oparation smile
-
అంతులేని వ్యథ
గతి తప్పిన బాల్యం.. గమ్యం లేని ప్రయాణం.. లక్ష్యం లేని జీవితం.. ఎక్కడ పుట్టామో తెలియదు.. ఎలా బతకాలో అర్థం కాదు.. తల్లిదండ్రులు ఉన్నారో లేదో గుర్తులేదు.. అనాథ బాలలు వీరు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ఒకరు.. కుటుంబం నుంచి తప్పిపోయి మరొకరు.. ఇలా జీవన పోరాటంలో భిక్షాటన చేస్తూ.. బాలల సంరక్షణ కేంద్రాలకు చేరిన అభాగ్యులు వారు. ఇలాంటి వారిలో కొందరినైనా సొంత గూటికి చేర్చేందుకు ఆయా ప్రాంతాల్లోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్) సిబ్బందిప్రయత్నిస్తూనే ఉంటారు. పలమనేరు: పదేళ్ల తర్వాత ఒడిశాలోని చిల్ట్రన్ హోమ్‌నుంచి వీకోట మండలంలోని తన స్వగ్రామమైన బోడిగుట్లపల్లి చేరుకున్న అనామిక కథ తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధువుల చెంతకు చేరిన ఆ బాలిక చిన్న నాటి నుంచి తన వారి చెంతకు చేరాలని తాను పడ్డ తపన.. బాధలు.. వారితో పంచుకుంది. తన లాగే మన జిల్లాకు చెందిన వారు అక్కడి దయావిహార్లో ఉన్నారని ఇక్కడి అధికారులకు తెలిపింది. దీంతో వారిని సైతం తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమ్మానాన్న చెంతకు చేరాలని ఓ బాలిక ఆరాటం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒడిశాలోని పూరి ప్రాంతం నుంచి అక్కడి స్వచ్ఛంద సంస్థల ద్వారా కనాస్ హోమ్‌లో ఉన్నట్టు అనామిక ఇక్కడి ఐసీపీఎస్ అధికారులకు చెప్పింది. తనకు తెలుగు కొద్దిగా వచ్చు కాబట్టి తనతో ఆ బాలిక వివరాలు చెప్పి తనను ఎలాగైనా సొంత ఊరికి చేర్చాలని రోదించిందట. దీంతో ఆబాలిక చిరునామా.. ఫోటోల కోసం ఇక్కడి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్‌ది మరోకథ ఎక్కడినుంచి వచ్చాడో తెలియని విజయ్ తిరుపతిలోని చిల్ట్రన్ హోమ్‌కు ఎనిమిదేళ్ళ క్రితం చేరాడు. ఇప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాల మేరకు పత్తికొండ అడవిలో తమ తల్లిదండ్రులున్నట్టు అక్కడి అధికారులకు తెలిపాడు. దీంతో చిత్తూరు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లెల శివ ఆ బాలుడి తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు. సంబంధిత అంగన్వాడీ వర్కర్ల ద్వారా చిరునామా అన్వేషణ చేపట్టారు. జిల్లాలో పత్తికొండ గ్రామం గంగవరం మండలంలో ఉన్నట్టు గుర్తించి గత రెండు రోజులుగా స్థానిక సీడీపీవో రాజేశ్వరి సిబ్బంది కలసి ఆరా తీశారు. ఎట్టకేలకు పత్తికొండ సమీపంలోని అటుకురాళ్ళపల్లి అటవీ ప్రాంతంలో విజయ్ తల్లిదండ్రులను కలిశారు. చిన్నప్పుడు తప్పిపోయిన వారి కుమారుడు తిరుపతిలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఆ మాట చెప్పగాని తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారని అధికారి అనుకున్నారు. అయితే వారు ‘‘ఉంటే ఉండనీ.. వాడు ఇక్కడికొస్తే మాలాగే పాములు పట్టి ఆడించుకోవాల్సిందేగా’’ అన్ని నిట్టూర్చినట్టు తెలిసింది. దీంతో చేసిదిలేక విజయ్‌కు ఏదైనా చేతిపని నేర్పించి ఆపై స్వగ్రామానికి పంపేలా అధికారులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటివారెందరో? చిన్నతనంలో పారిపోయిన పక్క రాష్ట్రాల్లో వీధిబాలలుగా ఎందరో జిల్లాకు చెందిన చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా వారు పట్టణాల్లోని చిల్డ్రన్ హోమ్‌లకు చేరుతుంటారు. వారిని 18 సంవత్సరాల దాకా మాత్రమే అక్కడ ఉంచుకుంటారు. ఆపై తల్లిదండ్రుల సమాచారం లభిస్తే వారి చెంతకు చేర్చుతుంటారు. లేదంటే వారి దారిన వారిని వదిలేస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కార్యాలయాలుంటాయి. అక్కడి హోమ్‌లోని బాల, బాలికల వివరాల మేరకు సంబంధిత రాష్ట్రం, జిల్లాలకు ఈ కార్యాలయాలనుంచి సమాచారం అందుతుంటోంది. అయితే ఆ అభాగ్యుల భాగ్యం బాగుంటే వారు తల్లిదండ్రులకు చెంతకు చేరే అవకాశం ఉంటుంది. దశాబ్దాల నిరీక్షణలో ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు వద్దకు చేర్చేందుకు సంబంధిత అధికారులు మరింత చొరవ చూపితేనే వారి బతుకులు మారుతాయి. -
ఆపరేషన్ ముస్కాన్‌లో ‘సై’
సాక్షి, సిటీబ్యూరో: దుర్బర పరిస్థితుల్లో ఉన్న బాలబాలికలను మేమున్నామని సైబరాబాద్ పోలీసులు అపన్నహస్తం అందిస్తున్నారు. వెట్టి వెతల నుంచి వీరికి విముక్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్–5లో చిట్టి చేతులతో పనులు, యాచన చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఈ మిషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 4,097 మంది బాలబాలికలను సంరక్షించగా, సైబరాబాద్‌లోనే 541 మందికి విముక్తి కల్పించడం విశేషం. కార్మిక చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్ అతిక్రమించిన పరిశ్రమల యజమానులపై రాష్ట్రవ్యాప్తంగా 478 కేసులు నమోదైతే ఒక్క సైబరాబాద్‌లోనే 244 కేసులతో ప్రథమస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 44 ఎఫ్ఐఆర్లతో ఖమ్మం కమిషనరేట్, 16 ఎఫ్ఐఆర్లతో రాచకొండ, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నాయి. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులతో సమన్వయం చేస్తూ నిర్వహించిన ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో టీస్టాల్స్, దాబాలు, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న చిన్నారులతో పాటు ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రార్థన మందిరాల సమీపాల్లో భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కొన్ని మిస్సింగ్ కేసులు కూడా టీఎస్ కాప్ యాప్ దర్పన్ ద్వారా ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో గుర్తించే పని కూడా చేపట్టారు. చిన్నారులను సంరక్షించేందుకు ప్రత్యేక వాహనాన్ని అందుబాటులో ఉంచిన సైబరాబాద్ పోలీసులు ఆయా కాలనీల్లో పనిచేసే బాలకార్మికులపై సమాచారాన్ని అందించాలని రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలకు సూచించారు. బాలకార్మికులు కనబడితే సమాచారం ఇచ్చేందుకు 7901115474 ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకరావడం వల్ల కూడా భారీ సంఖ్యలో బాలబాలికలను సంరక్షించేందుకు అస్కారం ఏర్పడిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 14 ఏళ్లలోపు పనిచేసే బాలలు కంటపడితే సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు కూడా కాల్ చేయవచ్చని చేసిన ప్రచారం 541 మంది పిల్లలకు వెట్టి, యాచన నుంచి విముక్తి కలిగించేందుకు తోడ్పడిందని తెలిపారు. -
325 మంది.. చిన్నారుల్లో ‘స్మైల్’
నగర పోలీసులు ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్‌ను’ వినూత్నంగా చేపట్టారు. దాదాపు 200 హాట్‌స్పాట్స్(వెట్టి, భిక్షాటనకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు)ను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో ఉమ్మడిగా దాడులు జరిపారు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న 325 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్తోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. సాక్షి, సిటీబ్యూరో: వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్పించడం... తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్’లో నగర పోలీసులు కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్థోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అదనపు సీపీ షికా గోయల్, అదనపు డీసీపీ అబ్దుల్ బారిలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఐదో విడతలో అనేక మార్పులు... ఈ నెల 1 నుంచి 31 వరకు నగరంలో ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహించనున్నారు. ఈసారి ప్రధానంగా వెట్టిచాకిరీలో, భిక్షాటనలో మగ్గుతున్న చిన్నారులపై దృష్టి పెట్టారు. ఓసారి రెస్క్యూ అయిన చిన్నారులు మళ్లీ అదే మార్గంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆపరేషన్ స్మైల్ కోసం ఒక్కో సబ్–డివిజన్‌కు ఒక్కోటి చొప్పున ఎస్సైల నేతృత్వంలో మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేశారు. గత 27 రోజుల్లో రెవెన్యూ, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఈ బృందాలు నగరంలోని 200 ప్రాంతాల్లో చిన్నారుల వెట్టి, బిక్షాటనకు ఆస్కారం ఉన్నట్లు గుర్తించాయి. ఆయా చోట్ల దాదాపు మూడు రోజుల పాటు పరిశీలన చేసిన తర్వాత వరుస దాడులు చేశాయి. ఫలితంగా 11 మంది బాలికల సహా మొత్తం 325 మందిని కాపాడారు. యాజమాన్యాల వివరాలతో డేటాబేస్... ఈ రెస్క్యూ అయిన చిన్నారుల్లో ఏడుగురు పదేళ్లలోపు, 38 మంది 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో, మిగిలిన వారు 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. వీరిలో 272 మందిని పూర్తిస్థాయి కౌన్సిలింగ్ తర్వాత తమ కుటుంబీకులకు అప్పగించారు. మరో 53 మంది వివరాలు సరిచూడాల్సి ఉండటంతో వీరిని అంబర్‌పేటలోని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. 14 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం రూ.6.75 లక్షల జరిమానా విధించి వసూలు చేశాయి. ఈ చిన్నారుల్లో ఇద్దరు బిక్షాటన చేస్తుండగా మిగిలిన వారు బ్యాగ్స్ తయారీ, గాజుల కర్మాగారాలు, బిస్కెట్ ఫ్యాక్టరీలు, బేకరీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కార్ఖానాలు, మెకానిక్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు. వీరిలో ఏపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌కు చెందిన వారు 100 మంది ఉన్నారు. ఆసక్తి ఉంటే చదివిసాం్త.. ఆపరేషన్ స్మైల్ టీమ్స్‌లో ఉన్న ఎస్సైల్లో ఒకరైన తిరుమలగిరికి చెందిన రజిని ఇద్దరు చిన్నారులను, గోల్కొండ ఏఎస్సై రఫియుద్దీన్ మరొకరిని పాఠశాలల్లో చేర్పించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరు రోడ్డపై పడ్డారన్న విషయం తెలుసుకుని చదువుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఆ ముగ్గురూ ఆసక్తి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఆపై స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించి ఉచిత విద్య అందించేలా ఒప్పించి చేర్పించారు. వీరికి అవసరమైన యూనిఫామ్స్, పుస్తకాలను ఆయా అధికారులే కొనిపెట్టారు. చైల్డ్ లేబర్‌ను ప్రోత్సహిస్తూ పదేపదే పట్టుబడుతున్న యాజమాన్యాలను, తరచూ ఇదే బాటపడుతున్న చిన్నారులను గుర్తించడానికి ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు. -
‘ఆపరేషన్ స్మైల్’ ఐదో దఫా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మిక వ్యవస్థలో నిర్బంధంగా పనిచేస్తున్న మైనర్లు, వ్యభిచార కూపాల్లో బాల్యాన్ని బంధీగా చేయబడ్డ బాలికలను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ ఐదో దఫా కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ప్రారంభించారు. 22 వేల మంది రెస్క్యూ.. గత 4 దఫాల ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈసారీ అదే రీతిలో పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్టు ఐజీ స్వాతి లక్రా తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ కోసం రంగంలోకి దించుతున్నామని చెప్పారు. వీరందరికి సోమవారం అవగాహన, రెస్క్యూ ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఫేసియల్ రికగ్నైజేషన్.. రెస్క్యూ సందర్భంగా గుర్తించిన చిన్నారులు, మైనర్లు వారి వారి వివరాలు చెప్పేందుకు భయపడటం లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్ర పోలీస్ శాఖ రూపొం దించిన ‘దర్పన్’ ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని శిక్షణలో అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారి వివరాల డేటా బేస్ అందుబాటులో ఉంటుం దని, చిన్నారుల ఫొటోలను సరిపోల్చి అడ్రస్, ఇతర వివరాలు గుర్తించనున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేసి తల్లిదం డ్రులకు పిల్లలను అందజేయడం సులభంగా ఉం టుందని శిక్షణలో ఉన్నతాధికారులు సూచించారు. నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుందని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. -
చిన్నారుల మోములో చిరునవ్వు
నారాయణఖేడ్: బాలలు పనిలో కాదు బడిలో ఉండాలంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా బాలల సంరక్షణ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గతంలో మాదిరిగా ప్రచారానికే పరిమితం కాకుండా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు పనుల్లో పెట్టుకున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వ్యాపార వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. అదే క్రమంలో సదరు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రచార రథాల ద్వారా పల్లెపల్లెన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలను పనిలో పెట్టుకుంటే తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ఆపరేషన్ స్మైల్ జిల్లాలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 107 మంది బాలకార్మికులకు, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 105మందికి విముక్తి కల్పించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను పనుల్లో పెట్టుకోమని లిఖితపూర్వకంగా రాయించుకొని అప్పగించారు. అదే క్రమంలో చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరికలు జారీచేశారు. వారితో లిఖితపూర్వకంగా ధ్రువీకరణ తీసుకున్నారు. అధికారుల చర్యలు వ్యాపారులను హడలెత్తిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో నాలుగు సంరక్షణ కేంద్రాలు.. బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు వారికోసం సంబంధీకులు రాని పక్షంలో వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో దివ్యదిశ హోం, ఖేడ్ మండలం నిజాంపేట్‌లో ఆర్నాల్డ్ హోం, ఇస్నాపూర్‌లో విజనరీ వెంచర్స్‌లో బాలురను ఉంచుతున్నారు. అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ హోంలో బాలికలు, బాలురను ఉంచుతున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించిన తర్వాత మొదటగా జిల్లా కేంద్రంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరుస్తారు. ఇందులో చైర్ పర్సన్‌గా శివకుమారి, సభ్యులుగా న్యాయవాది అశోక్, మహారాజ్, కైలాష్, ఆత్మారాం ఉన్నారు. వీరు పిల్లలతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే పాఠశాలకు పంపడం, హోంలకు రెఫర్ చేయడం చేస్తారు. బాలల చట్టాలపై అవగాహన.. బాలల చట్టాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో 100 గ్రామాలు, నవంబర్‌లో 100 గ్రామా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో వంద పల్లెల్లో ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి బాలల హక్కులు, బాలకార్మిక చట్టాల, అక్రమ రవాణా నిరోధం, లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో మరో వంద గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బాలల హక్కులు.. ♦ 14ఏళ్లలోపు బాలలతో పనిచేయించడం బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 ప్రకారం నేరం. పనిచేయించిన యజమానులకు సెక్షన్ 14 ప్రకారం ఏడాది జైలు, రూ.20వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష. ♦ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మికశాఖ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, చైల్డ్టోల్ఫ్రీ నం: 1098, 100కు ఫిర్యాదు చేయొచ్చు. ♦ బాలల న్యాయచట్టం (సంరక్షణ) బాలలను రెండు వర్గాలుగా పరిగణిస్తోంది. సెక్షన్ 2(1) ప్రకారం 18ఏళ్లు నిండకుండా నేరం చేసిన బాలలను న్యాయమండలి పర్యవేక్షిస్తుంది. సెక్షన్ 2(డి) ప్రకారం వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, జీవనాధారం లేని బాలలు, అనాథ బాలలు, బాలకార్మికులు, పారిపోయిన బాలలు, దీర్ఘకాలిక జబ్బులకు గురైన బాలలు, బాల్య వివాహ బాధిత బాలలు, వేధింపులకు గురైన బాలలకు బాలల సంక్షేమ సమితి పునరావాసం కల్పిస్తుంది. ♦ చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, అమ్ముకోవడం నేరం. పిల్లలను ఇచ్చినా, తీసుకున్నా మూడేళ్ల కారాగార శిక్ష తప్పదు. ప్రభుత్వమే కోర్టు ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తుంది. ♦ బాలలకు భారత రాజ్యాంగం ద్వారా 54 (అధికరణలు) హక్కులు వర్తిస్తాయి. వీటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు ఉన్నాయి. ♦ బాలలను రక్షించడం, హక్కులను కాపాడేందుకు కొన్ని చట్టాలను తెచ్చారు. 18ఏళ్లలోపు ఆడపిల్ల, 21 ఏళ్లలోపు మగ పిల్లలకు వివాహాలు చేయడం 2006 బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం నేరం. ఇలాంటి వివాహాలు చెల్లవు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రొత్సహించినా, సహకరించినా రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. ♦ బాలికలను రవాణా చేయడం అక్రమ రవాణా నిరోధక చట్టం 1956 ప్రకారం నేరం. అక్రమ రవాణా నిరోధానికి ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్, 1098, 100లకు ఫిర్యాదు చేయొచ్చు. చర్యలు తప్పవు బాలలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తాం. పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాం. బాల కార్మిక చట్టాలపై ఇప్పటికే గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహించాం. మరోసారి అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలి.– రత్నం, జిల్లా బాలలసంరక్షణ అధికారి (డీసీపీఓ) -
ఒక్కరూ లేరట..!
బాలకార్మికుల గుర్తింపులో కార్మిక శాఖ విఫలం ఏడాది కాలంలో ఒక్కరినీ గుర్తించిన దాఖలాలు లేవు ఆపరేషన్ స్మైల్‌తో దూసుకెళ్తున్న పోలీసులు ఏడాదిలో 347 మందికి విముక్తి తాజాగా ఐసీడీఎస్ అధికారుల దాడులు సాక్షి, మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక శాఖ మొద్దునిద్రపోతోంది. హోటళ్లు, కార్ఖానాలు, ఇతర వాణిజ్య దుకాణాల్లో బాలకార్మికులు దర్శనమిస్తోన్నా చూసీ చూడ నట్లుగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఒక్క బాలకార్మికుడిని ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేకపోయింది. అసలు జిల్లాలో బాలకార్మికులు లేరనుకున్నారో ఏమో కార్మికశాఖాధికారులు.. శాఖలో ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క.. శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర బందోబస్తులో నిమగ్నమైన పోలీసులు బాలకార్మికులనూ గుర్తిస్తూ.. వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గడిచిన ఆరు నెలల్లో పోలీసులు జిల్లావ్యాప్తంగా 347 మంది బాలకార్మికులను గుర్తించి వారిని స్కూళ్లు.. తల్లిదండ్రులకు అప్పగించారని సాక్షాత్తూ.. జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గడిచిన ఏడాది కాలంలో కార్మిక శాఖాధికారులు ఒక్కరిని కూడా ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేదన్నారు. పట్టింపులేని కార్మిక శాఖ తీరుతో జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ బలపడుతోందనే విమర్శలొస్తున్నాయి. కార్మిక క్షేత్రంలో అధ్వానం.. జిల్లాలోని తూర్పు ప్రాంత పరిధిలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. బాలకార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను పనిలో పెడుతున్నారు. పసి పిల్లల్ని పనిలో పెట్టుకున్న వ్యాపారులు వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా పోలీసులు కేవలం మంచిర్యాల డివిజన్‌లోనే 12 మంది బాలకార్మికులను ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారు. తాజాగా.. ఐసీడీఎస్ అధికారులూ మంచిర్యాల పట్టణంలోని అండాళమ్మ కాలనీ శివారు ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తోన్న ముగ్గురు బాలకార్మికుల్ని గుర్తించారు. అయితే.. ఈ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించాల్సిన కార్మికశాఖాధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తూర్పు జిల్లా పరిధిలో అసలు బాలకార్మికులే లేరు. హోటళ్లు.. కార్ఖానాలు.. ఇటుక బట్టీలు అన్నీ చోట్లా వెతికినా బాలకార్మికులు కానరావడం లేదు. బాలకార్మికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.’ అని మంచిర్యాల కార్మికశాఖాధికారిణి హేమలత వివరణ ఇచ్చారు. ‘ఆపరేషన్’కు నో..! బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన.. అనాథ పిల్లల గుర్తింపే ల క్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు కార్మిక శాఖ సహకారం కొరవడింది. ఆపరేషన్ స్మైల్.. మిస్సింగ్ పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని మంచిర్యాల కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పోలీసులతో బాలకార్మికులను గుర్తించాలంటూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. పోలీసులు బాలకార్మికులను గుర్తించి తమకు సమాచారమందిస్తే వెళ్లి కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోపక్క.. ఆపరేషన్ స్మైల్ లక్ష్యం నెరవేరాలంటే పోలీసులతో పాటు కార్మికశాఖ, ఐసీడీఎస్ అధికారులూ తమతో కలిసి దాడుల్లో పాల్గొనాలని గతేడాది డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేశారని ఆపరేషన్ స్మైల్ మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి లక్షెట్టిపేట ఎస్ఐ శ్రీనివాస్ చెప్పారు. కార్మిక, ఐసీడీఎస్ శాఖల సహకారం లేకున్నా బాలకార్మికుల గుర్తింపునకు పోలీసులు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాఖ తరఫున కృషి చేస్తున్నాం. కానీ.. బాలకార్మికుల సమాచారం మా అధికారులకు అందడం లేదు. బాలలు బడిలోనే ఉండాలి.. అలా కాదని బాలకార్మికులతో పని చేయిస్తే సదరు యజమానులపై కేసులు నమోదు చేస్తాం. బాలకార్మికులు ఎక్కడ కనిపించినా 9492555240కు ఫోన్లో నాకు సమాచారమివ్వండి. వెంటనే స్పందిస్తాం. - జగదీశ్‌రెడ్డి, జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్