భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేని వాన
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిడుగుపాటుకు అశ్వారావుపేట మండలం తిరుమలకుంట, జూలురుపాడు మండలం కాకర్ల గ్రామాల్లో ఇద్దరు మృతి చెందారు. పాల్వంచలో అత్యధిక వర్షపాతం 63.4 మిల్లిమీటర్లుగా నమోదైంది. అశ్వారావుపేటలో గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. గుమ్మడవల్లి ప్రాజెక్టు గేట్లును ఎత్తిన అధికారులు.. 2,820 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుండపోత వర్షంతో పాల్వంచలో రోడ్లన్నీ మునిగి, విద్యుత్ స్తంభాలు కూలి పడిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.50 మీటర్లకు చేరుకుంది.