ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం | IAS approved by the division of the Prime Minister | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం

Published Thu, Dec 25 2014 1:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం - Sakshi

ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం

* ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులతోనే జాబితా ఖరారు
* ఏపీకి 166, తెలంగాణకు 128 మంది ఐఏఎస్‌లు
* ఐపీఎస్‌ల్లో ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది
* ఆంధ్రాకు 71, తెలంగాణకు 56 మంది ఐఎఫ్‌ఎస్‌లు
* ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ సహానీ తెలంగాణకు.. పీవీ రమేష్ ఆంధ్రాకు
* జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కూడా ఏపీకే
* పక్షం రోజుల్లోగా అభ్యంతరాల స్వీకరణ, 3 నెలల్లో తుది కేటాయింపు

 
 సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల తాత్కాలిక కేటాయింపులకు(ప్రొవిజినల్ అలాట్‌మెంట్) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆమోదముద్ర వేశారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన తుది సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనుంది. తర్వాత వారం రోజుల్లోగా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపులపై ఏవైనా అభ్యంతరాలుంటే.. పక్షం రోజుల్లోగా తెలియచేయాలని, అలాగే పరస్పర మార్పిడి(స్వాపింగ్), భార్యాభర్తల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే.. వాటిని పరిశీలించి మూడు నెలల్లోగా తుది జాబితాను ప్రధాని ఆమోదంతో కేంద్రం ప్రకటిస్తుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. జూన్ ఒకటో తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మంది ఐఏఎస్ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 166 మందిని, తెలంగాణకు 128 మందిని కేటాయించారు.
 
  అలాగే 211 మంది ఐపీఎస్‌ల్లో ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది, ఇక 127 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో ఏపీకి 76 మంది, తెలంగాణకు 51 మంది దక్కారు. ఈ అధికారుల విభజన కోసం గత మార్చి 28న ప్రత్యూష్ సిన్హా కమిటీని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారుల నుంచి సీల్డ్ కవర్‌లో ఆప్షన్ ఫారాలను కమిటీ తీసుకుంది. జూన్ 2న రాష్ర్ట విభజన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ కమిటీలో సభ్యులుగా చేరారు. అధికారులిచ్చిన ఆప్షన్‌లు, రోస్టర్ విధానాన్ని అనుసరించి తొలి జాబితాను ఆగస్టు 22న కమిటీ ప్రకటించింది. ఈ సమయంలోనే.. ఏ అధికారి ఏ రాష్ట్రానికి ఆప్షన్(ఐచ్చికం) ఇచ్చారన్న విషయాన్నీ వెల్లడించింది. అధికారుల ఆప్షన్లతో సంబంధం లేకుండా రోస్టర్ పద్ధతిలోనే రెండు రాష్ట్రాలకు కేటాయించారు.
 
 ఆ తర్వాత పక్షం రోజుల గడువులో 70 మంది అధికారులు తమ అభ్యంతరాలను కమిటీకి అందించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను అక్టోబర్ 10న ప్రత్యూష్ సిన్హా కమిటీ వెల్లడించగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రధాని కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైలు వెనక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మరో రెండు సార్లు కమిటీ సమావేశమై కేటాయింపులను ఖరారు చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారులను ఇన్‌సైడర్లుగా పరిగణించి వారు చదువుకున్న ప్రాంతం, సర్వీస్‌లో చేరడానికి ముందు వారిచ్చిన పోస్టల్ అడ్రస్‌ల ఆధారంగా పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించింది. రాష్ర్టేతర అధికారులను రోస్టర్  విధానంలో విభజించింది. దీంతో ఎట్టకేలకు రూపొందిన తుది తాత్కాలిక జాబితాకు ప్రధాని ఆమోదం లభిం చింది. దీనిపై 15 రోజుల్లోగా వచ్చే అభ్యంతరాలన్నింటినీ మూడు నెలల్లో పరిష్కరించి తుది జాబితాను కేంద్రం విడుదల చేయనుంది.
 
 ఆంధ్రాకు పీవీ రమేశ్, సోమేశ్‌కుమార్ తెలంగాణకు బినయ్‌కుమార్
తాత్కాలిక కేటాయింపులో భాగంగా తెలంగాణ కేడర్‌లోకి వచ్చిన డాక్టర్ పీవీ రమేశ్‌ను తాజా జాబితాలో ఆంధ్రాకు కేటాయించారు. కాగా, గత జాబితాలో మార్పులకు కారణమైన బినయ్‌కుమార్ తాజా జాబితాలో తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం ఏపీ కేడర్‌లో ఉన్న నీలం సహానీ, ఆమె భర్త అజయ్ సహానీ ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది.
 
 అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యకార్యదర్శిగా ఉన్న అజయ్ సహానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. చందనాఖన్, ఎస్‌పీ సింగ్, అజయ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రాకు కేటాయించాలంటూ జేఎస్‌వీ ప్రసాద్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చినట్లు సమాచారం. ఆయనను తెలంగాణాకే కేటాయించింది. తెలంగాణలో ఉన్న బీపీ ఆచార్య, నీరబ్‌కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలిని మిశ్రా, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రాకు కేటాయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement