పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, చంద్రగిరి: ఇంటి నుంచి అలిగి తిరుపతికి చేరుకున్న ప్రకాశం జిల్లా బాలికపై లైంగికదాడి చేసిన ఆ ఇద్దరు మృగాళ్లు మొదటి నుంచి నేర చరిత్ర కలిగిన వారే. ఒకడు హత్య కేసులో నిందితుడైతే, మరొకడు మహిళలను వేధించడంలో పెద్ద పోకిరీగా పేరు తెచ్చుకున్నాడు. ‘దిశ’ ఘటన జరిగి దేశ వ్యాప్తంగా అట్టుడుకిపోతున్న తరుణంలోనే బాలికపై లైంగికదాడి జరగడంతో అధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇందులో మొదటి నిందితుడైన తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టుకు చెందిన చిత్తూరు వెంకటేష్ (31) గ్రామంలోని యువతులు, వివాహితులను టార్గెట్ చేస్తూ, వారిని వెంబడిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతిని ప్రేమ వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అనంతరం నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదు. విద్యార్థినులు, మహిళలను వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెబుతున్నా రు. వెంకటేష్ ఆగడాలు శృతిమించడంతో గతంలోతిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు సమాచారం.
రెండో నిందితుడిపై గతంలో హత్య కేసుతో పాటు పలు కేసులు
బాలికపై లైంగికదాడి కేసులో రెండో నిందితుడైన బుక్కే రాజమోహన్ నాయక్ (28) తిరుపతిలోని ఐఎస్ మహల్ వద్ద గతంలో భార్గవ్ అనే యువకుడి హత్య కేసులో ఏ–6 నిందితుడిగా ఉన్నాడు. 2017 డిసెంబర్ 3న భార్గవ్‌ను కిరాతకంగా అంతమొందించారు. హత్య కేసు (167/2017 అండర్ సెక్షన్ 147, 148, 341, 302, 201, ఆర్/డబ్లు్య149 ఐపీసీ) నమోదు చేశారు. అప్పట్లో వెస్ట్ పోలీసులు రాజమోహన్‌నాయక్‌పై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. అంతకుముందు కూడా కళాశాల విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ, పలు అసాంఘిక కార్యకలాపాలను చేస్తుండేవాడని తెలిసింది. మొదటి నుంచి నేర చరిత్ర కలిగి, సెటిల్‌మెంట్లు చేస్తూ తరచూ గొడవలకు పాల్పడేవాడని స్థానికులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా గతంలో భార్యను వరకట్న వేధింపులకు గురిచేయడంతో మహిళా పోలీసు స్టేషన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. వీటితో పాటు తిరుపతి పరిధిలోని పోలీసు స్టేషన్లలో అతనిపై పలు కేసులు నమోదై ఉండటం గమనార్హం! ఇంతటి నేర చరిత్ర కలిగిన వారిపై తిరుచానూరు పోలీసులు నిఘా ఉంచకపోవడంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు విమర్శలొస్తున్నాయి. లిఫ్ట్ అడిగిన పుణ్యానికి బాలికను వంచించి, లైంగికదాడి చేసిన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలంటూ పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, బాలికను తీసుకెళ్లేందుకు నిందితులు ఉపయోగించిన టీఎన్ 73 ఎస్ 2469 నలుపు రంగు బజాజ్ పల్సర్ బైక్, సీబీఆర్ 250 సీసీ ఏపీ 03సీఎక్స్ 5503 మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి)
Comments
Please login to add a commentAdd a comment