కామారెడ్డి: దగ్గు మందును అక్రమంగా దేశ సరిహద్దులు దాటించిన డ్రగ్ మాఫియా రూ. వంద కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కామారెడ్డి, హైదరాబాద్, కరీంనగ ర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలోని పలు ఏజెన్సీల ద్వారా ఫెన్సిడిల్ సిరప్ పెద్ద ఎత్తున బంగ్లాకు తరలి వెళ్లింది.
కామారెడ్డిలోని అజంతా ఏజెన్సీ రికార్డులను పరిశీలించిన ఔషధ నియంత్రణ అధికారులు ఇక్కడి నుంచి 2.39 లక్షల ఫెన్సిడిల్ సీసాలు తరలి వెళ్లినట్టు గుర్తించారు. మిగతా ప్రాంతాలకు చెందిన ఏజెన్సీల నుంచి కూడా పెద్ద మొత్తంలోనే మందులు స్మగ్లింగ్ అయ్యా యి. హైదరాబాద్‌కు చెందిన మహేం దర్ ద్వారా కామారెడ్డికి చెందిన సుధాకర్ డ్రగ్ రాకెట్‌లో కీలకపాత్ర పోషించి నట్టు అధికారులు అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. వీరితోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన మెడికల్ ఏజెన్సీల నిర్వాహకుల పాత్ర ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిర్ధారించారు.
‘సాక్షి’ ద్వారా వెలుగులోకి
బంగ్లాదేశ్‌కు ఫెన్సిడిల్ సిరప్ బాటిళ్లు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తుండగా ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో నార్కోటిక్ డ్రగ్స్ శాఖ అధికారులు పట్టుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఆయా శాఖల అధికారులు డ్రగ్స్ మాఫియా విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. అక్రమదందా, అక్రమ రవాణా పై ‘సాక్షి’ అందించిన కథనాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేయడంతోపాటు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కామారెడ్డిలోని అజంతా మెడికల్ ఏజెన్సీ యజమాని 2.39 లక్షల ఫెన్సిడిల్ సిరప్ మందు బాటిళ్లను కంపెనీ నుంచి తెప్పించి అక్రమార్గాల ద్వారా దేశ సరిహద్దులు దాటించినట్టు అధికారులు నిర్ధారించారు. ఒక్క బాటిల్ ఖరీదు ప్రస్తుతం రూ. 68 ఉండగా, వీటి మొత్తం విలువ రూ. 1.62 కోట్ల వరకు వరకు ఉంది.
నాలుగు రెట్లు ధర ఎక్కువ
బంగ్లాదేశ్‌లో ఒక్క బాటిల్ రూ. 250 నుంచి రూ. 300 వరకు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. అంటే, ఇక్కడి వ్యాపారి రూ. ఐదు కోట్ల వరకు ఆర్జించినట్లు అంచనా. ఇందులో ఖరీదుతో పాటు, ఇతర ఖర్చులకు సగం పోయినా రూ. 2.50 కోట్లు అక్రమ మిగులుబాటు అని సంబంధిత వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, కోరుట్ల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తంగా 70 లక్షలకు పైగా ఫెన్సిడిల్ సిరప్ బాటిళ్లు దేశ సరిహద్దులు దాటి ఉండవచ్చని, వాటి విలువ రూ. వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ అక్రమదందాను నిరాటంకంగా సాగించిన డ్రగ్ మాఫియా చట్టానికి చిక్కిన నేపథ్యంలో వారిపై డ్రగ్స్, కాస్మోటిక్స్ యాక్ట్ సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండడంతో నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
అక్రమ దందా ఆటకట్టు
Published Wed, Nov 26 2014 3:34 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement
Advertisement