
గజ్వేల్ రూపురేఖలు మారుస్తా : సీఎం కేసీఆర్
సంగారెడ్డి (మెదక్) : గజ్వేల్ పట్టణం ఏం సక్కగలేదు.. నా సొంత నియోజకవర్గ పరిస్థితులు ఇలా ఉంటాయని ఊహించలేదు.. పట్టణం రూపు రేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తా’నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.
సంగారెడ్డి (మెదక్) : గజ్వేల్ పట్టణం ఏం సక్కగలేదు.. నా సొంత నియోజకవర్గ పరిస్థితులు ఇలా ఉంటాయని ఊహించలేదు.. పట్టణం రూపు రేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తా’నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ లో పర్యటించారు. పట్టణమంతా కలియతిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు పట్టణ అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ మహిళలు సీఎంకు హారతులు పట్టారు. మీకు పదివేల జీతం ఇద్దామనుకున్నా అయితే కుదరలేదు.. వచ్చేసారి వేతనాలు మరింత పెంచుతా’నంటూ వారి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు సీఎం హెలిపాడ్ వద్ద స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ తదితరులపై తేనెటీగలు దాడి చేయటంతో ఎవరికి వారు పరుగులు తీశారు. గజ్వేల్ పట్టణమంతా కలియతిరిగిన సీఎం సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో మంత్రులు హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి కలియతిరిగారు. తహశీల్ కార్యాలయం, హౌసింగ్ కాలనీ, రైతుబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత పాండవుల చెరువును కోటమైసమ్మ దగ్గర ఉన్న ఎస్సీ కాలనీని పరిశీలించారు.