సీఎం హామీ కోసం నిరాహార దీక్ష: మాజీ ఎంపీ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 2014 ఆగస్టు 5న పర్యటించిన సమయంలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ అమలు కానందుకు నిరసనగా ఆగస్టు 5న ఆమరణ నిరాహర దీక్ష చేపడతానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మూడేళ్ల కింద కరీంనగర్ పర్యటనలో హామీ ఇచ్చిన మెడికల్ కళాశాలకు ఎన్‌వోసీ కూడా తెప్పించలేకపోయారని, కేవలం తొమ్మిది కేసీఆర్‌నెలల కింద సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇవ్వడమే కాకుండా వెయ్యి కోట్ల నిధులు మంజూరు, అటానమస్ అనుమతులు కూడా వచ్చి ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వానికి రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ జిల్లాపై కేసీఆర్ సవతితల్లి ప్రేమను చూపిస్తూ సొంత జిల్లా సిద్దిపేటకు వరాల జల్లు కురిపిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అద్దం తునకలాగా కరీంనగర్ జిల్లాను చేస్తానన్న కేసీఆర్ జిల్లాల విభజన పేరిట జిల్లాను ఏడు ముక్కలు చేసి ప్రజలను గందరగోళంలో పడేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులకు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఐదేళ్లుగా ఎంపీగా ఉండి తాను చేసిన అభివృద్ధిపై, టీఆర్‌ఎస్ హయాంలో (కేసీఆర్, వినోద్‌కుమార్) ఎంపీలుగా ఎనిమిదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.