
మౌనంగా నా పని నేను చేసుకుపోతున్నా: కెసిఆర్
హైదరాబాద్: మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. తొమ్మిది మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి రాజకీయ చేరికలు కావన్నారు. తెలంగాణ ఐక్యతకు ఇది నిదర్శనం అన్నారు.
తమ పిల్లలు ఆంధ్ర పిల్లలే అని మంత్రులే గవర్నర్ వద్ద డిక్లేర్ చేశారని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలో ఏ విధంగా కొనసాగుతారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయం మొదలుకొని కరెంట్ వరకూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు.