ఇదేమి నిర్వాకం! | Idhem nirvakam | Sakshi
Sakshi News home page

ఇదేమి నిర్వాకం!

Published Sun, Jul 5 2015 12:09 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Idhem nirvakam

మొయినాబాద్ : సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్‌ఎస్‌సీ) బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. విద్యార్థుల జవాబుపత్రాలను తారుమారు చేసి ఫెయిల్ చేయడమే కాకుండా రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితా(మొమో)ను పంపింది. ఈ నిర్వాకం మండల పరిధిలోని రెడ్డిపల్లి పాఠశాలలో వెలుగుచూసింది. మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 24 మంది విద్యార్థులు పదో తరగతి చదివారు. మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పరీక్షలు రాశారు. మే నెలలో వచ్చిన ఫలితాల్లో ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

ఇంగ్లీషులో ఫెయిల్ అయిన ఎం.వైష్ణవి, సామాన్యశాస్త్రంలో ఫెయిల్ అయిన చందు రూ.1000 చెల్లించి మే 30లోపు రీ వెరిఫికేషన్ కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకంటే ముందే వారు రాసిన జవాబుపత్రాల జీరాక్స్ కాపీలు పంపాల్సి ఉంటుంది. అయితే పరీక్షలకు ముందు వివరాలు రాకపోవడంతో ఇద్దరు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు.

 అంతా గందరగోళం..
 ఈనెల 2న ఎస్‌ఎస్‌సీ బోర్డు వారు వైష్ణవి రాసిన జవాబుపత్రాల జీరాక్స్ కాపీలు పంపకుండా పాసైనట్లు మార్కుల జాబితాను పాఠశాలకు పంపారు. అదీ కంప్యూటర్ ప్రింటు కాకుండా చేతిరాతతో ఉంది. చందుకు సంబంధించి జవాబుపత్రాల జీరాక్స్ కాపీలను మాత్రం పంపారు. ఇందులో ఓఎంఆర్ షీటు చందుకు సంబంధించినది కాగా జవాబుపత్రాలు మాత్రం వేరే విద్యార్థికి సంబంధించినవి ఉన్నాయి. చందుకు సామాన్యశాస్త్రం మొదటి పేపర్‌లో 19 మార్కులు వచ్చాయి. రెండో పేపర్లో 4 మార్కులు మాత్రమే వచ్చాయి. రెండో పేపర్‌కు సంబంధించిన జవాబుపత్రం తారుమారు కావడంతోనే తాను ఫెయిల్ అయినట్లు చందు పేర్కొంటున్నాడు. తాను రాసిన రెండో పేపర్ జవాబు పత్రాలు పంపిఉంటే అసలు విషయం తెలిసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

 చందు విషయంలో ఇలా జరిగింది..: పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇచ్చే ఓఎంఆర్ షీటులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 భాగాలు ఉంటాయి. ఓఎంఆర్ షీటుకు జవాబుపత్రం జతచేసినప్పుడు పార్ట్ 1పై ఉన్న బార్‌కోడ్ నంబర్‌ను, పార్ట్ 2, పార్ట్ 3లపై వేస్తారు. జవాబుపత్రాలను దిద్దే సమయంలో ఓఎంఆర్ షీట్ నుంచి పార్ట్ 1ని తొలగిస్తారు. పార్ట్ 2, పార్ట్ 3 భాగాలు జవాబు పత్రాలకే ఉంచుతారు. జవాబుపత్రాలు దిద్దిన తరువాత  ఓఎంఆర్ షీట్ పార్ట్ 2, పార్ట్ 3లపై ఉన్న బార్‌కోడ్, పార్ట్ 1 బార్‌కోడ్‌లను సరిచూసి జతచేస్తారు. ఇక్కడ విద్యార్థి చందుకు సంబంధించిన ఓఎంఆర్ షీటు పార్ట్ 1కు 1537131308 నంబరు గల విద్యార్థికి సంబంధించిన జవాబుపత్రాన్ని జతపర్చారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు పంపిన జవాబుపత్రాల జీరాక్స్ కాపీల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చందుకు సంబంధించిన ఓఎంఆర్ షీటు పార్ట్ 1పై క్రమసంఖ్య 49 ఉండగా దానికి జతచేసిన జవాబుపత్రంపై క్రమసంఖ్య 149 ఉంది.
 
 జీవితంతో ఆటలు..
 పదో తరగతిలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తానన్న నమ్మకం ఉండేది. ఫలితాలు చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. పేదరికంలో ఉండికూడా ఎంతో కష్టపడి చదివాను. ఆ నమ్మకంతోనే రూ.1000 చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశాను. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించి పరీక్ష రాశాను. చివరికి ఈనెల 2న నేను పాసైనట్లు పాఠశాలకు మెమో వచ్చింది. అసలు ఏం జరిగిందో అర్థంకావడంలేదు. అధికారులు నా జీవితంతో ఆడుకున్నారు.      
 - ఎం.వైష్ణవి
 
 మమ్మల్ని బలిచేస్తారా?
 పదో తరగతి సామాన్యశాస్త్రంలో నేను ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. రీ వెరిఫికేషన్‌కోసం దరఖాస్తు చేశాను. జవాబు పత్రాలు పాఠశాలకు పంపారు. సామాన్యశాస్త్రం రెండో పేపర్ ఓఎంఆర్ షీటుకు మరో విద్యార్థికి చెందిన జవాబుపత్రం జతచేసి ఉంది. దానిపై హాల్‌టికెట్ నంబర్, క్రమసంఖ్య వేరుగా ఉన్నాయి. నేను రాసిన జవాబుపత్రం ఏమైనట్టు? అధికారుల తప్పులకు మమ్మల్ని బలిచేశారు.
 - చందు
 
 అధికారుల తప్పిదంతోనే..
 మా పాఠశాలలో బాగా చదివే విద్యార్థులే ఫెయిల్ అయ్యారు. ఫలితాలు చూసి మేమే ఆశ్చర్యపోయాం. వైష్ణవి, చందు ఎలా ఫెయిలయ్యారని మదనపడ్డాం. రీ వెరిఫికేషన్ పెడితే ఇద్దరి ఫలితాల్లో తప్పిదాలు జరిగినట్లు తెలిసింది. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
 - వెంకటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement