పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఓ చిన్నారి అమ్మమ్మ
నగర పోలీసులు ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్‌ను’ వినూత్నంగా చేపట్టారు. దాదాపు 200 హాట్‌స్పాట్స్(వెట్టి, భిక్షాటనకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు)ను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో ఉమ్మడిగా దాడులు జరిపారు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న 325 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్తోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు.
సాక్షి, సిటీబ్యూరో: వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్పించడం... తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్’లో నగర పోలీసులు కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు కేవలం పిల్లలను రెస్క్యూ చేసేవి. అయితే తాజాగా వారు మళ్లీ పని బాటపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న, ఆర్థిక స్థోమతలేని చిన్నారులను బడిలో చేర్పిస్తూ బాధ్యత తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అదనపు సీపీ షికా గోయల్, అదనపు డీసీపీ అబ్దుల్ బారిలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.
ఐదో విడతలో అనేక మార్పులు...
ఈ నెల 1 నుంచి 31 వరకు నగరంలో ఐదో విడత ‘ఆపరేషన్ స్మైల్’ నిర్వహించనున్నారు. ఈసారి ప్రధానంగా వెట్టిచాకిరీలో, భిక్షాటనలో మగ్గుతున్న చిన్నారులపై దృష్టి పెట్టారు. ఓసారి రెస్క్యూ అయిన చిన్నారులు మళ్లీ అదే మార్గంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఆపరేషన్ స్మైల్ కోసం ఒక్కో సబ్–డివిజన్‌కు ఒక్కోటి చొప్పున ఎస్సైల నేతృత్వంలో మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేశారు. గత 27 రోజుల్లో రెవెన్యూ, లేబర్ డిపార్ట్‌మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఈ బృందాలు నగరంలోని 200 ప్రాంతాల్లో చిన్నారుల వెట్టి, బిక్షాటనకు ఆస్కారం ఉన్నట్లు గుర్తించాయి. ఆయా చోట్ల దాదాపు మూడు రోజుల పాటు పరిశీలన చేసిన తర్వాత వరుస దాడులు చేశాయి. ఫలితంగా 11 మంది బాలికల సహా మొత్తం 325 మందిని కాపాడారు.
యాజమాన్యాల వివరాలతో డేటాబేస్...
ఈ రెస్క్యూ అయిన చిన్నారుల్లో ఏడుగురు పదేళ్లలోపు, 38 మంది 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో, మిగిలిన వారు 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. వీరిలో 272 మందిని పూర్తిస్థాయి కౌన్సిలింగ్ తర్వాత తమ కుటుంబీకులకు అప్పగించారు. మరో 53 మంది వివరాలు సరిచూడాల్సి ఉండటంతో వీరిని అంబర్‌పేటలోని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. 14 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం రూ.6.75 లక్షల జరిమానా విధించి వసూలు చేశాయి. ఈ చిన్నారుల్లో ఇద్దరు బిక్షాటన చేస్తుండగా మిగిలిన వారు బ్యాగ్స్ తయారీ, గాజుల కర్మాగారాలు, బిస్కెట్ ఫ్యాక్టరీలు, బేకరీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కార్ఖానాలు, మెకానిక్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు. వీరిలో ఏపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌కు చెందిన వారు 100 మంది ఉన్నారు.
ఆసక్తి ఉంటే చదివిసాం్త..
ఆపరేషన్ స్మైల్ టీమ్స్‌లో ఉన్న ఎస్సైల్లో ఒకరైన తిరుమలగిరికి చెందిన రజిని ఇద్దరు చిన్నారులను, గోల్కొండ ఏఎస్సై రఫియుద్దీన్ మరొకరిని పాఠశాలల్లో చేర్పించారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరు రోడ్డపై పడ్డారన్న విషయం తెలుసుకుని చదువుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఆ ముగ్గురూ ఆసక్తి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు/సంరక్షకుల్ని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఆపై స్థానికంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించి ఉచిత విద్య అందించేలా ఒప్పించి చేర్పించారు. వీరికి అవసరమైన యూనిఫామ్స్, పుస్తకాలను ఆయా అధికారులే కొనిపెట్టారు. చైల్డ్ లేబర్‌ను ప్రోత్సహిస్తూ పదేపదే పట్టుబడుతున్న యాజమాన్యాలను, తరచూ ఇదే బాటపడుతున్న చిన్నారులను గుర్తించడానికి ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment