మిర్యాలగూడ మండలం తడకమళ్ల సమీపంలో ఉన్న ఎత్తిపోతల పథకంలోని మోటార్లు, మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం సమీపంలోని ఎల్ –16 ఎత్తిపోతల పథకం
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాల కింద రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎత్తిపోతల పథకాల నిర్వహణను కూడా ప్రభుత్వమే చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా ఎత్తిపోతల పథకాలకు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆధునికీకరించారు. కానీ నిర్వహణ భారం రైతులపై పడడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో 41 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటి పరిధిలో 83 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తరచుగా కాలిపోతున్న విద్యుత్ మోటార్లు, పగిలిపోతున్న పైపులతో పాటు ఆపరేటర్లను నియమించుకోవడం రైతులకు భారంగా మారింది. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరందడం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు మాత్రం అధికారంలోకి వస్తే ఎత్తిపోతల నిర్వహణ భారం ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్నారు కానీ ఆ హామీలు అమలు కావడం లేదు.
బాబు హయాంలోనే లిఫ్ట్‌ల నిర్వీర్యం
చంద్రబాబు నాయుడు హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేది. కాగా ప్రభుత్వానికి అధిక భారమవుతుందని భావించిన బాబు ఎత్తపోతల పథకాలను రైతులే నిర్వహించుకోవాలని 1999లో ఆదేశాలు జారీ చేశారు. దాంతో మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు రైతులే చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా విద్యుత్ బిల్లులు ఒక్కొక్క లిఫ్ట్‌కు లక్షల రూపాయల్లో వచ్చేది. దాంతో విద్యుత్ బిల్లులు చెల్లించుకోలేని రైతులకు నిర్వహణ భారంగా మారడంతో ఎత్తిపోతల పథకాలు మూసివేయడంతో 80 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు దొరకని స్థితిలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.
వైఎస్‌ఆర్ హయాంలోరైతులకు మేలు
2004లో దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎత్తిపోతల కింద రైతులకు ఎంతో మేలు జరిగింది. ఆయన ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేయగా ఎత్తిపోతల రైతులకు కూడా వర్తింపజేశారు. అంతే కాకుండా ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీల బకాయిలు కూడా మాఫీ చేశారు. మరమ్మతులకు గాను 7 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అంతే కాకుండా 2006లో ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 16 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేశారు. ఎత్తిపోతల కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టులో 80 శాతం ఆయకట్టు సాగులోకి వచ్చింది. దాంతో ఎత్తిపోతల రైతులకు మహర్దశ కలిగింది.
భారమైన నిర్వహణ
ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రత్యేక విద్యుత్ లైన్లు, ఆధునికీకరణలో నూతన మోటార్లు ఏర్పాటు చేసినా తరచుగా మోటార్లు కాలిపోవడంతో రైతులకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ఇద్దరు ఆపరేటర్లను నియమించుకోవడంతో పాటు తరచుగా పలిగిపోతున్న పైపులు, కాలిపోతున్న మోటార్లను మరమ్మతులు చేయాలంటే రైతులు ఎకరానికి కొంత డబ్బులు వసూలు చేసి నిర్వహణ చేసుకుంటున్నారు. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువ చివరి భూములు బీడుగా మారుతున్నాయి.
ఆపరేటర్లను నియమించాలి :
మిర్యాలగూడ : లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ ద్వారా ఆపరేటర్లను నియమించాలి. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించి, నిర్వహణ చేపట్టకుండా వది లేస్తే ఆ ఫలితం అందే పరిస్థితి లేదు. రైతులు నిర్వహించే పరిసి ్థతి లేదు. దీంతో రైతులపై నిర్వహణ భారం పడుతుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి లిప్టులు నడవని పరిస్థితి నెలకొంది.
– దైద నాగయ్య, గోగువారిగూడెం
నిధులు కేటాయించాలి ..
మిర్యాలగూడ : లిఫ్ట్‌లను ఆధునికీకరించారు కానీ నిర్వహణ చేపట్టడం లేదు. మోటార్లు కాలిపోవడం, పైపులు పగిలిపోతున్నా ఎన్‌ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో రైతులకు భారంగా మారుతుంది. దీంతో పంటకు నీరందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ప్రతి ఏటా కేటాయించాలి.
– భిక్షం, రైతు, అన్నపురెడ్డిగూడెం
రైతులపై అధిక భారం..
మిర్యాలగూడ : సాగర్ కుడి కాల్వపై ఉన్న లిఫ్ట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తే ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులను రైతులు నిర్వహించుకోవాల్సి వస్తుంది. దీంతో రైతులపై అధిక భారం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం లిఫ్టు నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే నిర్వహిస్తుందని హామీ ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి.
– పసుల వెంకటయ్య, రావులపెంట, లిఫ్ట్ చైర్మన్
ప్రభుత్వమే నిర్వహించాలి..
నడిగూడెం : 15 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథకాలను రైతులే శిస్తులు చెల్లించి నిర్వహించుకుంటున్నాం. అది కూడా రైతులు పూర్తి స్థాయిలో శిస్తులు వసూలు కావడంలేదు. దీంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలి.
–మొక్క రాంబాబు, సిరిపురం
లిఫ్ట్ నిర్వహణ కమిటీ వేయాలి..
మేళ్లచెరువు : వెల్లటూరు లిప్టు నిర్వహణ సక్రమంగా లేక పం టలు ఎండిపోయే పరిస్థితి ఉంది. లిఫ్ట్ నిర్వహణకు కమిటీ వేయాలి. వాటి మరమ్మతులకు నిధులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంటలు పూత, పిందె సమయంలో నిర్వహణ లోపంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– కర్నాటి నారాయణరెడ్డి ,మేళ్లచెరువు
హామీని అమలు చేయాలి..
తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాని నేటికీ అది అమలు కాలేదు. ఆయకట్టు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
– పల్‌రెడ్డి రఘుమారెడ్డి రైతు, అల్వాల
హాలియా సభలో హామీ ఇవ్వాలి..
తిరుమలగిరి : తెలంగాణ వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా లిప్టులపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరం. లిప్టులను రైతులే నిర్వహించుకోవడంతో చాలా భారం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తెలంగాణ వస్తే ఎడమకాలువపై ఉన్న లిప్టులను ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికి అమలు కాలేదు. ఈనెల 27న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ రైతలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి.
– నాంపల్లి సైదులు, అల్వాల
లిఫ్ట్ రైతులను ఆదుకోవాలి..
నిడమనూరు : ఎత్తిపోతల పథకాల కింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లిఫ్ట్ ఆపరేటర్లకు, మోటార్లు చెడిపోయినప్పుడు చేసే మరమ్మతులకు, కాలువల మరమ్మతులకు, రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. అసలే మెట్ట పంట వేసే రైతులపై ఆ భారం ఎక్కువగా ఉంటుంది. పూర్తి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే స్వీకరించాలి.
– పిల్లి రాజు, రైతు, నిడమనూరు
ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి..
మేళ్లచెరువు : మండలంలోని రేవూరు, వేపలమాధవరం, మేళ్లచెరువు గ్రామాల్లోని పంట పొలాలకు నీటిని అందించే వెల్లటూరు లిఫ్ట్‌ను ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. మోటారు, పైపులైన్, విద్యుత్ వంటి సమస్యలు, మరమ్మతులు వంటి వాటిని ప్రభుత్వమే భరించాలి. మరమ్మతులకు నిధులు కేటాయించాలి.
– జె.గురవయ్య యాదవ్, రేవూరు
రైతుల నుంచే ఖర్చులు వసూలు..
మునగాల : సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రతి ఏడాది విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురికావడం, సిబ్బంది జీతాలు తదితర ఖర్చులు రైతుల నుంచి వసూలు చే యాల్సి వస్తుంది.
– మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఎత్తిపోతల పథకం చైర్మన్, కొక్కిరేణి
Comments
Please login to add a commentAdd a comment