హైదరాబాద్ విదేశంలా కనిపిస్తోందా?
- ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ కవిత
- తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని వ్యాఖ్య
- టీఆర్‌ఎస్ మహిళా సభ్యత్వ నమోదు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి పాలన చేస్తుంటే... విదేశాల్లో ఉండి పాలన చేస్తున్నట్టు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని ఎంపీ కవిత మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవా రం టీఆర్‌ఎస్ మహిళా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. తొలి సభ్యత్వం మహిళా విభాగం కన్వీనర్ తుల ఉమ తీసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచవద్దని, పాలనాపరమైన ఇబ్బం దులు ఉంటాయని నాడే చెప్పామని అన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, హైటెక్ సిటీ నిర్మించానని గొప్పలు పోయిన చంద్రబాబు, ఇపుడు అదే హైదరాబాద్‌ను విదేశంతో పోలుస్తున్నారని, అలాంటి విదేశంలో టీడీపీ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన ఏపీఎన్జీవో నేత ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
సగం సభ్యత్వం మహిళలదే కావాలి
‘మహిళలను ఆకాశంలో సగం అంటున్నారు. సభ్యత్వంలోనూ యాభై శాతం మించాలి’ అని కవిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారని, జిల్లాల్లోనూ నిర్భయ కేంద్రాలు తెరిచారని, షీ టీమ్స్ ఏర్పాటు చేశారని వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మహిళా విభాగం కన్వీనర్ తుల ఉమ పేర్కొన్నారు. పది జిల్లాల్లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యురాలు సత్యవతీ రాథోడ్, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.