పల్లె పొమ్మంది.. వలస రమ్మంది!
బతుకుదెరువు కోసం గిరి‘జనం’ పట్నం బాటపట్టారు. మూణ్నెల్లుగా పనులు లేకపోవడం, జీవనం భారంగా మారడంతో వలసే శరణ్యమైంది. భర్త విడిచి వెళ్తున్న నవవధువు.. అమ్మకు దూరమవుతున్న కొడుకు.. పిల్లలను ఇంటివద్దే ఉంచి వెళ్తున్న తల్లి.. ఎవరిని తట్టినా కంటినిండా శోకం. ఆత్మీయులను విడిచి వెళ్తున్నామన్న దిగులును బిగపట్టి ఆ వలసకూలీలు బస్సులో ఎక్కారు. ఊరిని వదులుతున్నామన్న బాధ, వెళ్లకపోతే బతలేమన్న భయం.. వెరసి ఇష్టం లేకున్నా నవాబ్‌పేట మండలంలోని పలు గిరిజన తండాల నుంచి గురువారం ఇలా ముంబైకి పయనమయ్యారు.
నవాబుపేట: ఈ ఏడాది జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే చేతికొచ్చాయి. పత్తి, కంది తదితర పంటలు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడునెలలుగా గ్రామాల్లో పనులు దొరకడం లేదు. వచ్చేది ఎండకాలం ఉండటంతో ఉపాధి దొరకదని భావించి మండలంలోని హజిలాపూర్ గ్రామ పంచాయతీ కుమ్మరిగడ్డ, పుణ్యనాయక్ తండాలకు చెందిన 10 గిరిజన కుటుంబాలు ముంబాయి బాట పట్టాయి. గురువారం మూటముళ్లె సర్దుకుని నవాబ్‌పేట నుంచి వలసవెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పనులు లేకపోవడంతోనే ముంబై వెళ్లాల్సి వస్తోందని పలువురు వలస కూలీలు వాపోయారు. నాలుగు పైసలు సంపాదించి మరో ఆర్నెళ్లకు వస్తామని సెలవిచ్చారు.