
అంక్షాపూర్‌లో డెంగీ?
నంగునూరు: మండల పరిధిలోని అంక్షాపూర్‌లో ఓ బాలునికి డెంగీ లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురుయ్యారు. దీంతో వైద్యాధికారులు ఆదివారం గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన విద్యార్థి బెల్లం సురేశ్ (11)కు జ్వరం రావడంతో కుంటుంబ సభ్యులు రెండు రోజుల కిందట సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుణ్ని పరీక్షించిన వైద్యులు రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గాయని, డెంగీ వ్యాధి సోకినట్లు అనుమానం వ్యక్తం చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
పస్తుతం బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా గ్రామంలో డెంగీ వ్యాధి వ్యాపించిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయడంతో హుటాహుటిన వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గ్రామంలోని మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇదిలా ఉండగా డెంగీ వ్యాపించిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు జిల్లా మలేరియా నివారణ అధికారి నాగయ్య గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మురుగుకాల్వలు, ఇళ్లల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన బెల్లం సురేశ్ రక్త నమూనాను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. గ్రామంలో జ్వరాలు రాలేదని, డెంగీ లక్షణాలు కనబడటం లేదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామంలో మూడు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగిస్తామన్నారు. మురికి నీరు నిల్వ ఉండ కుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలని ఆదేవించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సదానందం, అధికారులు కొండయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బొంగోని లక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.