర్షవర్థన్, రాజేశ్వరి మాత్రమే కాదు.. గ్రేటర్‌లో వేలాది మందికి ఇదే తరహాలో తీవ్రమైన జ్వరం, భరించలేని ఒంటినొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి ఈ సీజన్‌లో జలుబు, తలనొప్పి, జ్వరంతోపాటు కొద్దిపాటి ఒళ్లునొప్పులు సాధారణమే. అయితే, ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో జలుబు, తలనొప్పి, జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు (కంబైన్డ్ ఫీవర్స్) ఉన్నాయని చెబుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రి ఓపీకి వస్తున్నవారిలో 30 శాతం మంది జ్వరంతోపాటు తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నవారే. ఈ లక్షణాలను చూసి.. డెంగీ, చికెన్ గున్యా, మలేరియాగా అనుమానించి, వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. తీరా రిపోర్టుల్లో నెగెటివ్ రావడం.. వైరల్ ఫీవర్ అని తేలడం అయోమయాన్ని కలిగిస్తోంది. డెంగీ, చికున్‌గున్యాలో కన్పించే లక్షణాలే సాధారణ వైరల్ ఫీవర్ లోనూ కనిపించడంతో రోగు ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువ. జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి ఉదయం 10 గంటల వరకు నిద్రపోతుంటారు. తెల్లవారుజామున విడుదలయ్యే సూర్యకిరణాల్లో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. కానీ ఈ సమయంలో మనం ఇంట్లో ఉండటంతో ఈ విటమిన్ లోపం కన్పిస్తోంది. దీనికి తోడు మధుమేహ బాధితులు కూడా ఎక్కువ. ఇతరులతో పోలిస్తే... వీరి ఆరోగ్యం కొంత సున్నితంగా ఉంటుంది. మద్యం, మాంసాహారాలను అతిగా తీసుకోవడంతో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సమతుల ఆహార లోపంతో పాటు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో శరీరం పటుత్వాన్ని కోల్పోయి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. సాధారణ జ్వర పీడితులతో పోలిస్తే... విటమిన్ డి లోపం ఉన్న బాధితుల్లో జ్వరం వస్తే నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరు నడవలేక కిందపడి పోతుంటారు.
-డాక్టర్ నవోదయ, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి
ప్రస్తుతం ఆస్పత్రుల్లో నమోదవుతున్న సాధారణ జ్వరపీడితుల్లోనూ డెంగీ, చికున్‌గున్యా లక్షణాలు కన్పిస్తున్నాయి. వ్యాధినిర్ధారణ కోసం వైద్యులు వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపుతున్నారు. తీరా రిపోర్ట్ చూస్తే.. సాధారణ వైరల్ ఫీవర్‌గా తేలుతుంది. నగరంలో కొత్త వైరస్ అంటూ ఏమీ లేదు. కానీ విటమిన్ లోపంతో బాధపడుతున్న బాధితుల్లో జ్వరం ఉన్నప్పుడు ఒంటినొప్పులు కొంత ఎక్కువగా ఉండటం సహజమే.
-డాక్టర్ శంకర్, డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
Comments
Please login to add a commentAdd a comment