జాతీయ పతాకానికి అవమానం!
సాక్షి, కాటారం : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణలో అపశృతి దొర్లింది. ఎగురవేస్తుండగా తాడు నుంచి జాతీయ పతాకం విడివడి గాల్లోకి ఎగిరి కింద పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోటుచేసుకుంది.
అయితే వెంటనే తమ పొరపాటును గుర్తించి జెండాను సరిచేసి మరోసారి ఎగురవేశారు. దీనిపై మార్కెట్ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జెండా కర్రను రాత్రి సిద్ధం చేశామని, అయితే తాడును ఎలుకలు ఏమైనా కొరికి ఉండొచ్చునని, దీన్ని గమనించకపోవడం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.