హాలీవుడ్ స్థాయిలో సినిమాసిటీ: కేసీఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్‌ను తలపించేలా తెలంగాణలో సినిమా సిటీని నిర్మించతలపెట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొత్తరకార, సి.కళ్యాణ్, శశికుమార్, నందకుమార్, ఎన్.శంకర్, హెచ్‌డి గంగరాజు, కాట్రగడ్డ ప్రసాద్, ఉదయ్‌సింగ్, ఎ.రాజ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినిమా సిటీ కేవలం సినిమాలు తీయడానికే పరిమితం కాకుండా, టీవీ సీరియళ్లు, కార్యక్రమాల రూపకల్పన, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, యాని మేషన్, ప్రజా సమస్యలపై లఘుచిత్రాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎక్కడ, ఎలా నిర్మిం చాలనే దానిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.
ముంబై సినీ పరిశ్రమ ప్రతినిధులు, భారతదేశ సినీరంగపెద్దలు, తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పా రు. అనంతరం ఫిల్మ్‌ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ కేం ద్రంగా తెలంగాణ ఫిల్మ్‌సిటీ మారాలనే సంకల్పానికి తాము కూడా చేయూతనందిస్తామని తెలిపారు. రెండువేల ఎకరాల్లో ప్రారంభించే ఈ ఫిల్మ్‌సిటీ అన్ని భాషల సినిమాల తయారీకి కేంద్రం కావాలని ఆశిస్తున్నామన్నారు.
సీఎంతో టర్కీ కాన్సూల్‌జనరల్ భేటీ
ఈ ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరగనున్న తమ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాలని టర్కీ కాన్సూల్‌జనరల్ మురాత్ ఒమెరోగ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సమ్మతించారు. సోమవారం సచివాలయంలో మురాత్ తెలంగాణ సీఎంతో భేటీ ఆయ్యారు. కాగా, మరోసారి సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాలని నిర్ణయించారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఇప్పుడు నవీకరించిన నగరమని, దీనిని సందర్శించాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాటుచేస్తామని మురాత్ ఒమెరోగ్లు హామీ ఇచ్చారు.