
సాక్షి, హైదరాబాద్: చార్జీల పెంపుదల ఆర్టీసీలో ఆశలు రేకెత్తిస్తోంది. కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఇప్పుడు చార్జీల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం తో గట్టునపడొచ్చన్న నమ్మకం వ్యక్తమవుతోంది. మంగళవారం తొలి షిఫ్ట్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరగగా, తొలి రోజు అందిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఆదాయం 22 శాతాన్ని మించి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజులు చూస్తే గానీ కచ్చితమైన వివరాలు అందవని పేర్కొంటున్న అధికారులు, తొలిరోజు మాత్రం అంచనాకు మించి ఆదాయం ఉన్నట్టుగా గుర్తించామంటున్నారు.
నగరంలో అది 25 శాతంగా ఉండగా, జిల్లాల్లో 20 శాతాన్ని మించి ఉందని అంటున్నారు. వెరసి రోజువారీ ఆదాయంలో రూ.2 కోట్లు చొప్పున పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలో బస్సుల షెడ్యూల్ మార్చడం, కార్మికుల డ్యూటీ సమయాలను సవరణ వల్ల పనితీరు మెరు గుపడి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని, దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని అంటున్నారు. నగరంలో ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్లు ఒక షిఫ్ట్‌లో 6.50 గంటల మేర పనిచేస్తున్నారు. మరో 40 నిమిషాలు డ్యూటీ బాధ్యతలు తీసుకోవటం, అప్పగించటం (చేంజ్ ఓవర్)గా ఉంటోంది.
ఇప్పుడు చేంజ్ ఓవర్ సమయాన్ని తగ్గించటంతోపాటు డ్యూటీ సమయాలను 7.20 గంటలకు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత బాగా పెరిగి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సిటీ డిపోల్లో సగటున అదనపు ఆదాయం రోజుకు రూ.1.75 లక్షల మేర పెరిగినట్టు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment