MIRYALAGUDA District
-
వేసవి.. జాగ్రత్త సుమా
సాక్షి, మిర్యాలగూడ అర్బన్ : వేసవి కాలం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి కదా అని ఇంటికి తాళం వేసి ఊర్లకెలుతున్నారా..? అయితే మీ విలువైన వస్తువులు జాగ్రత్త.. దొంగలు వాటిని మాయం చేయొచ్చు. రాత్రి సమయంలో ఉక్కపోతను భరించలేకుండా మేడపైన పడుకుంటున్నారా..? అయితే మీ ఇంటి తాళం తీసి దొంగలు తెల్లవారే సరికి మీ విలువైన సొత్తును అపహరిం చొచ్చు. వేసవి కాలం దొంగతనాలకు అనువైన సమయం అని పోలీసులు పేర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని వారు అంటున్నారు. రాత్రి సమయంలో గస్తీలు పెంచినా ప్రజలు అప్రమత్తంగా లేనిదే దొంగతనాలకు చెక్‌పెట్టడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతూ విలువైన సొత్తును మాయం చేస్తున్నారు. ముందుగా కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లను గుర్తించి చోరీ లకు పక్కా స్కెచ్ వేస్తారు. రాత్రి సమయంలో ఇంటితాళం పగులగొట్టి ఇంట్లోని విలువైన సొమ్మును చోరీ చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఊర్లకు వేళ్లే వారు విలువైన వస్తువులు బంగారం, వెండి, డబ్బులను ఇంట్లో పెట్టుకోక పోవడమే మంచిది. వాటిని బ్యాంకుల్లో ఉంచితే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. ఇంటికి తాళం వేసి ఊరికెళ్లే పరిస్థితుల్లో దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే రాత్రి సమయంలో పోలీసులు ఆ కాలనీల్లో గస్తీని పెంచుతారు. కానీ ప్రజలు ఈ విషయాలను పట్టించుకోకుండా వెళుతుండటంతో తమ విలువైన సొత్తును పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లో స్పందన ఉంటేనే దొంగతనాలనునివారించే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చే సమయంలో ఇంటినంబర్, కాలనీ పేరు, యజమాని ఫోన్‌నంబర్‌తోపాటు లాండ్‌మార్కు వివరాలను పోలీసులకు అందిస్తే గస్తీని పెంచి నిఘా పెడతారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను నివారించే వీలుందని వారు పేర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం వేడెక్కి రాత్రి సమయంలో ఉక్కపోత భరించలేనంతగా ఉంటుంది. ఇంట్లో నిద్రించేందుకు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దీంతో ఎక్కువగా ఇంటి ఆవరణలో, మేడపైన నిద్రించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి రోజుల్లో కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు. సొత్తు మాయమైన తర్వాత బాధపడే కంటే ముందు.జాగ్రత్తలు పాటించి తమ విలువైన సొమ్మును భద్రపర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంటికి వేసే తాళాలు సైతం మార్కెట్లో బ్రాండెడ్ దొరుకుతున్నాయి. తాళం టచ్ చేస్తే అ లారం మోగే తాళాలు అందుబాటులోకి వచ్చా యి. ఇలాంటి వాటిని వాడితే కొంత మేరకు దొం గతనాలను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ముఖ్యమే.. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటిని నిర్మించుకుంటున్న ప్రజలు కేవలం తక్కువ ఖర్చు అయ్యే సీసీ కెమరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపడం లేదు. కాలనీ కమిటీలు ఏర్పడి సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీలో సంచరించే కొత్త వ్యక్తుల గురించిన వివరాలు అందులో నమోదయ్యే అవకాశం ఉంటుంది. అనుమానం వచ్చిన వ్యక్తులను గుర్తించే వీలు కలుగుతుంది. ఇంటి పరిసరాల్లో సైతం సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. దొంతనాలు జరిగిన వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించి సొత్తును రికవరీ చేసే అవకాశముంటుదని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రజలు సహకరించాలి వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాలను అరికట్టడంలో పోలీసు శాఖ ఎంతగా శ్రమిస్తుందో ప్రజలు తమ బాధ్యతగా సహకరించాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. కొద్ది పాటి జాగ్రత్తలు పాటించి మీ విలువైన వస్తువులు చోరీకి గురి కాకుండా చూసుకోవాలి. ఇప్పటికే రాత్రి సమయంలో కాలనీల్లో పోలీసు గస్తీలను ముమ్మరం చేశాం. – పి.శ్రీనివాస్, డీఎస్పీ మిర్యాలగూడ -
మాటల పాట.. కొండల్ ఆట
పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ ..ఎంతో మంది కవులు, కళాకారులకు పుట్టినిళ్లుగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసింది. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగించిన ఘనత కళాకారులదే. గజ్జెకట్టి తెలంగాణ ధూంధాంతో హోరెత్తించి ప్రజా చైతన్యంతో పాలకులను మేలుకొల్పింది కళాకారులే. రేయింబవళ్లు పాటే ప్రాణంగా బతికిన ముద్దు బిడ్డ ఈ నాగిళ్ల కొండల్. సాక్షి, మిర్యాలగూడ టౌన్ : నిరుపేద కుటుంబంలో నాగిళ్ల కొండలు జన్మించాడు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు.. జానపదాలు అంటే.. ఆ యువకుడికి ప్రాణం. తన మాటలే పాటలుగా వినిపిస్తాయి. ‘పల్లెకు వందనం.. కన్నతల్లికి వందనం... పాట నేర్పిన పల్లెకు వందనం...’ అంటూ పుట్టిన పల్లెకు ..కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. రచయితగా.. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలోని అన్ని జిల్లాల్లో సుమారు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కాలుకు గజ్జకట్టి భూజాన గొంగడి వేసుకొని రాత్రనక, పగలనక తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వెనుకబాటు తనం, తెలంగాణ యాస, భాష, గోసలపై తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాడు త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్నరావు క్యాంపుకు చెందిన నాగిళ్ల బక్కయ్య–బుచ్చమ్మల దంపతులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. వీరికి రెండవ సంతానం అయిన నాగిళ్ల కొండలుకు చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో పాటలను పాడుతూ ఆకట్టుకునే వాడు. నల్లగొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ‘తల్లి నీ ఒడినిండా .. త్యాగాల మూట... పల్లె నీ బతుకంతా...ఉద్యమాల బాట...గాయాలు గుండెనిండా..ఎత్తేను పోరాట జెండా...అలుపన్నది ఎరుగకుండా కదిలేను నా.. నల్లగొండా...’ అనే జిల్లా చరిత్ర పాటలను వరంగల్‌లో జరిగిన ధూం ధాంలో పాడితే ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి దగాపడ్డా తెలంగాణపై దండు కదలాలని తమ వంతుగా పాత్రను పోషించి.. పాటమ్మ..నాకు ప్రాణా మా.. అంటూ ఉర్రూతలూగించాడు. ఇతను పాటగాడే కా దు.. రాతగాడు కూడా... ప్రజల మాటలను పాట లు గా అల్లి.. పాడే ప్రజా కళా కారుడు నిరుపేద కుటుం బం నుంచి..వచ్చి... పాటే తన ప్రాణంగా.. నేటి వరకు ఎన్నో గీతాలు, పాటలను రచించి పాడాడు. చిన్నతనం నుంచే పాటలు పాడటంతో పాటు పల్లెల్లో దండోరాను మోగించేవాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై పల్లెల్లో ప్రజలకు పాటలను వినిపించేవాడు. 800 వరకు ప్రదర్శనలు ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలకు అడుగులు కలిపినా... విమలక్క ధూంధాం జాతరలో దుముకులాడిన... ఫైలం సంతోష్, గిద్దె రామనర్సయ్య పాటలతో గొంతు కలిపినా...అన్నీ తెలంగాణ జన సైన్యం కోసమే. ప్రజా కళాకారుడిగా గత 10 ఏళ్లుగా సుమారు 800 వరకు ప్రదర్శనలను ఇచ్చి ప్రజలందరి మన్ననలను పొందాడు. తెలం గాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిన ఇతను పలు జిల్లాలతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పట్ట ణాల్లో తన ఆట పాటలను ప్రదర్శించారు. మిత్ర రాసే పాటలను మితిమీరంగా అభిమానించే కొండలు విమలక్క ఆటా పాటలకు జతకట్టాడు. ఉద్యమాలకు పుట్టినిళ్లు నల్లగొండ వెలుగొందుతున్న నాగిళ్ల కొండలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాంçస్కృతిక కళా వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశాడు. కలంనుంచి జాలు వారిన పాటల ఒరవడి తన కలం ..గళం నుంచి వెలువడిన పాటలు పేదోళ్ల బతుకు చిద్రంను చూపించేవి. పేదోళ్ల వెతలపై అతని కలం కవాతు చేసేది. ‘పల్లె యాడికొస్తుందంటూ’ చిన్నతనంలో తన గ్రామంలో పద్దులు, ఉయ్యాల పాటలను పాడి అమ్మలక్కలను. బాగోతం చెప్పే పెద్దమనుషులను, సారా తాగి ఊగోళ్ల తంతును నమ్మకాలు, జానపదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలతో పాటు అనేక అంశాలపై పాటలను రాసి ఆల్బం తయారు చేశాడు. తెలంగాణ సాంస్కృతిక సారధిగా పని చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పతకాలపై పాటలను రాసి బంగారు తెలంగాణ కోసం పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేశాడు. ఈ సంక్షేమ పథకాలపై ఆల్భంను తయారు చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతే కాకుండా హరితహారం వంటి కార్యక్రమాలకు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసలు పొందాడు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం ప్రస్తుతం కనుమరుగు అవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సి ఉంది. నాడు జనపదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ నేటి కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలను కూడా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన ప్రతి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. – నాగిళ్ల కొండల్ -
తెలంగాణలో ఆర్థిక దోపిడీ పెరిగింది: ఏచూరి
సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక దోపిడీ పెరిగిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మంగళవారం మిర్యాలగూలోని ఎన్ఎస్పీ క్యాంపులో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన బహిరంగసభలో ఆయన పా ల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళి తులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. యువత ఉద్యోగాలు లేక ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారని, అన్నదాతల ఆత్మహత్యలు సైతం పెరిగాయన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ఒకటేనన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీతో టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్లో బీజేపీని టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, కానీ ఇక్కడ మా త్రం ముస్లిం ఓట్ల కోసం వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పూర్వవైభవం వ స్తుందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు. అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కేసీఆర్‌ను పారదోలాలన్నా రు. రాష్ట్రంలో బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, చదువుల సావిత్రి పథకాన్ని, కూలీబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. సీపీఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డబ్బి కార్ మల్లేష్ అథ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారా ములు, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, హుజూర్నగర్, నాగార్జునసాగర్ బీఎల్ఎఫ్ అభ్యర్ధులు పారేపల్లి శేఖర్‌రావు, సౌజన్య, నాయకులు రాములు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాలి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు... -
ఓటరు స్లిప్పు లేకుంటే.. గుర్తింపు కార్డు తప్పని సరి
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : శాసనసభ ముందస్తు ఎన్నికలు ఈ నెల 7న శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఓటు వేయడానికి ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ స్లిప్పులు లేకున్నా ఓటరు జాబితాలో తమ కార్డు నంబరు, పోలింగ్ బూతు నంబరు, ఓటరు క్రమ సంఖ్య తెలిసి ఉంటే తెల్లకాగితంపై రాసుకుని వెళ్లి ఎన్నికల సంఘం ఆమోదించిన ఆధార్‌కార్డుతో పాటు డ్రైవింగ్, పాన్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు లాంటి తదితర గుర్తుంపు కార్డులు ఏ ఒక్కటి ఉన్నా చూపించి కూడా ఓటు వేయవచ్చు. పోలింగ్ బూతులో ఏజెంట్ అభ్యంతంరం తెలిపినపుడు వారిని సంతృప్తి పరిచే విధంగా రుజువు చేసుకోవలసి ఉంటుంది. స్థానిక బూతులెవల్ అధికారి,గ్రామ రెవెన్యూ అధికారి నిర్ధారణ చేస్తారు. పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఓటు వేయడానికి ఎంత పెద్ద వరుస ఉన్నా వారందరూ ఓటువేయడానికి అవకాశం కల్పిస్తారు.ఒక వేళ అవకాశం ఇవ్వక పోతే అక్కడి పరిశీలకులు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేస్తారు. అంధులు, శరీర దౌర్భల్యం గల వారిరు ఓటు వేయడానికి సహాయకులను తీసుకుపోవచ్చు. అయితే సహాయకున్ని ఒక ఓటుకు మాత్రమే అంగీకరిస్తారు. మళ్లీ రాకుండా సహాయకుని కుడిచేతిచూపుడు వేలుకు సిరా గుర్తు వేస్తారు. పోలింగ్ బూతులోనికి కెమరాలు, సెల్ ఫోన్లు అనుమతించరు. ఓటు వేయడానికి బహిరంగంగా డబ్బు ,బహుమతి, మద్యం తీసుకొన్న వారితో పాటు ,ఇచ్చిన వారిని అరెస్టు చేస్తారు. అభ్యర్థికి చెందిన వాహనంలో ఓటు వేయడానికి వచ్చిన అరెస్టు చేయవచ్చు. -
మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురేస్తాం
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అన్నా రు. ఆదివారం స్థానిక సంతోష్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల్లో అపూర్వ స్పందన కనిపిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకవస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, కౌన్సిలర్ వంగాల నిరంజన్‌రెడ్డి, ఎఎంసీ వైస చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సైదులుబాబు, వీరారెడ్డి, షోయాబ్, వహిద్, ఇమ్రాన్, అనిల్, పద్మావతి పాల్గొన్నారు. భాస్కర్‌రావు సతీమణి ప్రచారం.. భాస్కర్‌రావు సతీమణి జయ ఆదివారం పట్టణంలోని హనుమాన్‌పేట, ఈదులగూడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట ధూళిపాల కళావతి, దేవకమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, లింగా రెడ్డి, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు. బాపూజీనగర్‌లో తనయుడి ప్రచారం.. భాస్కర్‌రావు తనయుడు నల్లమోతు సిద్ధార్థ ఆదివారం పట్టణంలోని బాపూజీనగర్, వడ్డెరిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ అంజన్‌రాజు, నాయకులు కుర్ర విష్ణు, ముత్యం, శ్రీనివాస్, సైదులు, పెద వెంకటమ్మ, లింగమ్మ, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్, యాదవ యూత్ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మనోజ్, బొంగరాల సందీప్, నవీన్, సురేష్, మధు, రమేష్ ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మండల అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సైదులుయాదవ్, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
మిర్యాలగూడ: వరసలు కలిపి ...ఓట్లు అడిగి..
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఇనాళ్లు చూసీ చూనట్లు వ్యవహరించిన నేతలకు ఎన్నికల ప్రచారంలో బంధుత్వాలు గుర్తుకొస్తున్నాయి. గ్రామాల్లో తమ తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ద్వితీయ శ్రేణి నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార సమయంలో నేతలందరూ వరుసలు కలిపి ఓటర్లను పలకరిస్తున్నారు. గ్రామాల ఓటర్లతో పాటు పక్క గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తల బంధువుల ఓటర్ల సహితం జార విడుచుకోకుండా ముమ్మరప్రయత్నాలు చేస్తూ, సాధారణ కార్యక్తలను సైతం అభ్యర్థులు, ముఖ్యనాయకులు మచ్చిక చేసుకొంటున్నారు. మర్యాదగా మాట్లాడడంతో పాటు మనోళ్ల ఓట్లు మిస్ కాకుండా చూడండని అదేపనిగా చెబుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో కాస్తా పేరున్న వారిని కలిసి తమ వైపు తిప్పుకొనేందుకు వివిధ పార్టీల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా రాకుండా గతంలో గుర్తుకు రాని సంఘాలను, నాయకులునుమరీ మరీ గుర్తుకు చేసుకొని సభలు చసమావేశాలు నిర్వహించి ఓటర్లను కూడగట్టుకొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతకు మద్దతుగా, బంధువర్గ ఓటర్లను గూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వార్తాలు... -
ఈవీఎంలు ఎలా పని చేస్తాయంటే ...
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : సాధారణ ఎన్నికల్లో వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఈవీఎంలు అంటారు. ఓటింగ్‌లో కంట్రోలింగ్ యునిట్ (సీయూ), బ్యాలెట్ యునిట్ (బీయూ),కీలకం. వాటి పనితీరును ఎన్నికల వేళ ఒకసారి పరిశీలిద్దాం. ఓటర్లు వేసే ఓటింగ్‌లో సీయూ, బీయూ కీలక మైన ఎన్నికల కేంద్రంలోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓట్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంది. ప్రతి ఓటరు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు అధికారి సీఅయూలోని బ్యాలెట్ బటన్ నొక్కితే ఓటరు వద్ద ఉన్న బ్యాలెట్ యునిట్ ద్వారా ఓటు వేసేందుకు వీలవుతుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒక వేళ అంతకంటే ఎక్కువ గుర్తులు ఉంటే...మరో యంత్రాన్ని ఉపయోగించాలి. అభ్యర్థులు పది మందికన్న తక్కువగా ఉంటే ఎంత మంది పోటీలో ఉంటే అందరి గుర్తులు ఉండేలా సాంకేతిక చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు 10మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 10బటన్లు మాత్రమే పని చేసేలా చేస్తారు. అదే విధంగా పై వారిలో ఎవరు కాదు అనే అనే అంశంలో( నోటా)బటన్ కూడా ఉంటుంది. ఇది అభ్యర్థుల అందరి గుర్తు కంటే దిగువన ఉంటుంది. ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్ బటన్ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని ‘బిజీ’ బల్బు వెలుగుతుంది. బీయూలోని అభ్యర్థుల గుర్తుల్లో ఎదురుగా ఉన్న బటన్ నొక్కితే ఓటు వేసే పక్రియ పూర్తయినట్లు. ఎన్నిక పూర్తి కాగానే బీజీ బల్బు ఆగిపోతుంది. అప్పుడు అధికారి మరో ఓటరును పంపించి ఎన్నికల అధికారి బ్యాలెట్ బటన్ నొక్కుతాడు. ఇలా మరొకరు ఓటు వేసేందుకు వీలవుతుంది. సీయూ, బీయూ ధ్రువీకరణ : సీయూ, బీయూ వెనుక వైపున పనిశీలిస్తే ఈవీఎం యంత్రాలు క్యూసీ క్వాలిటీ చెక్ జరుగుతుందీ లేనిది తెలుసుకోవచ్చు. వెనుక భాంగాలో అంటించి ఉండే స్టికర్‌పై ఈవీఎం తయారీ సంస్థ ఈసీఎల్ ప్రతినిధి, జిల్లా ఎన్నిక అధికారి ఈవీఎం పనితీరు, క్వాలిటీని ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి ఉంటాయి. పకడ్బందీగా పరిశీలన : ప్రస్తుతం ఈవీఎంల తనిఖీ చాలా వరకు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రథమ దశలో సజావుగా ఉన్నాయని తెలిపేందుకు పైభాగంలో భారత ప్రభుత్వ లోగోతో కూడిన పింక్ స్టికర్ అంటిస్తారు. ఈవీఎంలపై ఆయా రాజకీయ పార్టీల సందేహాలు, అనుమానాలు నివృతి చేసేందుకు వీలుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్ పోలింగ్ సందర్భంగా ఆయా పార్టీ అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తుపై ఓట్లు వేసి తరువాత పోలైన ఓట్లతో ఏయే గుర్తులకు ఎన్ని ఓట్లు పడ్డాయో సరిచూస్తారు. నీలి రంగు మూతలు తెరిస్తే ...క్లోజ్ , రిజల్స్ ,ప్రింట్ ,క్లియర్ అనే బటన్లు కనిపిస్తాయి. ఆయా సూచికలు సదరు పనిచేస్తాయి. రివర్స్ బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఇవన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించే పనులు కాగా రాజకీయ పార్టీల అనుమానాలు తొలగించేందుకు మాక్ పోలింగ్‌లో వాటిద్వారా ఈవీఎం పని తీరు తెలియజేస్తారు. కంట్రోలింగ్ యూనిట్ కంట్రోలింగ్ యూనిట్లో ఎరుపు రంగు దీర్ఘ చతురస్రాకారంలో ఉన భాగం ‘‘డిస్ప్లే’’ఈ ప్రాతంలో ఎంత మంది ఓటు వేసింది.. ఎప్పటికప్పుడు తెలుపుతుంది. దిగువన నీలి రంగులో చతురస్రాకార భాగాలున్న ప్రాంతంలో ఉన్న››‘క్యాండ్ సెట్ యూనిట్ ’గా వ్యవహరిస్తారు. వీటిని రిటర్నింగ్ అధికారి స్థాయిలో పోలింగుకు ముందు తగిన విధంగా సెట్ చేసి ఉపయోగిస్తారు. -
నిఘా నేత్రం..!
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు , మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతి అంశాన్ని నేరుగా పరిశీలకులకు, ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. వ్యయ పరిశీలకులు : వ్యయ పరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతి జిల్లా నియోజకవర్గాలకు అనుగుణంగా పరి శీలకులను నియమించారు. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజక వర్గాలకు గాను ఇద్దరు ఆర్.గోపాలస్వామి (నల్లగొండ, నకరేకల్, మునుగోడు నియోజకవర్గాలు), ఆకాశ్ దేవా నంద్ (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజక వర్గాలు) లను వ్యవయ పరిశీలికులుగా నియమించారు. ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్) : జిల్లా వ్యప్తంగా ఆరు నియోజకవర్గాల్లో ఈ కమిటీలో 33మంది పని చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఐఏఎస్‌తో పాటు వీడియో గ్రాఫర్ ఉంటారు. ప్రవర్తణా నియమావళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలను రద్దు చేయడం వాహనాలను అడ్డుకోవడం వంటి విధులు నిర్వహిస్తారు. వీడియో నిఘా బృందాలు : వీడియో నిఘా బృందాలు నియోజక వర్గానికి ఒ కటి చొప్పున ఉంటుంది. ప్రతి బృందానికి అధి కారి, వీడియో గ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమిచుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. అకౌంట్ టీం: జిల్లాలో మొత్తం ఆరు బృందాలు ఉన్నాయి.ఒక్కొ బృందానికి అధికారి, సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిణీ సామగ్రి లెక్కలు చూసి వాటిని ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. వీడియో వీక్షణ బృందం : ప్రతి నియోజకవర్గానికి ఒక బృందం చొప్పున కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్సర్వోలెన్స్ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలను, వీడియోలను పరిశీలిస్తారు.ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయని వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు. సహాయ పరిశీలకులు పరిశీలకులకు సహాయంగా ఉండేందుకు సహాయ వ్యయ పరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభు త్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాన్ని పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పే రుతో ఒక రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజి స్టర్ పొందుపరిచిన ఖర్చులతో పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరుతారు. అంతిమంగా అ భ్యర్థిఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఉంటారు. జిల్లాలో ఒక్కొక్క నియోజక వర్గానికి మూడు నుంచి నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.ఒక్కొక్క బృందంలో డీటీస్థాయి అధి కారితో పాటు ముగ్గురు లేదా నలు గురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతి నియోజకవర్గంలో మూడు అపై సంఖ్యలో ఉంటారు. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే ఒక అధికారి మెజిస్టీరియల్ అధికారులు ఉంటారు. ఇలా జిల్లా మొత్తం ఆరు నియోజక వర్గాల పరిధిలో 18మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పని చేస్తున్నారు.బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్లు, ఏఎస్సై , వీడియో గ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారం ఇస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు. -
‘లిఫ్ట్’ ఇచ్చేవారేరీ?
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాల కింద రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎత్తిపోతల పథకాల నిర్వహణను కూడా ప్రభుత్వమే చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా ఎత్తిపోతల పథకాలకు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆధునికీకరించారు. కానీ నిర్వహణ భారం రైతులపై పడడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో 41 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటి పరిధిలో 83 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తరచుగా కాలిపోతున్న విద్యుత్ మోటార్లు, పగిలిపోతున్న పైపులతో పాటు ఆపరేటర్లను నియమించుకోవడం రైతులకు భారంగా మారింది. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరందడం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు మాత్రం అధికారంలోకి వస్తే ఎత్తిపోతల నిర్వహణ భారం ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్నారు కానీ ఆ హామీలు అమలు కావడం లేదు. బాబు హయాంలోనే లిఫ్ట్‌ల నిర్వీర్యం చంద్రబాబు నాయుడు హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేది. కాగా ప్రభుత్వానికి అధిక భారమవుతుందని భావించిన బాబు ఎత్తపోతల పథకాలను రైతులే నిర్వహించుకోవాలని 1999లో ఆదేశాలు జారీ చేశారు. దాంతో మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు రైతులే చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా విద్యుత్ బిల్లులు ఒక్కొక్క లిఫ్ట్‌కు లక్షల రూపాయల్లో వచ్చేది. దాంతో విద్యుత్ బిల్లులు చెల్లించుకోలేని రైతులకు నిర్వహణ భారంగా మారడంతో ఎత్తిపోతల పథకాలు మూసివేయడంతో 80 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు దొరకని స్థితిలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలోరైతులకు మేలు 2004లో దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎత్తిపోతల కింద రైతులకు ఎంతో మేలు జరిగింది. ఆయన ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేయగా ఎత్తిపోతల రైతులకు కూడా వర్తింపజేశారు. అంతే కాకుండా ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీల బకాయిలు కూడా మాఫీ చేశారు. మరమ్మతులకు గాను 7 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అంతే కాకుండా 2006లో ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 16 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేశారు. ఎత్తిపోతల కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టులో 80 శాతం ఆయకట్టు సాగులోకి వచ్చింది. దాంతో ఎత్తిపోతల రైతులకు మహర్దశ కలిగింది. భారమైన నిర్వహణ ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రత్యేక విద్యుత్ లైన్లు, ఆధునికీకరణలో నూతన మోటార్లు ఏర్పాటు చేసినా తరచుగా మోటార్లు కాలిపోవడంతో రైతులకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ఇద్దరు ఆపరేటర్లను నియమించుకోవడంతో పాటు తరచుగా పలిగిపోతున్న పైపులు, కాలిపోతున్న మోటార్లను మరమ్మతులు చేయాలంటే రైతులు ఎకరానికి కొంత డబ్బులు వసూలు చేసి నిర్వహణ చేసుకుంటున్నారు. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువ చివరి భూములు బీడుగా మారుతున్నాయి. ఆపరేటర్లను నియమించాలి : మిర్యాలగూడ : లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ ద్వారా ఆపరేటర్లను నియమించాలి. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించి, నిర్వహణ చేపట్టకుండా వది లేస్తే ఆ ఫలితం అందే పరిస్థితి లేదు. రైతులు నిర్వహించే పరిసి ్థతి లేదు. దీంతో రైతులపై నిర్వహణ భారం పడుతుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి లిప్టులు నడవని పరిస్థితి నెలకొంది. – దైద నాగయ్య, గోగువారిగూడెం నిధులు కేటాయించాలి .. మిర్యాలగూడ : లిఫ్ట్‌లను ఆధునికీకరించారు కానీ నిర్వహణ చేపట్టడం లేదు. మోటార్లు కాలిపోవడం, పైపులు పగిలిపోతున్నా ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో రైతులకు భారంగా మారుతుంది. దీంతో పంటకు నీరందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ప్రతి ఏటా కేటాయించాలి. – భిక్షం, రైతు, అన్నపురెడ్డిగూడెం రైతులపై అధిక భారం.. మిర్యాలగూడ : సాగర్ కుడి కాల్వపై ఉన్న లిఫ్ట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తే ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులను రైతులు నిర్వహించుకోవాల్సి వస్తుంది. దీంతో రైతులపై అధిక భారం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం లిఫ్టు నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే నిర్వహిస్తుందని హామీ ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి. – పసుల వెంకటయ్య, రావులపెంట, లిఫ్ట్ చైర్మన్ ప్రభుత్వమే నిర్వహించాలి.. నడిగూడెం : 15 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథకాలను రైతులే శిస్తులు చెల్లించి నిర్వహించుకుంటున్నాం. అది కూడా రైతులు పూర్తి స్థాయిలో శిస్తులు వసూలు కావడంలేదు. దీంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలి. –మొక్క రాంబాబు, సిరిపురం లిఫ్ట్ నిర్వహణ కమిటీ వేయాలి.. మేళ్లచెరువు : వెల్లటూరు లిప్టు నిర్వహణ సక్రమంగా లేక పం టలు ఎండిపోయే పరిస్థితి ఉంది. లిఫ్ట్ నిర్వహణకు కమిటీ వేయాలి. వాటి మరమ్మతులకు నిధులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంటలు పూత, పిందె సమయంలో నిర్వహణ లోపంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – కర్నాటి నారాయణరెడ్డి ,మేళ్లచెరువు హామీని అమలు చేయాలి.. తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాని నేటికీ అది అమలు కాలేదు. ఆయకట్టు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. – పల్రెడ్డి రఘుమారెడ్డి రైతు, అల్వాల హాలియా సభలో హామీ ఇవ్వాలి.. తిరుమలగిరి : తెలంగాణ వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా లిప్టులపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరం. లిప్టులను రైతులే నిర్వహించుకోవడంతో చాలా భారం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తెలంగాణ వస్తే ఎడమకాలువపై ఉన్న లిప్టులను ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికి అమలు కాలేదు. ఈనెల 27న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ రైతలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. – నాంపల్లి సైదులు, అల్వాల లిఫ్ట్ రైతులను ఆదుకోవాలి.. నిడమనూరు : ఎత్తిపోతల పథకాల కింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లిఫ్ట్ ఆపరేటర్లకు, మోటార్లు చెడిపోయినప్పుడు చేసే మరమ్మతులకు, కాలువల మరమ్మతులకు, రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. అసలే మెట్ట పంట వేసే రైతులపై ఆ భారం ఎక్కువగా ఉంటుంది. పూర్తి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే స్వీకరించాలి. – పిల్లి రాజు, రైతు, నిడమనూరు ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి.. మేళ్లచెరువు : మండలంలోని రేవూరు, వేపలమాధవరం, మేళ్లచెరువు గ్రామాల్లోని పంట పొలాలకు నీటిని అందించే వెల్లటూరు లిఫ్ట్‌ను ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. మోటారు, పైపులైన్, విద్యుత్ వంటి సమస్యలు, మరమ్మతులు వంటి వాటిని ప్రభుత్వమే భరించాలి. మరమ్మతులకు నిధులు కేటాయించాలి. – జె.గురవయ్య యాదవ్, రేవూరు రైతుల నుంచే ఖర్చులు వసూలు.. మునగాల : సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రతి ఏడాది విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురికావడం, సిబ్బంది జీతాలు తదితర ఖర్చులు రైతుల నుంచి వసూలు చే యాల్సి వస్తుంది. – మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఎత్తిపోతల పథకం చైర్మన్, కొక్కిరేణి -
పోస్టల్ బ్యాలెట్ ఇలా ...
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పని సరిగా ఓటు వేయాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల రోజు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగి, పోస్టల్ బ్యాలెట్æద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఫారం –12 ద్వారా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థన పత్రం రాయాలి. జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి నిర్ధారణ పత్రంతో పాటు ఫారం–12 అందజేస్తారు. ఇది పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడానికి సరిపోతుంది. ఫారం–12 నింపి దానితో పాటు పోలింగ్ విధులకు నియమిస్తున్నట్లు ఇచ్చిన డబ్లుకేట్ ఆర్డర్ కాపీని జత పరచి రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఇది పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన కేంద్రంలో కూడా అందజేయవచ్చు. పోలింగ్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఇచ్చిన తరువాత వారు ఓటు వేసి దానిని శిక్షణ తరుగతుల్లోనే జమచేసి వీలు రిటర్నింగ్ అధికారికి కల్పిస్తారు. దీని వల్ల పోస్టులో పంపాల్సిన అవసరం ఉండదు. మహిళ ఉద్యోగులు తాము పని చేస్తున్న నియోజక వర్గంలోనే పోస్టు అవుతారు. ఇలాంటి సందర్భంలో వారికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు వారు ఎన్నికల విధులు నిర్వహించ వలసి ఉంటుందో అక్కడ ఓటు వేయవచ్చు.చివరి క్షణాల్లో ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)ఫోస్టింగ్ రద్దు ఆయితే వారు ఎక్కడ డ్యూటీ చేస్తారో అక్కడ ఓటు వేయవచ్చు. అయితే వారికి ఓటు ఉండాలి. -
బంధం.. ప్రతి బంధకం
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : అర్హులందరికీ ఓటు హ క్కు కల్పిస్తాం, ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని గ్రామాల ఓటర్ల పోలింగ్ బూత్ అందుబాటులో లేక ఓటు వేసేందుకు నానావస్థలు పడుతున్న గ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ కోవకు చెందిన గ్రామమే మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధీరావత్‌తండా. ఇటీవల నూతన గ్రామ పంచా యతీగా మారింది. ఈ తండాలో 315 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో ఐదుగురు వృద్ధులు, ఇద్ద రు దివ్యాంగులున్నారు. ఈ గ్రామస్తులు ఓటు వే సేందుకు తుంగపహాడ్ గ్రామ శివారు లావూడితండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్ చెప్పు కొనేందుకు రెండు కిలో మీటర్ల దూరమే అయినా రోడ్డు వసతి లేదు. ధీరావత్‌తండా నుంచి లావూడితండాకు వెళ్లాలంటే పొలం గట్ల మీదుగా కాలి నడకన వెళ్లాలి. అలా వెళదామన్న రెండు వాగులు(బంధాలు) దాటాలి. ఈ వాగుల నిండా నీరు ఎల్లప్పుడూ ఉం టుంది. దీంతో వాగులను దాటే పరిస్థితి ఉండదు. కనీసం సైకిల్, బైక్‌గానీ వెళ్లే అవకాశం లేదు. ఓటు వేయాలంటే బంధమైనా దాటాలి..18కి.మీటర్లైనా ప్రయాణించాలి: ధీనావత్తండా వాసులు ఓటు వేయాలంటే పొలం గట్టున రెండు కిలో మీటర్లు కాలినగక వెళ్లి రెండు బంధాలు దాటితే కానీ వారు ఓటు వేయడానికి ఏర్పాటు చేసిన లావూడితండాలోని పోలింగ్ బూత్‌కు చేరుకోలేరు. ఈ మార్గం వెళ్లడానికి కనీసం కాలిబాట సౌకర్యం లేదు. కాగా వాహనాలపై వెళ్లాలి. వెళ్లాలంటే శ్రీనివాస నగర్, తుంగపహాడ్‌లో పోలింగ్ బూత్‌లను దాటి 9 కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెళ్లాలి. ఓటు వేసి తిరిగి వారు తండాకు రావాలంటే 18కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిందే. దీనితో వీరు ఓటు వినియోగించుకోవాలంటేనే ఎంతో ఇబ్బందిగా భావిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధీరావత్‌తండా ఓటర్లకు పక్కనే ఉన్న శ్రీనివాసనగర్ పోలింగ్ బూత్‌కు మార్చడమన్న, లేదా తండాలో ప్రత్యేక బూత్ ఏర్పాటైనా చేయాలని తండా ఓటర్లు కోరుతున్నారు. తండాలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి : ధీరావత్తండాలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. తండాలో 315మంది ఓటర్లు ఉన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వాగులు దాటి వెళ్లే పరిస్థితి లేదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. స్పందన లేదు. ఎన్నిక సమీక్షనైనా, ఎన్నికల అధికారులైనా స్పందిచాలి. తండాలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలి. – ధీరావత్ రమేశ్, ధీరావత్ తండా -
ముడిపడని ఆ..మూడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకుగాను పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ నాయకత్వం ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. మొదటి విడతలో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో మిగిలిన ఈ మూడు స్థానాల్లో ఏ కూటమి పక్షానికి ఏ స్థానం కేటాయిస్తారు..? అసలు ఒక్క సీటన్నా వారికి విడిచిపెడతారా..? లేదంటే మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటిస్తారా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో శనివారం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆఖరి విడత జాబితాను విడుదల చేయనుందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు స్థానాల అభ్యర్థులు ఎవరవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూటమి కట్టిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలకు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కేటాయించలేదు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే కూటమి పక్షాలు తిరుగుబాటు చేస్తాయా? పోటీగా బరిలోకి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసక్తి రేపుతున్న మిర్యాలగూడ టీజేఎస్ ముందునుంచీ మిర్యాలగూడ ఆశిస్తోంది. కానీ, ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రఘువీర్‌రెడ్డికి ఇవ్వలేని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీజేఎస్‌కు ఇప్పటికే 8 స్థానాలను కేటాయించారు. అదనంగా తమకు మరో స్థానం కావాలని, అది మిర్యాలగూడమేనని కోరుతోంది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ నాయకత్వం జాబితా కూడా ప్రకటించింది. ఆ పన్నెండు స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం. మరో వైపు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని అంటున్నా రు. దీంతో ఢిల్లీ ప్రయత్నాలను పక్కన పెట్టేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది..? లేదంటే టీజేఎస్‌కే ఇచ్చేస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెబల్‌గా .. బరిలోకి అలుగుబెల్లి ? టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. జానా తనయుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ దక్కని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. ఆ హామీపైననే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అసలు మిర్యాలగూడ స్థానం ఎవరికి ఇస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో...‘ఒకవేళ మిర్యాలగూడ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లయితే... ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాల్సిందే..’ అని అలుగుబెల్లిపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఈ ప్రాంతంలో టీజేఎస్ ఏమాత్రం బలంగా లేకపోవడం, కాంగ్రెస్ ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం రెబల్ ఆలోచనలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, ప్రచారం కూడా చేసిన అలుగుబెల్లిని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే అమరేందర్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ శనివారం దాకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇక్కడ కూటమి పక్షాల గొడవ లేకున్నా, కాంగ్రెస్‌లోనే పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. దేవరకొండ స్థానాన్ని జగన్‌లాల్ నాయక్, బిల్యానాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీలో చేరిన బిల్యా నాయక్ ఆయన కోటాలోనే ప్రయత్నం సాగిస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలునాయక్, అదే పార్టీనుంచి జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు వెళ్లినా, తిరిగి సొంత గూటికి చేరుకుని టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల మధ్య టికెట్ దోబూచులాడుతోంది. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ , డాక్టర్ రవి పోటీ పడుతున్నారు. ఈ స్థానం లెక్క తేలాల్సి ఉంది. -
మిర్యాలగూడను జిల్లా చేయాలి
మిర్యాలగూడ: మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిర్యాలగూడ జిల్లా సాధన కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిర్యాలగూడ జిల్లా సాధనకు ఉద్యమ కార్యచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసినట్లు చెప్పారు. కాగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల వల్ల సీఎం కేసీఆర్ వద్దకు జిల్లా డిమాండ్ అంశం చేరిందన్నారు. జిల్లా సాధించే వరకు ఉద్యమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించినట్లు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు వివరించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలంతా మిర్యాలగూడ జిల్లా కావాలని కోరుకుంటున్నారని, అదే విధంగా హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బంటు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, టీపీసీసీ సభ్యుడు పగిడి రామలింగయ్య, స్కైలాబ్‌నాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ యూసుఫ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, చిరుమర్రి కృష్ణయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, పట్టణ కార్యదర్శి జగదీశ్చంద్ర, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు, కరీం, సమీఖాద్రి పాల్గొన్నారు.