కోట్ల రూపాయలు.. ఖాతాల్లో కన్‌‘ఫర్మ్’ | Indira Jal Prabha funds into the hands of private individuals | Sakshi
Sakshi News home page

కోట్ల రూపాయలు.. ఖాతాల్లో కన్‌‘ఫర్మ్’

Published Sat, Feb 7 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

కోట్ల రూపాయలు.. ఖాతాల్లో కన్‌‘ఫర్మ్’

కోట్ల రూపాయలు.. ఖాతాల్లో కన్‌‘ఫర్మ్’

ఇందిర జలప్రభ నిధులు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి
 
రిజిస్టర్డ్ ఫర్మ్‌ల పేరిట కోట్ల రూపాయలు ప్రైవేటు ఖాతాల్లోకి  ఓపెన్‌వెల్స్ పేరిట రూ.1.75 కోట్లు.. బోర్‌వెల్స్‌లో దాదాపు రూ.కోటి మోటార్లిచ్చే ఏజెన్సీలకు మరో రూ.83లక్షలు పనిచేయకుండానే డబ్బులు డ్రా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నిధులూ ఎగనామంసంతకం పెడితే లంచమిస్తామని క్షేత్రస్థాయి సిబ్బందికి ఎర ఖాళీ బాండుపేపర్లు ఇచ్చి మరీ సంతకాలు పెట్టించుకున్న వైనం
 
నల్లగొండ : ఇందిర జలప్రభ పథకం జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. పట్టించుకోవాల్సిన వారే పక్కదారి పట్టడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఇప్పటికే తేటతెల్లమైంది. అయితే, ఈ విషయంలో లోతుల్లోకి వెళ్లేకొద్దీ కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు... ఏకంగా కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. రిజిస్టర్డ్ ఫర్మ్‌ల పేరిట మెటీరియల్ సరఫరా చేస్తామని డ్వామాతో ఒప్పందం కుదుర్చుకున్న కొందరు కాసులకు కక్కుర్తి పడి, ఉన్నతాధికారులకు  ఆమ్యామ్యాలిచ్చి దళిత, గిరిజనులకు చెందాల్సిన కోట్ల రూపాయలను తమ ఖాతాల్లో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెన్‌వెల్స్, బోర్‌వెల్స్, రీచార్జ్‌డ్ స్ట్రక్చర్స్ పేరిట దాదాపు 2.75 కోట్ల రూపాయలు ఈ ఫర్మ్‌ల ఖాతాల్లోకి వెళ్లాయి. అయితే, ఈ నిధులను నేరుగా లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉన్నా వారికి చెల్లించకుండానే పక్కదారి పట్టించారు. పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. ఇందుకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బంది సంతకాలను కూడా ఎరలు వేసి పెట్టించుకున్నారు. మీరు సంతకాలు పెడితే డబ్బులిస్తామని, నమ్మకం లేకపోతే ఖాళీ బాండ్లు తీసుకోవాలని చెప్పి, ఆ బాండ్లు ఇచ్చి మరీ సంతకాలు పెట్టించుకున్నారు... ఇంత జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన వారు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఫర్మ్‌ల నిర్వాహకులిచ్చిన పైసలు జేబులో వేసుకుని గమ్మున ఉండిపోయారు.

ఒక్క ఫర్మ్ ఖాతాలోనే రూ.87లక్షలు..

ఉపాధి హామీ వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈ పథకం అమల్లో గతంలో పనిచేసిన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. వాస్తవానికి ఈ పథకంలో ఫ్రభుత్వంనుంచి నేరుగా నిధులు లబ్ధిదారుడికి వెళ్లాలి. కానీ మధ్యలో ఫర్మ్‌ల పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ పథకంలో చొరబడ్డారు. లబ్ధిదారులకు అవసరం అయిన మెటీరియల్‌ను తాను పంపిణీ చేస్తామని, ఇందుకు తమ ఫర్మ్‌లను అనుమతించాలని డ్వామా వద్ద దరఖాస్తు చేసుకున్నారు. నిధులు బొక్కేయవచ్చనుకున్నారో లేక ఫర్మ్‌ల ద్వారా పని సులువవుతుందనుకున్నారో కానీ గతంలో పనిచేసిన అధికారులు ఈ ఫర్మ్‌లను రిజిస్టర్ చేసుకున్నారు. వీటి ద్వారా మెటీరియల్ ఇప్పించినందుకు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ జమ వివరాలను పరిశీలిస్తే ఓపెన్‌వెల్స్ పనులకు గాను మొత్తం రూ.1.75 కోట్లు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యాయి.

అందులో ఒక్క ఫర్మ్‌కే రూ.87.77 లక్షలకు పైగా జమ చేశారు. మరో ఫర్మ్‌కు రూ.30.55 లక్షలు, ఇంకో ఫర్మ్‌కు రూ.38.10 లక్షలు, ఇంకో దానికి రూ.13.8లక్షలు, మరోదానికి రూ.9.57 లక్షలు జమచేశారు. ఇక, బోర్‌వెల్స్, రీచార్జ్‌డ్ స్ట్రక్చర్ల నిర్మాణం కోసం ఏకంగా డ్వామా వద్ద జిల్లాలో 25 ఫర్మ్‌లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఫర్మ్‌లకు మొత్తం మీద కోటి రూపాయల దాకా జమయ్యాయి. ఇందులో అత్యధికంగా రూ.16.38 లక్షల నుంచి అత్యల్పంగా రూ.92 వేల వరకు జమ చేశారు. రూ.11.74 లక్షలు, రూ. 11.75 లక్షలు, రూ. 7.25 లక్షలు, రూ. 6.46 లక్షలు... ఇలా ఫర్మ్‌ల ఖాతాల్లో జమచేశారు. ఇక, ఎలక్ట్రిఫికేషన్ కోసం జిల్లాలో ఎంపిక చేసిన నాలుగు ఏజెన్సీలకు కూడా రూ.80లక్షలకు పైగానే మంజూరయ్యాయి. అందులో అత్యధికంగా ఒక ఏజెన్సీకి రూ. 48.68లక్షలు, మరో ఏజెన్సీకి రూ. 27.81లక్షలు, ఇంకో ఏజెన్సీకి రూ.7.88 లక్షలు, మరో ఏజెన్సీకి రూ. 1.46 లక్షలు జమ చేశారు. ఈ ఫర్మ్‌లు, ఏజెన్సీలకు జమ చేసిన నిధులన్నీ పక్కదారి పట్టాయని కాదు కానీ... చాలా వరకు దుర్వినియోగం అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. కొందరు మాత్రం నిబంధనల ప్రకారం పనులు చేయగా, కొన్ని ఫర్మ్‌ల నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రైవేటు వ్యక్తులను నమ్మి ఇన్ని లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయడం ఎందుకో అర్థం కాని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు గతంలో పని చేసిన ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలిచ్చి ప్రజల సొమ్మును లాగించేశారు. ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లిన నిధుల్లో దుర్వినియోగం అయిన నిధులన్నింటినీ రాబట్టలేని పక్షంలో పక్కదారి పెట్టిన ప్రజాధనం గురించి మర్చిపోవాల్సిందే.

బాండ్లు ఎందుకు ఇచ్చారు బాబూ...!

ఈ నిధుల మంజూరుకు ప్రక్రియ చాలా పెద్దగానే ఉంది. అయితే, అది కేవలం కాగితాలకే పరిమితమైంది. ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కు కావడంతో నిబంధనలు, నియమాలు ఏవీ లేకుండానే కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. క్షేత్రస్థాయి సిబ్బంది సహకరిస్తేనే తమ పబ్బం గడుస్తుందన్న కారణంతో అక్రమార్కులు ఏకంగా ఖాళీ బాండ్లను ఎరగా వేశారు. తాము చెప్పినట్టు సంతకాలు చేస్తే డబ్బులిస్తామని చెప్పిన వారు. నమ్మకం లేని ఖాళీ బాండ్లు కూడా ఇవ్వడం గమనార్హం. అయితే, కొందరికి చెక్కులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రైవేటు వ్యక్తులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ పథకంలో ఒక్క మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోనే రూ.2.4కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పడానికి ఈ ఖాళీ బాండ్లు, చెక్కులు సరిపోవా బాసూ...!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement