సాక్షి, సిటీబ్యూరో: దుర్బర పరిస్థితుల్లో ఉన్న బాలబాలికలను మేమున్నామని సైబరాబాద్ పోలీసులు అపన్నహస్తం అందిస్తున్నారు. వెట్టి వెతల నుంచి వీరికి విముక్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్–5లో చిట్టి చేతులతో పనులు, యాచన చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఈ మిషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 4,097 మంది బాలబాలికలను సంరక్షించగా, సైబరాబాద్‌లోనే 541 మందికి విముక్తి కల్పించడం విశేషం. కార్మిక చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్ అతిక్రమించిన పరిశ్రమల యజమానులపై రాష్ట్రవ్యాప్తంగా 478 కేసులు నమోదైతే ఒక్క సైబరాబాద్‌లోనే 244 కేసులతో ప్రథమస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 44 ఎఫ్‌ఐఆర్‌లతో ఖమ్మం కమిషనరేట్, 16 ఎఫ్‌ఐఆర్‌లతో రాచకొండ, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నాయి.
జూలై 1 నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులతో సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో టీస్టాల్స్, దాబాలు, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న చిన్నారులతో పాటు ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రార్థన మందిరాల సమీపాల్లో భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కొన్ని మిస్సింగ్ కేసులు కూడా టీఎస్ కాప్ యాప్ దర్పన్ ద్వారా ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో గుర్తించే పని కూడా చేపట్టారు. చిన్నారులను సంరక్షించేందుకు ప్రత్యేక వాహనాన్ని అందుబాటులో ఉంచిన సైబరాబాద్ పోలీసులు ఆయా కాలనీల్లో పనిచేసే బాలకార్మికులపై సమాచారాన్ని అందించాలని రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలకు సూచించారు. బాలకార్మికులు కనబడితే సమాచారం ఇచ్చేందుకు 7901115474 ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకరావడం వల్ల కూడా భారీ సంఖ్యలో బాలబాలికలను సంరక్షించేందుకు అస్కారం ఏర్పడిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 14 ఏళ్లలోపు పనిచేసే బాలలు కంటపడితే సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు కూడా కాల్ చేయవచ్చని చేసిన ప్రచారం 541 మంది పిల్లలకు వెట్టి, యాచన నుంచి విముక్తి కలిగించేందుకు తోడ్పడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment