ఐడీ.. ఆడిందే ఆట! | ID .. adinde game! | Sakshi
Sakshi News home page

ఐడీ.. ఆడిందే ఆట!

Published Tue, Oct 7 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

ఐడీ.. ఆడిందే ఆట!

ఐడీ.. ఆడిందే ఆట!

వేములవాడ, సిరిసిల్ల ఏరియాల్లో ఐడీ పార్టీ సిబ్బందిలోని కొందరు ఇటీవల దసరా మాముళ్లకు దిగడం వివాదస్పదమైంది.
     జగిత్యాల డివిజన్‌లోని ఓ సర్కిల్‌లో ఐడీ పార్టీకి చెందిన సిబ్బంది కొందరు మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
     అనేక సర్కిళ్లలో ఇసుక అక్రమ రవాణా, గుడుంబా అమ్మకాలు వంటి అంశాల్లోనూ ఐడీ పార్టీ సిబ్బంది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయన్న ఫిర్యాదులున్నాయి.
     కొన్ని చోట్ల ఐడీ పార్టీ సిబ్బంది ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని సిబ్బందిపై చాడీలు చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి.

 
 కోరుట్ల:
 సాధారణ పోలీసు సిబ్బందిలో కొందరిని ఎంపిక చేసి ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పేరిట ఐడీ పార్టీలు ఏర్పాటు చేయడం.. సదరు ఐడీ పార్టీల తీరు కొన్ని ప్రాంతాల్లో వివాదస్పదం కావడం తెలిసిందే. ఈ క్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ అన్ని ఐడీ పార్టీలను రద్దు చేసే యోచన చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయంగా మారింది. ప్రత్యేకమైన నేరాల పరిశోధన కోసం కాస్త చురుకైన సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఐడీ పార్టీలను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ ఐడీ పార్టీల సిబ్బంది కొన్ని సర్కిళ్లలో నేర పరిశోధనలో తమ చాకచక్యాన్ని ప్రదర్శించడం కన్నా.. తాము ప్రత్యేకమన్న రీతిలో ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం సమస్యాత్మకంగా మారింది. దీంతో ప్రజల్లోనూ.. పోలీస్ సిబ్బందిలోనూ ఐడీ పార్టీలు వివాదాస్పదవుతున్నాయి. ఐడీ పార్టీలు అవసరం లేదన్న వాదనలు బలపడుతున్నాయి.

 పక్కతోవ పడుతున్నాయి..
 ఐడీ పార్టీలను ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేస్తుంటారు. జిల్లాలో మొత్తం 68 పోలీస్‌స్టేషన్లు, 18 సర్కిళ్లు ఉండగా దాదాపు అన్ని సర్కిళ్లలోనూ అక్కడి పోలీసు అధికారులు ఐడీ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో జరిగే భారీ చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు, హత్యలు తదితర నేరాల విచారణలో ఈ ఐడీ పార్టీలు క్రియాశీలకంగా పనిచేసి నేరస్తులను పట్టుకోవడంపై దృష్టి పెట్టి అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఈ విధుల నిర్వహణను పక్కనబెడుతున్న ఐడీ పార్టీ సిబ్బంది జిల్లాలోని చాలా చోట్ల ఆయా సర్కిల్ అధికారులకు మాముళ్లు వసూలు చేసి పెట్టే సొంత పార్టీలుగా మారిపోయాయి. అధికారుల అండ ఉండటంతో ఐడీ పార్టీల సిబ్బంది అదనపు సంపాదనకు అర్రులు చాస్తున్నారు.
 సిబ్బందిలో విభేదాలు
 పోలీసు సిబ్బందిలోనే కొందరికి ఐడీ పార్టీ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అనేక ఠాణాల్లో సిబ్బంది మధ్య విభేదాలకు తావిస్తోంది. జిల్లాలోని కొన్ని సర్కిళ్లలో ఉన్న ఐడీ పార్టీ సిబ్బంది ఆయా సర్కిల్, ఠాణా ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ తమకు సరిపడని పోలీసు సిబ్బందిపై లేనిపోనివి కల్పించి చెబుతున్నారన్న అనుమానాలు సిబ్బందిలో నెలకొంటున్నాయి. ఇటీవల కోరుట్ల సెగ్మెంట్‌లోని ఓ ఠాణాలో పోలీసు సిబ్బంది ఐడీ పార్టీ తీరుపై అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా అనేక ఠాణాల్లో ఐడీ పార్టీతో సాధారణ సిబ్బందికి విభేదాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యం. దీంతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది చాలాచోట్ల ఏళ్ల తరబడి పాతుకుపోవడం గమనార్హం. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉండగా ఐడీ పార్టీ సిబ్బందిలో పనిచేస్తున్న చాలామంది కానిస్టేబుళ్లు సర్కిల్ స్థాయి అధికారుల అండతో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీమళ్లీ డెప్యుటేషన్ పేరిట పాత స్థానాలకు వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ ఐడీ పార్టీలు వివాదస్పదం కావడానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఐడీ పార్టీలు అవసరం లేదన్న నిర్ణయానికి డీజీపీ రావడం పట్ల పోలీసు వర్గాల్లోనే కొందరు హర్షం వ్యక్తం చేస్తుండటం విశేషం.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement