జలప్రభకు కరెంటూ కరువే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు సర్కారు ప్రారంభించిన ఇందిర జలప్రభ పథకం కరెంట్ షాక్‌తో అల్లాడుతోంది. ఈ పథకం కింద అభివృద్ధి చేసిన భూముల్లో బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ కనెక్షన్లు కరువయ్యాయి. కనెక్షన్ల కోసం రూ. 70 కోట్ల మేరకు నిధులు చెల్లించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు వారు ఇచ్చిన కనెక్షన్లు మూడు వేలు కూడా దాటకపోవడం గమనార్హం. దాంతో బోర్లు వేసినా.. మోటార్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నా.. కరెంటు లేకపోతే ఏం చేయగలమని అధికారులు, రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు చాలా దూరంగా ఉంటున్నాయని, అక్కడివరకు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని డిస్కమ్‌లకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మెటీరియల్ సమకూర్చుకోవాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉన్నా.. వారు పట్టించుకోవడం లేదని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చాలా ఏళ్లు పడుతుందని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాము తరచూ విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నా.. ఫలితం ఉండడం లేదని చెప్పారు.
మోటార్ల కోసం మళ్లీ టెండర్లు..
జలప్రభ కింద అందించే మోటార్ల కోసం రెండు సార్లు టెండర్లు పిలిచినా ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో.. మూడోసారి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి మాణిక్యవరప్రసాద్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్‌ను ఆదేశించినట్లు సమాచారం. అయితే, మోటార్లకు నాలుగేళ్ల గ్యారంటీ ఇవ్వాలనే నిబంధన కారణంగా తయారీ సంస్థలు రింగ్ అయి టెండర్లు దాఖలు చేయలేదని తేలడంతో.. ఆ పరిమితిని రెండేళ్లకు కుదించాలని నిర్ణయించారు.