ఇవేం రివార్డ్స్‌! | Hyderabad Police Reward Money Revised in 2002 | Sakshi
Sakshi News home page

ఇవేం రివార్డ్స్‌!

Published Mon, Aug 19 2019 11:16 AM | Last Updated on Mon, Aug 19 2019 11:16 AM

Hyderabad Police Reward Money Revised in 2002 - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సంచలనాత్మక, కీలక కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులను ఉన్నతాధికారులు మెచ్చుకోవడంతో పాటు నగదు రివార్డు కూడా అందిస్తారు. 1905 నుంచి అమలవుతున్న ఈ రివార్డ్స్‌ విధానంలో ఎవరికి? ఎంత? ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు సవరణ అవుతూ ఉండాలి. అయితే 17 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరుగకపోవడంతో రివార్డ్స్‌ కింద ఇచ్చే నగదు నామమాత్రంగా మారింది. దీన్ని పెంచాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ఫైల్‌ను నగర పోలీసు విభాగం దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపింది. అయితే దీనిపై స్పందించకపోవడంతో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ సవరణలు కేవలం రాజధానిలోని మూడు కమిషనరేట్లకే కాకుండా రాష్ట్రం మొత్తం వర్తించే విధంగా ఫైలు రూపొందించారు.

వారే అర్హులు...
ఏళ్లుగా నామ్‌కే వాస్తేగా ఉండిపోయిన ఈ రివార్డుల మొత్తాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేసినా... రివార్డు అనేది గుర్తింపు మాత్రమే, అది ఎంత అన్నది లెక్కకాదు అంటూ అధికారులు బుజ్జగిస్తూ వస్తుంటారు. పోలీసు విభాగంలో ప్రస్తుతం కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు మాత్రమే క్యాష్‌ రివార్డులు అందుకోవడానికి అర్హులు. ఆపై స్థాయి వారికి వీటిని అందుకునే అవకాశమే లేదు. ఒకప్పుడు ఈ మొత్తాలు మరీ దారుణంగా ఉండేవి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2002లో ఆఖరిసారిగా సవరించారు. ఆ తర్వాత సవరణ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రివార్డు అందుకున్నట్లు వారి సర్వీసు రికార్డుల్లోకి వెళ్తోంది. అయితే ఆ మొత్తం ఎంతన్నది మాత్రం ఎదుటి వారికే కాదు కనీసం కుటుంబీకులకు కూడా చెప్పుకోవడానికే సిగ్గుపడేలా ఉంది. ఈ రివార్డు మొత్తాన్ని డీసీపీ (ఎస్పీ) నుంచి జేసీపీ (డీఐజీ), అదనపు సీపీ (ఐజీ), కమిషనర్‌ (అదనపు డీజీ) స్థాయి అధికారులు ప్రకటిస్తుంటారు. కానిస్టేబుల్‌కు డీసీపీ, ఎస్సైలకు జేసీపీ, ఇన్‌స్పెక్టర్లకు ఐజీలు రివార్డులు ప్రకటిస్తారు. పోలీసు కమిషనర్‌కు వీరిలో ఏ స్థాయి వారికైనా రివార్డు ఇచ్చే అధికారం ఉంది. 

కనీస మొత్తం రూ.3వేలు...
ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబంధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్‌ (జేసీపీ) రూ.1,000, అదనపు సీపీ రూ.1,500, సీపీ రూ.2,000 మాత్రమే మంజూరు చేయలగలరు. డీసీపీ నుంచి సీపీ వరకు అంతా కలిసి పెద్ద మొత్తం కింద ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక పనికి సంబంధించి ఒకరు మాత్రమే రివార్డు ప్రకటించాలి. సాధారణంగా కమిషనరేట్లలో డీసీపీ, జిల్లాల్లో ఎస్పీలే నగదు రివార్డులు ప్రకటిస్తుంటారు. దీని ప్రకారం వీరు గరిష్టంగా రూ.750 మాత్రమే మంజూరు చేయగలరు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు డీసీపీ రూ.3వేలు, జేసీపీ రూ.4వేలు, అదనపు సీపీ రూ.6వేలు, సీపీ రూ.8వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు. డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న స్థాయి అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. 

ఎన్నికలతో ఆగిన ఫైల్‌...
హైదరాబాద్‌లో మూడేళ్లుగా ‘కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్‌’ (కేపీఐ) పేరుతో నెలనెలా ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించే విధానం అమలులో ఉంది. దీన్ని ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. పోలీసు విధుల్ని మొత్తం 16 విభాగాలుగా విభజించారు. ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేసి కేపీఐ అవార్డు కింద సర్టిఫికెట్‌ మాత్రమే ఇస్తున్నారు. వీరిలో ఎవరికైనా రివార్డు ఇవ్వాలంటే ఎస్పీలు, కమిషనర్లు వారి కార్యాలయ నిధుల నుంచి ఇవ్వాల్సి వస్తోంది. అలా కాకుండా వీరికీ రివార్డులు అందించేలా ప్రతిపాదనలు చేశారు. నగర పోలీసులు పంపిన వీటిని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం కొన్ని మార్పుచేర్పులు చేస్తూ దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఫైల్‌ పరిశీలనలో ఉండగానే శాసనసభ, ఆ తర్వాత పార్లమెంట్‌కు ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ క్రతువు ముగిసినప్పటికీ ఈ ఫైల్‌ను పట్టించుకునే నా«థుడే కరవయ్యాడు. దీంతో సిబ్బందికి ఎదురుచూపులే మిగిలాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement