ఆర్మూర్: అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తూ సక్రమంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాల్సిన సూపర్‌వైజర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేసవి కాలంలో చెల్లించాల్సిన బిల్లులు, వేతనాల కోసం ప్రతి కేంద్రం నుంచి రూ. 700 చొప్పున ముడుపులు వసూలు చేస్తున్నారు.
సెక్టార్ లీడర్ల సహకారంతో సూపర్‌వైజర్లు చేస్తున్న ఈ అక్రమ వసూళ్లలో సీడీపీవోతో పాటు జిల్లా స్థాయి అధికారులకు భాగం ముట్టజెప్పాల్సి ఉంటుందని చెపుతూ వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారు. అసలే ఐదు నెలలుగా వేతనాలు అందని అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పైస్థాయి అధికారులు బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఏంచేయాలో పాలు పోక వారు అడిగినంత ముట్టజెపుతున్నారు. ఆర్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోనే 2 లక్షల 20 వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా ఇదే తంతు కొనసాగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 18 లక్షల రూపాయలు అక్రమ వసూళ్లు జరిగినట్లు సమాచారం.
ఆర్మూర్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్టు పరిధిలో ఆర్మూర్ అర్బన్, ఆర్మూర్ అర్బన్ 2, మామిడిపల్లి, పిప్రి, దేగాం, జక్రాన్‌పల్లి, అర్గుల్, బాల్కొండ, ముప్కాల్, మెండోర, నందిపేట, బజార్‌కొత్తూరు, డొంకేశ్వర్‌లలో కలిపి 13 సెక్టార్లు ఉన్నాయి. ఈ 13 సెక్టార్లను ఐసీడీఎస్ ఆర్మూర్ సీడీపీవో ఆధ్వర్యంలో 13 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలో 326 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 318 మంది కార్యకర్తలు, 304 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వేసవి కాలంలో ఎండ వేడిమి కారణంగా కేంద్రానికి పిల్లలు, బాలింతలు, గర్భిణులు రావడానికి ఇబ్బందులు పడతారు కాబట్టి తమకు కూడా వేసవి సెలువులు మంజూరు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను కోరారు.
దీంతో కేంద్రంలో 15 రోజులు కార్యకర్త, 15 రోజులు ఆయా విధులు నిర్వహించాలని జిల్లా స్థాయి అధికారులు సూచించారు. ఏప్రిల్, మేనెల ముగిసిపోయాయి. అయితే ఈ వేసవి కాలంలో కార్యకర్తలకు, ఆయాలకు వేతనాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల బిల్లులు చేయాల్సిన బాధ్యత సూపర్‌వైజర్లపై ఉంటుంది. ఇక్కడే భారీ అవినీతికి బీజం పడింది. మీరు వేసవి కాలంలో పని చేయకున్నా మీకు వేతనాలు, బిల్లులు ఇస్తున్నాము కాబట్టి ప్రతి అంగన్‌వాడీ కేంద్రం నుంచి రూ. 700 చెల్లించాల్సిందేనంటూ సూపర్‌వైజర్లు హుకుం జారీ చేశారు.
సూపర్‌వైజర్లకు ముడుపులు వసూలు చేసి పెట్టే బాధ్యతను సెక్టార్ లీడర్లు తమ భుజాలపై వేసుకొని సెక్టార్ మీటింగ్‌లు పెట్టి మరీ వసూళ్లు చేసారు. ఈ ముడుపుల్లో సీడీపీవో, జిల్లా స్థాయి అధికారులకు సైతం భాగం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో చాలీ చాలని వేతనాలతో నాలుగు, ఐదు నెలల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పులు చేసి మరీ ముడుపులు అప్పజెప్పారు. ఒక ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలోనే 2 లక్షల 20 వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా..
నిజామాబాద్ ఐసీడీఎస్ పరిధిలో 10 ప్రాజెక్టులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, దోమకొండ, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూరు ప్రాజెక్టుల పరిధిలో 2,708 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటాయి. వీటిని సుమారు వంద మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో సైతం సూపర్‌వైజర్లు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ మొత్తం సుమారు 18 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అక్రమ వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము..
అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాము. ప్రతి నెలా బిల్లుల కోసం రూ. 200 చొప్పున వసూలు చేసిన మాట వాస్తవమే. వేసవి బిల్లుల విషయంలో సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాము.
- శైలజ, సీడీపీవో, ఐసీడీఎస్ ఆర్మూర్
ఐసీడీఎస్‌లో అక్రమ వసూళ్లు
Published Mon, Jun 13 2016 9:27 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement