బాలికలకు ఆరోగ్య రక్ష కిట్లను అందిస్తున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
హుస్నాబాద్ : హస్టల్ విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వానిది కన్నతల్లి ప్రేమ అని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హుస్నాబాద్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బాలిక ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలిక ఆరోగ్య రక్ష పథకం కింద జిల్లాలో 26,460 కిట్ల పంపిణీకి ఒక్కో దానికి రూ.1300 చొప్పున రూ. 3.50 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే మంచి పౌష్టికారం అందించి, విద్యార్థి దశలోనే అత్యున్నత ప్రమాణాలతో వసతులు కల్పిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్ధి ప్రగతిపై నిత్యం పది నిమిషాలు ప్రత్యేక సమయం కేటాయించాలని కోరారు.
తల్లిదండ్రులతో సైతం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ విధానాన్ని ఈ కస్తూర్బా విద్యాలయం నుంచి నాంది పలకాలని, ఇక్కడి స్ఫూర్తితోనే రాష్ట్రమంతా అమలులోకి వచ్చెలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.1.25లక్షలు ఖర్చు పెడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా సిద్దిపేట జిల్లా నుంచే శ్రీకారం చుట్టి అమలు చేస్తూ విజయవంతం చేశామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో 6 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, ఇక్కడి నుంచే పది జిల్లాలకు నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్నారు. కస్తూర్బా విద్యాలయం ఆవరణలో సీసీ కెమెరాతో పాటు భవనానికి రంగులు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీఈఓ రవికాంత్‌రావు, ఆర్డీఓ శంకర్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ మంగ, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ రాము, ఏఎంసీ చైర్మన్ లింగాల సాయన్న, టీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, బాలికల విద్యాధికారి బండారి మనీల, కౌన్సిలర్ దండి లక్ష్మి, ఎస్‌ఓ మమత, కో ఆర్టినేటర్ కక్కెర్ల రవీందర్ పాల్గొన్నారు.
సమీకృత భవన నిర్మాణ స్థలం పరిశీలన
పట్టణంలోని సబ్‌స్టేషన్ పరిధిలో సమీకృత భవనం కోసం స్థలాన్ని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వం సమీకృత భవన నిర్మాణం కోసం రూ.17కోట్లు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణం కోసం కిషన్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపన చేశారు. దూరంగా నిర్మించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని పలువురు సూచించడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. సబ్ స్టేషన్ వద్ద ఉన్న స్ధలాన్ని, సర్వే మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. పట్టణం ఆకృతి, ఆర్డీఓ కార్యాలయం, కిషన్‌నగర్‌లోని స్థలం, సబ్ స్టేషన్ సమీపంలోని స్థలాలను మ్యాప్ ద్వారా నివేదికను అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జేసీ పద్మాకర్, ఆర్డీఓ శంకర్‌కుమార్, తహసీల్దార్ విజయ సాగర్, ఆర్‌ఐ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘గౌరవెల్లి’ పనుల పరిశీలన
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 28న ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు 15మంది అధికారులతో బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కలెక్టర్ వెంట జేసీ పద్మాకర్, ఆర్డీఓ శంకర్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment