
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2017–18 విద్యాసంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం 2.09 లక్షల ప్రవేశాలు అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యార్థుల నమోదుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ తాజా గణాంకాలు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 29,343 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 475 కేజీబీవీలు, 1,771 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు సంక్షేమ సొసైటీలకు సంబంధించి గురుకులాలు, ఆదర్శ పాఠశాలలున్నాయి. ఈ నెల మొదటి వారం నాటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో 28,29,135 మంది విద్యార్థులున్నారు.
గురుకులాల్లో సీట్లు.. మెనూలో మార్పులు..
కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఉచిత వసతితోపాటు ఆంగ్ల మాధ్యమ బోధనకు ప్రాధాన్యం ఇవ్వడంతో గురుకులాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అలాగే విద్యార్థుల భోజన మెనూలోనూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(ఎన్‌ఐఎన్) సూచన మేరకు బలవర్థకమైన ఆహారాన్ని ఇచ్చేలా ప్రత్యేక మెనూ రూపొందించింది. దీంతో నెలలో ఆరుసార్లు మాంసాహారంతో కూడిన భోజనం, రోజూ ఉడికించిన కోడిగుడ్డు, పా లు తదితరాలను పిల్లలకు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ప్రవేశాలు అమాంతం పెరిగాయి. కొత్తగా ప్రారంభించిన గురుకులాల్లో తొలుత 5, 6, 7 తరగతులు ప్రారంభించగా.. ఈ ఏడాది ఎనిమిదో తరగతి అందుబాటులోకి వచ్చింది. దీంతో గురుకులాల సీట్లు వేగవంతంగా భర్తీ అవుతున్నాయి. దాదాపు అన్ని గురుకులాల్లో 99.24 శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈసారికి విద్యార్థుల ప్రవేశాలు మోస్తరుగా పెరిగాయి. 2017– 18 విద్యా సంవత్సరంలో 21.5 లక్షల మంది పిల్లలుండగా.. 2018–19లో వీరి సంఖ్య 22.69 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే ప్రవేశాల సంఖ్య భారీగా పెరుగుతుంద ని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment