నిద్రలో రాకేశ్ జారిపడిన ఊచల్లేని కిటికీ ఇదే. పక్కన మృతుడు రాజేశ్(ఫైల్‌ఫొటో)
- మంచిర్యాల జిల్లా జైపూర్ గురుకుల పాఠశాలలో దారుణం
- మొదటి అంతస్తులో కిటికీ పక్కన నిద్రించిన విద్యార్థి
- గాఢనిద్రలో కిటికీ నుంచి జారి గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడిపోయిన వైనం
- తీవ్ర రక్తస్రావం.. అక్కడికక్కడే మృతి
- జాతీయ రహదారిపై తల్లిదండ్రులు, వివిధ సంఘాల ఆందోళన
జైపూర్(చెన్నూర్)
కిటికీలకు ఊచలుండవ్.. గదులకు తలుపులుండవ్.. పడుకోవడానికి బెడ్‌లుండవ్.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు గురుకుల హాస్టళ్లలో సర్వసాధారణం! ఏళ్లుగా తిష్టవేసిన ఈ నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది! ఊచల్లేని కిటికీ పక్కన పడుకున్న విద్యార్థి.. నిద్రమత్తులో పక్కకు దొర్లడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది.
నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి..
కోటపల్లి మండలం కొండంపేటకు చెందిన పాయిడి సుగుణ– పోచయ్య దంపతులకు రాజేశ్, సంతోష్, రాకేశ్ ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. చిన్న కొడుకు రాకేశ్(13) జైపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరే శుక్రవారం రాత్రి భోజనం చేసిన రాకేశ్.. హాస్టల్ మొదటి అంతస్తులోని తన గదిలో కిటికీ పక్కన ఉన్న బెడ్‌పై పడుకున్నాడు. గదిలో 20 బెడ్స్ ఉండగా.. ఒక్కో బెడ్‌లో ఇద్దరు చొప్పున మొత్తం 40 మంది పడుకున్నారు. గదిలో ఒకే ఫ్యాన్ ఉండటంతో రాకేశ్ కిటికీ పక్కన పడుకున్నాడు. పెద్దగా ఉన్న ఆ కిటికీకి ఊచల్లేవు. నిద్రలోకి జారుకున్న రాకేశ్.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అటుఇటూ కదులుతూ కిటికీ నుంచి జారిపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కిటికీ సజ్జపై పడి అక్కడ్నుంచి గచ్చుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. తల, చెవి, ముక్కు నుంచి రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఉదయం 5.30 గంటలకు నిద్రలేచిన తోటి విద్యార్థులు రాకేశ్ కింద పడి ఉండటం గమనించి టీచర్లకు చెప్పగా.. వారు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించి అప్పటికే రాకేశ్ మృతిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతి వార్త తెలుసుకున్న రాకేశ్ తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్నారు. ‘మంచిగ సదువుకొని గొప్పోడు అయితడని హాస్టల్‌లో చేర్పిస్తే చివరకు కొడుకే లేకుండా పోయిండు..’అంటూ విద్యార్థి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
జాతీయ రహదారిపై ధర్నా
రాకేశ్ మృతికి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఆర్‌సీవోలు బాధ్యత వహించాలని, వారిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, కుల సంఘాల నాయకులు మంచిర్యాల–చెన్నూర్ జాతీయ రహదారిపై రెండుగంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, పది ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు జైపూర్ చేరుకుని వారితో మాట్లాడారు. ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. డబుల్‌బెడ్‌రూం ఇల్లు, మూడెకరాల భూమి, ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.40 వేలు అందజేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
ప్రాణం పోయే వరకూ స్పందించలేదు..
స్కూల్‌లో సమస్యలపై ‘సాక్షి’అనేక కథనాలు
జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై గతంలో ‘సాక్షి’అనేకసార్లు కథనాలు ప్రచురించింది. ప్రధానంగా హాస్టల్ గదుల్లో కొన్ని కిటికీలకు చువ్వలు లేవని, మరికొన్నింటికి తలుపులు ఊడిపోయాయని, అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నందున వాటి ద్వారా విష పురుగులు వచ్చే ప్రమాదం ఉందని చాలాసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్లుగా కిటికీలకు తలుపులు బిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థి ప్రాణం గాల్లో కలిసింది. గతంలో ప్రిన్సిపల్‌గా పనిచేసిన సునీత ఇటీవలే బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్‌రావు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు.