సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలిగేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఒక్కో కొత్త జిల్లాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) నిర్ణయించింది. అలాగే తగిన వసతులు, సౌకర్యాలు ఉన్న గురుకులాలను సీవోఈలుగా అప్‌గ్రేడ్ చేసేలా కార్యాచరణ రూపొందించింది.
ఇప్పుడున్నవి రెండే..
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు మాత్రమే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒకటి, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో మరొకటి ఉంది. గురుకుల కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. ఈ సీవోఈల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అక్కడ ఇంటర్ తరగతులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్‌ను కూడా అందిస్తారు. ఎంసెట్‌తో పాటు ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు కీలకమైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించి నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. మెడిసిన్ చదవాలనుకున్న వారిని నీట్ పరీక్షకు సన్నద్ధం చేస్తారు.
కీలక విద్యా సంస్థలతో అవగాహన..
సీవోఈలలో ఫ్యాకల్టీని నియమించే అంశంపై గురుకుల సొసైటీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ తరగతులు బోధించే వారున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రముఖ శిక్షణా సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది.
ఈ ఏడాదే ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన గురుకుల సొసైటీ.. ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అతి త్వరలో వీటికి ఆమోదం లభించే అవకాశముందని.. ఆ వెంటనే తగిన వసతులు, సౌకర్యాలున్న గురుకులాల్లో ప్రత్యేకంగా సీవోఈలను ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment