సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది.
సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి.
వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment