చిత్తూరులో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో వీధి బాలలను గుర్తిస్తున్న జిల్లా పోలీసులు, ఐసీపీఎస్ సిబ్బంది (ఫైల్)
గతి తప్పిన బాల్యం.. గమ్యం లేని ప్రయాణం.. లక్ష్యం లేని జీవితం.. ఎక్కడ పుట్టామో తెలియదు.. ఎలా బతకాలో అర్థం కాదు.. తల్లిదండ్రులు ఉన్నారో లేదో గుర్తులేదు.. అనాథ బాలలు వీరు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ఒకరు.. కుటుంబం నుంచి తప్పిపోయి మరొకరు.. ఇలా జీవన పోరాటంలో భిక్షాటన చేస్తూ.. బాలల సంరక్షణ కేంద్రాలకు చేరిన అభాగ్యులు వారు. ఇలాంటి వారిలో కొందరినైనా సొంత గూటికి చేర్చేందుకు ఆయా ప్రాంతాల్లోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్) సిబ్బందిప్రయత్నిస్తూనే ఉంటారు.
పలమనేరు: పదేళ్ల తర్వాత ఒడిశాలోని చిల్ట్రన్ హోమ్‌నుంచి వీకోట మండలంలోని తన స్వగ్రామమైన బోడిగుట్లపల్లి చేరుకున్న అనామిక కథ తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధువుల చెంతకు చేరిన ఆ బాలిక చిన్న నాటి నుంచి తన వారి చెంతకు చేరాలని తాను పడ్డ తపన.. బాధలు.. వారితో పంచుకుంది. తన లాగే మన జిల్లాకు చెందిన వారు అక్కడి దయావిహార్‌లో ఉన్నారని ఇక్కడి అధికారులకు తెలిపింది. దీంతో వారిని సైతం తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
అమ్మానాన్న చెంతకు చేరాలని ఓ బాలిక ఆరాటం
జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒడిశాలోని పూరి ప్రాంతం నుంచి అక్కడి స్వచ్ఛంద సంస్థల ద్వారా కనాస్ హోమ్‌లో ఉన్నట్టు అనామిక ఇక్కడి ఐసీపీఎస్ అధికారులకు చెప్పింది. తనకు తెలుగు కొద్దిగా వచ్చు కాబట్టి తనతో ఆ బాలిక వివరాలు చెప్పి తనను ఎలాగైనా సొంత ఊరికి చేర్చాలని రోదించిందట. దీంతో ఆబాలిక చిరునామా.. ఫోటోల కోసం ఇక్కడి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయ్‌ది మరోకథ
ఎక్కడినుంచి వచ్చాడో తెలియని విజయ్ తిరుపతిలోని చిల్ట్రన్ హోమ్‌కు ఎనిమిదేళ్ళ క్రితం చేరాడు. ఇప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాల మేరకు పత్తికొండ అడవిలో తమ తల్లిదండ్రులున్నట్టు అక్కడి అధికారులకు తెలిపాడు. దీంతో చిత్తూరు నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లెల శివ ఆ బాలుడి తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు. సంబంధిత అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా చిరునామా అన్వేషణ చేపట్టారు. జిల్లాలో పత్తికొండ గ్రామం గంగవరం మండలంలో ఉన్నట్టు గుర్తించి గత రెండు రోజులుగా స్థానిక సీడీపీవో రాజేశ్వరి సిబ్బంది కలసి ఆరా తీశారు. ఎట్టకేలకు పత్తికొండ సమీపంలోని అటుకురాళ్ళపల్లి అటవీ ప్రాంతంలో విజయ్ తల్లిదండ్రులను కలిశారు. చిన్నప్పుడు తప్పిపోయిన వారి కుమారుడు తిరుపతిలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఆ మాట చెప్పగాని తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారని అధికారి అనుకున్నారు. అయితే వారు ‘‘ఉంటే ఉండనీ.. వాడు ఇక్కడికొస్తే మాలాగే పాములు పట్టి ఆడించుకోవాల్సిందేగా’’ అన్ని నిట్టూర్చినట్టు తెలిసింది. దీంతో చేసిదిలేక విజయ్‌కు ఏదైనా చేతిపని నేర్పించి ఆపై స్వగ్రామానికి పంపేలా అధికారులు భావిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటివారెందరో?
చిన్నతనంలో పారిపోయిన పక్క రాష్ట్రాల్లో వీధిబాలలుగా ఎందరో జిల్లాకు చెందిన చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా వారు పట్టణాల్లోని చిల్డ్రన్ హోమ్‌లకు చేరుతుంటారు. వారిని 18 సంవత్సరాల దాకా మాత్రమే అక్కడ ఉంచుకుంటారు. ఆపై తల్లిదండ్రుల సమాచారం లభిస్తే వారి చెంతకు చేర్చుతుంటారు. లేదంటే వారి దారిన వారిని వదిలేస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కార్యాలయాలుంటాయి. అక్కడి హోమ్‌లోని బాల, బాలికల వివరాల మేరకు సంబంధిత రాష్ట్రం, జిల్లాలకు ఈ కార్యాలయాలనుంచి సమాచారం అందుతుంటోంది. అయితే ఆ అభాగ్యుల భాగ్యం బాగుంటే వారు తల్లిదండ్రులకు చెంతకు చేరే అవకాశం ఉంటుంది. దశాబ్దాల నిరీక్షణలో ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు వద్దకు చేర్చేందుకు సంబంధిత అధికారులు మరింత చొరవ చూపితేనే వారి బతుకులు మారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment