సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మధ్యవర్తుల వసూళ్ల పర్వంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఈ అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమబద్ధీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొందరు మధ్యవర్తులు వసూళ్లకు తెగబడుతున్న తీరుపై గతనెల 24న ‘కొలువుల క్రమబద్ధీకరణలో కలెక్షన్ కింగ్‌లు’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇది గురుకుల సొసైటీ వర్గాల్లోనే కాకుండా, సచివాలయంలోని కొన్ని విభాగాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మధ్యవర్తుల ప్రమేయం, వసూళ్ల తంతు ఏమిటంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
తీగ లాగి.. హెచ్చరికలు చేసి..
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో దాదాపు ఆరువందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. అందులో 550 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులుగా సొసైటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను కొందరు సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగి రకరకాల అపోహలు సృష్టించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు.
డబ్బులు ఇచ్చిన వారి కొలువే క్రమబద్ధీకరిస్తారని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు మధ్యవర్తులు అడిగినంత మేర ఇచ్చినట్లు తెలిసింది. ఇలా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేశారని సమాచారం. దీనిపై టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ రంగంలోకి దిగి తీగ లాగినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి విచారణ జరిపారు.
అలాగే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ, వారం క్రితం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మధ్యవర్తులు వసూళ్లు చేసిన తీరును, ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారని ఆరా తీసినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు, కార్యదర్శి మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
వసూళ్ల తీరును తెలుసుకున్న తర్వాత ఆయన పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కళంకం రాకుండా, వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటిదాకా సొసైటీ ఉద్యోగుల ఫైలు కదలదని హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment