సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టమైన పోలింగ్ నేడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నగర పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 16 వేల మంది పోలీసులతో బందోబస్తు, భద్రత చేపట్టింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించింది. నగర వ్యాప్తంగా అమలులో ఉండే దీని ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దు. మరోపక్క ఓటర్లలో పురుషుల కోసం క్యూ, మహిళల కోసం మరో క్యూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు మించి వేరే క్యూల్లో నిల్చోవటం నిషేధం. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు. నగర వ్యాప్తంగా మద్యం విక్రయాలను రెండురోజుల పాటు నిషేధించారు. పోలింగ్ రోజున నగర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలను సైతం నిషేధించారు. ఈ ఉత్తర్వుల్ని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొత్వాల్ హెచ్చరించారు.
ట్రాఫిక్ పరంగా చర్యలు..
పోలింగ్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడటంపై సిటీ ట్రాఫిక్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. దీనికోసం చేయాల్సిన ఏర్పాట్లను ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ సమీక్షిస్తున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సైతం కన్నేసి ఉంచాలని అనిల్‌కుమార్ సిబ్బందిని కోరారు. ప్రముఖుల పర్యటనలతో పాటు పోలింగ్ నేపథ్యంలోనూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సిబ్బందికి ఆయన వివరించారు. సిటీలో ఎక్కడా బయటి ప్రాంతాలకు చెందిన వారు కారణం లేకుండా ఉండకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి బుధ, గురువారాల్లో లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లల్లో సోదాలు చేస్తారు. ఇలాంటి వారిని స్థానికులు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఈ నిబంధనలు పాటించాలి..
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి గన్‌మెన్లు, వాహనాలను అనుమతించరు. 200 మీటర్ల వరకు కేవలం అభ్యర్థి వాహనం, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వాహనం, గరిష్టంగా ఐదుగురితో కూడిన వర్కర్ల వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు. వీరికి జారీ చేసిన పర్మిట్‌ను వాహనం ముందు భాగంలో, ఎడమ వైపున స్పష్టంగా కనిపించేలా అతికించాలి. నిర్దేశిత ప్రాంతంలోకి వాటర్ ట్యాంకర్లు, పాలవ్యాన్లు తదితర అత్యవసర సేవలకు చెందిన వాహనాల మినహా మరే ఇతర వాటినీ అనుమతించరు. ఈ ప్రాంతంలో ఎలక్షన్ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి షామియానాలు వేయకూడదు. ఆయా పార్టీలు, అభ్యర్థులకు చెందిన అధీకృత వ్యక్తులు కేవలం ఒక టేబుల్, రెండు కుర్చీలు మాత్రమే వేసుకోవాలి. ఓటర్లను రవాణా చేస్తూ చిక్కిన కమర్షియల్ వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు. ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రం వరకు తమ వాహనాలు తీసుకురాకూడదు. దివ్యాంగుల్ని తీసుకువచ్చే వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
సైబరాబాద్ పరిధిలో..
చేవేళ్ల, మల్కాజిగిరిలతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,971 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు 11వేల మంది పోలీసులు, 20 కేంద్ర పారామిలిటరీ బలగాలు, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి 2,000 మంది హోంగార్డులు, 300 మంది ఫారెస్ట్ గార్డ్‌లు, 300 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. 2,971 పోలింగ్ కేంద్రాల్లో 214 పొలింగ్ బూత్‌లు అత్యంత సమస్యాత్మకంగా ఉండటంతో అదనంగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. మొత్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
రాచకొండ పరిధిలో..
రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఆరువేల మంది పోలీసులతో పాటు పది కేంద్ర పారామిలిటరీ బలగాలు భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. 3,215 పొలింగ్ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 358 పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత సిబ్బందిని రంగంలోకి దించారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ బుధవారం తెలిపారు.
సిబ్బంది ఇలా..
డీఎస్పీ ఆపై స్థాయి వారు: 155
ఇన్‌స్పెక్టర్లు: 225
ఎస్సైలు: 531
ఏఎస్సైలు: 535
హెడ్ కానిస్టేబుళ్లు: 1,407
కానిస్టేబుళ్లు: 6,107
స్పెషల్ పోలీసు ఆఫీసర్లు: 480
హోంగార్డులు: 5,360
సాయుధ బలగాలు: 1,200
Comments
Please login to add a commentAdd a comment