ఒక్కరూ లేరట..!
Published Fri, Mar 11 2016 3:28 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
బాలకార్మికుల గుర్తింపులో కార్మిక శాఖ విఫలం
ఏడాది కాలంలో ఒక్కరినీ గుర్తించిన దాఖలాలు లేవు
ఆపరేషన్ స్మైల్‌తో దూసుకెళ్తున్న పోలీసులు
ఏడాదిలో 347 మందికి విముక్తి
తాజాగా ఐసీడీఎస్ అధికారుల దాడులు
సాక్షి, మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక శాఖ మొద్దునిద్రపోతోంది. హోటళ్లు, కార్ఖానాలు, ఇతర వాణిజ్య దుకాణాల్లో బాలకార్మికులు దర్శనమిస్తోన్నా చూసీ చూడ నట్లుగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఒక్క బాలకార్మికుడిని ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేకపోయింది. అసలు జిల్లాలో బాలకార్మికులు లేరనుకున్నారో ఏమో కార్మికశాఖాధికారులు.. శాఖలో ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క.. శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర బందోబస్తులో నిమగ్నమైన పోలీసులు బాలకార్మికులనూ గుర్తిస్తూ.. వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గడిచిన ఆరు నెలల్లో పోలీసులు జిల్లావ్యాప్తంగా 347 మంది బాలకార్మికులను గుర్తించి వారిని స్కూళ్లు.. తల్లిదండ్రులకు అప్పగించారని సాక్షాత్తూ.. జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గడిచిన ఏడాది కాలంలో కార్మిక శాఖాధికారులు ఒక్కరిని కూడా ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేదన్నారు. పట్టింపులేని కార్మిక శాఖ తీరుతో జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ బలపడుతోందనే విమర్శలొస్తున్నాయి.
కార్మిక క్షేత్రంలో అధ్వానం..
జిల్లాలోని తూర్పు ప్రాంత పరిధిలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. బాలకార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను పనిలో పెడుతున్నారు. పసి పిల్లల్ని పనిలో పెట్టుకున్న వ్యాపారులు వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా పోలీసులు కేవలం మంచిర్యాల డివిజన్‌లోనే 12 మంది బాలకార్మికులను ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారు. తాజాగా.. ఐసీడీఎస్ అధికారులూ మంచిర్యాల పట్టణంలోని అండాళమ్మ కాలనీ శివారు ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తోన్న ముగ్గురు బాలకార్మికుల్ని గుర్తించారు. అయితే.. ఈ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించాల్సిన కార్మికశాఖాధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తూర్పు జిల్లా పరిధిలో అసలు బాలకార్మికులే లేరు. హోటళ్లు.. కార్ఖానాలు.. ఇటుక బట్టీలు అన్నీ చోట్లా వెతికినా బాలకార్మికులు కానరావడం లేదు. బాలకార్మికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.’ అని మంచిర్యాల కార్మికశాఖాధికారిణి హేమలత వివరణ ఇచ్చారు.
‘ఆపరేషన్’కు నో..!
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన.. అనాథ పిల్లల గుర్తింపే ల క్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు కార్మిక శాఖ సహకారం కొరవడింది. ఆపరేషన్ స్మైల్.. మిస్సింగ్ పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని మంచిర్యాల కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పోలీసులతో బాలకార్మికులను గుర్తించాలంటూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. పోలీసులు బాలకార్మికులను గుర్తించి తమకు సమాచారమందిస్తే వెళ్లి కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోపక్క.. ఆపరేషన్ స్మైల్ లక్ష్యం నెరవేరాలంటే పోలీసులతో పాటు కార్మికశాఖ, ఐసీడీఎస్ అధికారులూ తమతో కలిసి దాడుల్లో పాల్గొనాలని గతేడాది డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేశారని ఆపరేషన్ స్మైల్ మంచిర్యాల డివిజన్ ఇన్‌చార్జి లక్షెట్టిపేట ఎస్‌ఐ శ్రీనివాస్ చెప్పారు. కార్మిక, ఐసీడీఎస్ శాఖల సహకారం లేకున్నా బాలకార్మికుల గుర్తింపునకు పోలీసులు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు.
దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాఖ తరఫున కృషి చేస్తున్నాం. కానీ.. బాలకార్మికుల సమాచారం మా అధికారులకు అందడం లేదు. బాలలు బడిలోనే ఉండాలి.. అలా కాదని బాలకార్మికులతో పని చేయిస్తే సదరు యజమానులపై కేసులు నమోదు చేస్తాం. బాలకార్మికులు ఎక్కడ కనిపించినా 9492555240కు ఫోన్‌లో నాకు సమాచారమివ్వండి. వెంటనే స్పందిస్తాం.
- జగదీశ్‌రెడ్డి, జిల్లా కార్మికశాఖ
సహాయ కమిషనర్
Advertisement
Advertisement