
గుట్టలను తవ్వేస్తున్నారు
మైనింగ్ దందా జోరుగా సాగుతోంది.నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేసి గుట్టలను తవ్వుకుపోతున్నా అధికారులకు పట్టడంలేదు. బ్లాస్టింగ్లతో బోర్లు దెబ్బతింటున్నా.. ఇళ్లు బీటలు వారుతున్నా.. గ్రామాల్లో కాలుష్యం కమ్మేసినా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. మామూళ్లమత్తులో జోగుతున్న అధికారులు క్వారీల నిర్వాహకుల కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేవరకొండ/చింతపల్లి/కొండమల్లేపల్లి : కొందరు అక్రమార్కులకు ప్రజాప్రయోజనాలు పట్టడంలేదు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేసి గుట్టలను తవ్వుకుపోతున్నా పట్టించుకునేవారేకరువయ్యారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొందరు అక్ర మంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 166లోని గట్టుపతి వేంకటేశ్వరస్వామి గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీని ఏర్పాటు చేశారు. లెక్కకు మించి తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారేలేరు.
ఎప్పటికప్పుడు అధికారులకు ఎర వేసి లీజ్ గడువును పొడగిస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. సుమారు 200 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టడంతో ఈ గుట్ట తరిగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ వేబిల్లులతో గ్రానైట్‌ను అధికమొత్తంలో తరలిస్తున్నా అధికారులకు పట్టడంలేదు. గ్రానైట్‌ను తవ్వే క్రమంలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో చుట్టుపక్కల బోర్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బోర్లు వట్టిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు.
దీన్ని నియంత్రించాల్సిన రెవెన్యూ శాఖ కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ గ్రానైట్ క్వారీని ఆనుకుని ఉన్న 200 ఎకరాల పొరంబోకుభూమిలో గత కొన్నెళ్ల నుంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉన్న జింకలు, నెమళ్లు, కుందేళ్లు తదితర జంతువుల మనుగడ బ్లాస్టింగ్‌ల వల్ల ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా దేవరకొండ - కొండమల్లేపల్లి మెయిన్‌రోడ్డులో మూడు కంకర మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు.
మెయిన్‌రోడ్డు నుంచి 200 మీటర్ల మేర ఎటువంటి తవ్వకాలకు, మిల్లులకు అనుమతులు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నా మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి శాఖలు పట్టించుకోలేదు. నిబంధనలు తంగలో తొక్కి అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రతి నిత్యం మిల్లు నుంచి విడుదలయ్యే దుమ్ము, పొగ రోడ్డు మీద నుంచి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
కార్మికులకు సౌకర్యాలు కరువు
మిల్లుల్లో పని చేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వీటి నిర్వహణపై పలు ఫిర్యాదులున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. క్వారీల్లో బ్లాస్టింగ్‌ల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాం దోళనలకు గురవుతున్నారు. పేలుళ్ల వల్ల తమ ఇళ్లు బీటలువారుతున్నాయని సమీప కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొండభీమనపల్లి సమీపంలోని బొల్లిగుట్ట వద్ద సిలికాన్ స్టోన్ క్వారీ కూడా 20 ఏళ్లుగా కొనసాగుతోంది.
ఈ క్వారీ కూడా మెయిన్‌రోడ్డు వెంబడే ఉంది. వీటన్నింటినీ నియంత్రించాల్సిన గనులు, భూగర్భ వనరుల శాఖ, కాలుష్య నియంత్రణమండలి, కార్మికశాఖలు ఏమాత్రం స్పందించడం లేదు. ఫిర్యాదులుంటే గానీ స్పందించమన్న రీతిలో ఆయా శాఖల ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ స్పందించి వీటి నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.