tswreis
-
గాడితప్పిన ‘కోడింగ్ స్కూల్’!
కోడింగ్ స్కూల్ ఉద్దేశం ఆరో తరగతి నుంచే విద్యార్థికి సాధారణ పాఠ్యాంశంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్‌పై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం లక్ష్యం కాలేజీ స్థాయికి వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ నిపుణులుగా విద్యార్థులను తయారు చేయడం ఎన్ని స్కూళ్లు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో మూడు కేటగిరీల్లో ఈ స్కూళ్లున్నాయి. బాలురు–1, బాలికలు–1, డిగ్రీ విద్యార్థులకు–1 ఏటా చేస్తున్న ఖర్చు సాధారణ పాఠశాల నిర్వహణ ఖర్చులకు అదనంగా ఏటా రూ. 6 కోట్లు. ప్రస్తుత పరిస్థితి కోడింగ్ బోధన అయోమయం.. సాధారణ పాఠశాలల మాదిరిగా క్లాసులు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కోడింగ్ పాఠశాలల నిర్వహణ గాడి తప్పింది. సాంకేతిక నిపుణులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షకులతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చిన్నతనం నుంచే కల్పించి ఉత్తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ఇప్పుడు సాధారణ గురుకులం మాదిరిగా తయారైంది. కోడింగ్ స్కూల్లో సాంకేతిక నిపుణులను పూర్తిస్థాయిలో నియమించకపోవడం... ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించే సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లకపోవడం, పారిశ్రామిక విజ్ఞాన యాత్రలను అటకెక్కించడం... కోడింగ్ తరగతులను సైతం నిర్దేశించిన సమయాల్లో నిర్వహించకపోవడంతో కోడింగ్ స్కూల్ స్ఫూర్తి దెబ్బతింటోంది. ఉన్నత లక్ష్యం... సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ గురుకులాల నుంచి ఎంపిక చేసి వారికి కోడింగ్ స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలో టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కోడింగ్ పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ క్యాంపస్‌లో బాలురు, బాలికలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. డిగ్రీ స్థాయి పిల్లలకు బాలానగర్ సమీపంలో కోడింగ్ కాలేజీని నిర్వహిస్తున్నారు. కోడింగ్ పాఠశాలలో సాధారణ గురుకుల పాఠశాల/కళాశాలకు సంబంధించిన తరగతులను సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగగా... కోడింగ్‌కు సంబంధించిన తరగతులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ప్రైవేటు సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ కోడింగ్ పాఠశాలలో సాంతికేతిక నిపుణులను, ట్రైనర్లను నియమించుకుని విద్యార్థులకు రోజుకు 4 గంటలపాటు తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయ, జాతీయ ఐటీ సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. ఇండస్ట్రియల్ టూర్లలో భాగంగా సాఫ్ట్వేర్ సంస్థలను ప్రత్యక్షంగా చూపించి కోడింగ్, ప్రోగ్రామింగ్, యానిమేషన్ తదితర కంప్యూటర్ ఇంజనీరింగ్‌పై అవగాహన పెంచాలి. ఇందుకు ఏటా కోడింగ్ అంశం కోసమే టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రూ. 6 కోట్లు ఖర్చు చేస్తోంది. మూడేళ్ల కాలానికి రూ. 18 కోట్ల బడ్జెట్ కేటాయించింది. తూట్లు పొడుస్తున్న కాంట్రాక్టు సంస్థ 2020 నుంచి మూడేళ్ల కాలానికి టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు సంస్థ క్రమంగా కోడింగ్ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. తగినంత మంది సాంకేతిక నిపుణులు, శిక్షకులను నియమించకుండా అరకొర తరగతులతో చేతులు దులుపుకుంటోంది. గత రెండేళ్లుగా ఇండస్ట్రియల్ టూర్లకు మంగళం పాడిన ఆ సంస్థ... అవగాహన సదస్సులను సైతం అటకెక్కించింది. కేవలం సాధారణ స్కూల్ కార్యకలాపాలతోపాటు రోజులో అరకొరగా థియరీ తరగతులతో కాలం వెళ్లదీస్తోంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీకి పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడం... ఇతర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తినా సొసైటీ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సొసైటీలోని ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉండటంతో ప్రైవేటు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. -
పారదర్శకతకు పాతరేస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మధ్యవర్తుల వసూళ్ల పర్వంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమబద్ధీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొందరు మధ్యవర్తులు వసూళ్లకు తెగబడుతున్న తీరుపై గతనెల 24న ‘కొలువుల క్రమబద్ధీకరణలో కలెక్షన్ కింగ్‌లు’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది గురుకుల సొసైటీ వర్గాల్లోనే కాకుండా, సచివాలయంలోని కొన్ని విభాగాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మధ్యవర్తుల ప్రమేయం, వసూళ్ల తంతు ఏమిటంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తీగ లాగి.. హెచ్చరికలు చేసి.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు ఆరువందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. అందులో 550 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులుగా సొసైటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను కొందరు సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగి రకరకాల అపోహలు సృష్టించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారి కొలువే క్రమబద్ధీకరిస్తారని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు మధ్యవర్తులు అడిగినంత మేర ఇచ్చినట్లు తెలిసింది. ఇలా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేశారని సమాచారం. దీనిపై టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ రంగంలోకి దిగి తీగ లాగినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి విచారణ జరిపారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ, వారం క్రితం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మధ్యవర్తులు వసూళ్లు చేసిన తీరును, ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారని ఆరా తీసినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు, కార్యదర్శి మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వసూళ్ల తీరును తెలుసుకున్న తర్వాత ఆయన పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కళంకం రాకుండా, వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటిదాకా సొసైటీ ఉద్యోగుల ఫైలు కదలదని హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
12న ఓయూ పార్ట్‌టైం అధ్యాపక రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు సోమవారం తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించారు. 190 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడిసిన్ సీట్లు యూజీ నీట్–21 తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన 190 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మలి విడత కౌన్సెలింగ్‌లోనూ కొందరు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సొసైటీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ తెలిపారు. (క్లిక్: అంతా మా ఇష్టం.. పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు) -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. అర్హులైన వారు ఎలాం టి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీ నర్, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు కె.రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియగా, మళ్లీ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఆర్జేసీసెట్–21 అర్హుల జాబితా విడుదల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల కోసం ఆర్జేసీసెట్–21కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హత కల్పిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీలోపు హాల్‌టికెట్, కుల ధ్రువీకరణ, బదిలీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ, పాస్‌ఫొటోలు తదితర ధ్రువపత్రాలతో ఎంపికైన కాలేజీలో రిపోర్టు చేయాలని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రిపోర్టు చేయకుంటే ఆ విద్యార్థి అనర్హుడవుతారని స్పష్టంచేశారు. జూలై 18న గురుకుల ప్రవేశ పరీక్ష సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీజీసెట్–21)ను వచ్చేనెల 18న నిర్వహించాలని సెట్ కన్వీనర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్ల లో ఐదోతరగతికి సంబంధించి 47వేల సీట్లున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఆన్లైన్ దర ఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 1.35లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు గురుకుల సొసైటీ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
65 శాతం సీట్లు గిరిజనులకే.. మంత్రి హర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గిరిజన గురుకులంలో కో ఎడ్యుకేషన్ లా కాలేజీ (రెసిడెన్షియల్) ఏర్పాటుకు గతేడాది గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలు పంపింది. కోవిడ్–19 నేపథ్యంలో అనుమతులకు ఆలస్యం అవుతుందని అధికారులు భావించారు. కానీ లాసెట్ పరీక్ష, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం అడ్మిషన్ల ప్రక్రియకు కలసివచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం లాసెట్–20 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గిరిజన న్యాయ కళాశాలకు వచ్చిన అనుమతులను ఉన్నత విద్యా మండలి, సెట్ కన్వీనర్లకు సమరి్పంచడంతో ఈ కాలేజీలో సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 65 శాతం సీట్లు గిరిజనులకే.. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న న్యాయ కళాశాలలో 65 శాతం సీట్లు గిరిజనులకే కేటాయిస్తారు, గిరిజన విద్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇందులో గిరిజనులకు 39, ఎస్సీలకు 6, బీసీలకు 7, అగ్రవర్ణాలకు 2, స్పోర్ట్స్ కోటా 2, ఎన్సీసీ 2, ఎక్స్ సరీ్వస్ మెన్ 1, వికలాంగులకు 1 కేటాయిస్తారు. శుభ పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రారంభించడం శుభ పరిణామం. కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇటీవలే నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభించాం. బీఈడీ, మరో రెండు పీజీ కోర్సులకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–20 వల్ల అనుమతులు రావడంలో ఆలస్యం అవుతోంది. -
ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్ మెంబర్స్ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దారుణాలను ఎండగడతారనే దాడి..! దళిత నేత శ్రీశైలంపై స్వేరోస్ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ అండదండలతో స్వేరోలు రెచ్చిపోతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. తమ బాగోతాన్ని బయటపెడతాడనే స్వేరోలు శ్రీశైలంపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంపై దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని కిరణ్ డిమాండ్ చేశారు. స్వేరోస్ (స్టేట్ వెల్ఫేర్ ఎయిరో) అంటే జాతి సంక్షేమం కోసం ఆకాశం (అనంతం) హద్దుగా పనిచేసేవారు అని అర్థం. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2012 అక్టోబర్ 19న ఈ సంస్థను స్థాపించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ -
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ
-
ప్రతి జిల్లాలో ‘ఐఐటీ’ కోచింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలిగేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఒక్కో కొత్త జిల్లాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్ణయించింది. అలాగే తగిన వసతులు, సౌకర్యాలు ఉన్న గురుకులాలను సీవోఈలుగా అప్‌గ్రేడ్ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడున్నవి రెండే.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు మాత్రమే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒకటి, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో మరొకటి ఉంది. గురుకుల కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. ఈ సీవోఈల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అక్కడ ఇంటర్ తరగతులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్‌ను కూడా అందిస్తారు. ఎంసెట్‌తో పాటు ఐఐటీ, ట్రిపుల్ఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కీలకమైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి నిపుణులతో తరగతులు నిర్వహిస్తారు. మెడిసిన్ చదవాలనుకున్న వారిని నీట్ పరీక్షకు సన్నద్ధం చేస్తారు. కీలక విద్యా సంస్థలతో అవగాహన.. సీవోఈలలో ఫ్యాకల్టీని నియమించే అంశంపై గురుకుల సొసైటీ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ తరగతులు బోధించే వారున్నప్పటికీ.. ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ప్రముఖ శిక్షణా సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ ఏడాదే ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన గురుకుల సొసైటీ.. ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అతి త్వరలో వీటికి ఆమోదం లభించే అవకాశముందని.. ఆ వెంటనే తగిన వసతులు, సౌకర్యాలున్న గురుకులాల్లో ప్రత్యేకంగా సీవోఈలను ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఊచల్లేని కిటికీ నుంచి పడి.. విద్యార్థి మృతి
- మంచిర్యాల జిల్లా జైపూర్ గురుకుల పాఠశాలలో దారుణం - మొదటి అంతస్తులో కిటికీ పక్కన నిద్రించిన విద్యార్థి - గాఢనిద్రలో కిటికీ నుంచి జారి గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడిపోయిన వైనం - తీవ్ర రక్తస్రావం.. అక్కడికక్కడే మృతి - జాతీయ రహదారిపై తల్లిదండ్రులు, వివిధ సంఘాల ఆందోళన జైపూర్(చెన్నూర్) కిటికీలకు ఊచలుండవ్.. గదులకు తలుపులుండవ్.. పడుకోవడానికి బెడ్లుండవ్.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు గురుకుల హాస్టళ్లలో సర్వసాధారణం! ఏళ్లుగా తిష్టవేసిన ఈ నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది! ఊచల్లేని కిటికీ పక్కన పడుకున్న విద్యార్థి.. నిద్రమత్తులో పక్కకు దొర్లడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి.. కోటపల్లి మండలం కొండంపేటకు చెందిన పాయిడి సుగుణ– పోచయ్య దంపతులకు రాజేశ్, సంతోష్, రాకేశ్ ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. చిన్న కొడుకు రాకేశ్(13) జైపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరే శుక్రవారం రాత్రి భోజనం చేసిన రాకేశ్.. హాస్టల్ మొదటి అంతస్తులోని తన గదిలో కిటికీ పక్కన ఉన్న బెడ్‌పై పడుకున్నాడు. గదిలో 20 బెడ్స్ ఉండగా.. ఒక్కో బెడ్లో ఇద్దరు చొప్పున మొత్తం 40 మంది పడుకున్నారు. గదిలో ఒకే ఫ్యాన్ ఉండటంతో రాకేశ్ కిటికీ పక్కన పడుకున్నాడు. పెద్దగా ఉన్న ఆ కిటికీకి ఊచల్లేవు. నిద్రలోకి జారుకున్న రాకేశ్.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అటుఇటూ కదులుతూ కిటికీ నుంచి జారిపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కిటికీ సజ్జపై పడి అక్కడ్నుంచి గచ్చుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. తల, చెవి, ముక్కు నుంచి రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఉదయం 5.30 గంటలకు నిద్రలేచిన తోటి విద్యార్థులు రాకేశ్ కింద పడి ఉండటం గమనించి టీచర్లకు చెప్పగా.. వారు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించి అప్పటికే రాకేశ్ మృతిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతి వార్త తెలుసుకున్న రాకేశ్ తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్నారు. ‘మంచిగ సదువుకొని గొప్పోడు అయితడని హాస్టల్లో చేర్పిస్తే చివరకు కొడుకే లేకుండా పోయిండు..’అంటూ విద్యార్థి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. జాతీయ రహదారిపై ధర్నా రాకేశ్ మృతికి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఆర్సీవోలు బాధ్యత వహించాలని, వారిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, కుల సంఘాల నాయకులు మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, పది ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు జైపూర్ చేరుకుని వారితో మాట్లాడారు. ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. డబుల్బెడ్రూం ఇల్లు, మూడెకరాల భూమి, ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.40 వేలు అందజేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయే వరకూ స్పందించలేదు.. స్కూల్లో సమస్యలపై ‘సాక్షి’అనేక కథనాలు జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై గతంలో ‘సాక్షి’అనేకసార్లు కథనాలు ప్రచురించింది. ప్రధానంగా హాస్టల్ గదుల్లో కొన్ని కిటికీలకు చువ్వలు లేవని, మరికొన్నింటికి తలుపులు ఊడిపోయాయని, అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నందున వాటి ద్వారా విష పురుగులు వచ్చే ప్రమాదం ఉందని చాలాసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్లుగా కిటికీలకు తలుపులు బిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థి ప్రాణం గాల్లో కలిసింది. గతంలో ప్రిన్సిపల్‌గా పనిచేసిన సునీత ఇటీవలే బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్‌రావు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు.