తప్పుచేస్తే వేటు తప్పదు
ఖమ్మం జెడ్పీసెంటర్ :‘పేదలు సంతోషంగా ఉండాలి, అప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది.. గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి జిల్లా అధికార యంత్రాంగం వరకు పట్టుదలతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. వచ్చే నాలుగున్నర ఏళ్లలో చేపట్టే అభివృద్ధి పనులు, జిల్లా స్థాయి అధికారులతో వివిధ శాఖల పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదేళ్లుగా పాలన స్తంభించిందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన భాధ్యత అధికారులదేనని చెప్పారు. ఇప్పటివరకు సాగిన పాలన వేరని, నెల రోజుల్లో పాలన గాడిలో పడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పట్టాలకు ఇంతవరకు భూమి పంపిణీ చేయలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉద్యోగులపై పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సరిగా పని చేయకపోవడం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇకనుంచి పాలన పటిష్టంగా ఉండాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందించాలని, అనర్హులకు ఇవ్వడం నేరమని చెప్పారు. కొందరు అధికారులు చేసిన తప్పులతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని సూచించారు.
అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే ఉండదని, అధికారులు కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్‌గా మార్చాలని కోరారు. మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. చెరువుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని, అవసరమైతే చెరువు కట్టలపైనే పడుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, ఈలోగా పాలన గాడిలో పడాలని అన్నారు. గుండాల రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు.
జిల్లా అభివృద్ధికి గుండాల ఆదర్శంగా ఉండేలా అధికారులు పని చేయాలన్నారు. 30 ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నా ఒక్కటి కూడా చెట్టుగా ఎదగలేదని, అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుం డా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఉన్నాయని, అయితే వైద్యులు మాత్రం అందుబాటులో ఉండడం లేదని, ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జేసీ సురేంద్రమోహన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు బాణోతు మదన్‌లాల్, కోరం కనకయ్య, అటవీ సంరక్షణ అధికారి ఆనందమోహన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పింగళి సతీష్‌కుమార్, నీటిపారుల శాఖ అధికారి సుధాకర్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, డీఎంసీఎస్ సాంబశివరావు, డీఆర్వో శివశ్రీనివాస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ భానుప్రకాష్, డీఎఫ్‌ఓలు ప్రసాద్, సతీష్ పాల్గొన్నారు.