manikya varaprasad
-
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
డబ్బులు ఇవ్వకుంటే ఆమరణ దీక్షే : జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తామన్న కోటి రూపాయలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ నిరాహార దీక్షకు దిగనుందనే సమాచారం అందుకున్న టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సాఫ్ చైర్మన్ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ సాయంత్రంలోగా జ్యోతి సురేఖ డబ్బులు ఇచ్చేవిధంగా జీవో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకూ దీక్ష ఆలోచనను విరమించుకోవాలని కోరారు. దీంతో సురేఖ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడాకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించని చెరుకూరి సత్యనారాయణకు తనకు కేటాయించిన నజరానాలో 15లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15లక్షలు ఇవ్వడం కుదరదు : సురేఖ తండ్రి జ్యోతి సురేఖకు అర్జున్ అవార్డు వచ్చినప్పుడు ప్రభుత్వం కోటి రూపాయలు నజరాన ప్రకటించిందని.. కానీ ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వలేదని సురేఖ తండ్రి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాప్ అధికారుల నిర్లక్ష్యం వల్లే డబ్బు రావడంలో ఆలస్యమైందని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2012లోనే జ్యోతి సురేఖ చెరుకూరి సత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకోవడం మానేసిందని, కానీ అవార్డు వచ్చింది 2017 అని గుర్తుచేశారు. కోచ్‌కు 15లక్షల రూపాయలు ఇవ్వడం కుదరదన్నారు. సాయంత్రంలోపు డబ్బులు ఇవ్వకపోతే సురేఖ దీక్ష చేస్తుందని స్పష్టం చేశారు. -
'కేసీఆర్ భయపెట్టే సంస్కృతి విడనాడాలి'
హైదరాబాద్ : సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుంటే సహించేది లేదన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులను భయపెట్టే సంస్కృతిని కేసీఆర్ విడనాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్ హితవు పలికారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నమని ఆయన నిన్న హెచ్చరించారు. -
అయోమయంలో ఉన్నా: డొక్కా
తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా.. లేదా రాయపాటి సాంబశివరావుతో కలిసి టీడీపీలో చేరాలా అన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నానని ఏపీ పీసీసీ కో ఛైర్మన్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ అంశంపై రెండు రోజులుగా సంఘర్షణ అనుభవిస్తున్నానని, రేపు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ గురువైన రాయపాటితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. రాయపాటి సాంబశివరావుకు మరో ఆప్షన్ లేకపోవడం వల్లే ఆయన టీడీపీలోకి వెళుతున్నారని, ఆయనపై విధించిన బహిష్కరణను హైకమాండ్ ఎత్తివేసి ఉండాల్సిందని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, తాను ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం తాటికొండ నుంచి పోటీ చేయబోనని తెలిపారు. -
మేం చిరుకు రాజకీయ తమ్ముళ్లం: డొక్కా
భావోద్వేగాలు, ఆవేశంతో ప్రజలకు న్యాయం జరగదని, ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన చెబుతున్న సామాజిక న్యాయాన్ని ఆచరించి చూపుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే అందుకే చిరంజీవి తాను స్థాపించిన పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పారు. చిరంజీవికి పవన్ సొంత తమ్ముడైతే, తనలాంటి దళితులమంతా చిరంజీవికి రాజకీయ తమ్ముళ్లమని డొక్కా అన్నారు. -
జలప్రభకు కరెంటూ కరువే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు సర్కారు ప్రారంభించిన ఇందిర జలప్రభ పథకం కరెంట్ షాక్‌తో అల్లాడుతోంది. ఈ పథకం కింద అభివృద్ధి చేసిన భూముల్లో బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ కనెక్షన్లు కరువయ్యాయి. కనెక్షన్ల కోసం రూ. 70 కోట్ల మేరకు నిధులు చెల్లించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు వారు ఇచ్చిన కనెక్షన్లు మూడు వేలు కూడా దాటకపోవడం గమనార్హం. దాంతో బోర్లు వేసినా.. మోటార్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నా.. కరెంటు లేకపోతే ఏం చేయగలమని అధికారులు, రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు చాలా దూరంగా ఉంటున్నాయని, అక్కడివరకు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని డిస్కమ్‌లకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మెటీరియల్ సమకూర్చుకోవాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉన్నా.. వారు పట్టించుకోవడం లేదని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చాలా ఏళ్లు పడుతుందని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాము తరచూ విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నా.. ఫలితం ఉండడం లేదని చెప్పారు. మోటార్ల కోసం మళ్లీ టెండర్లు.. జలప్రభ కింద అందించే మోటార్ల కోసం రెండు సార్లు టెండర్లు పిలిచినా ఏ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో.. మూడోసారి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి మాణిక్యవరప్రసాద్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్‌ను ఆదేశించినట్లు సమాచారం. అయితే, మోటార్లకు నాలుగేళ్ల గ్యారంటీ ఇవ్వాలనే నిబంధన కారణంగా తయారీ సంస్థలు రింగ్ అయి టెండర్లు దాఖలు చేయలేదని తేలడంతో.. ఆ పరిమితిని రెండేళ్లకు కుదించాలని నిర్ణయించారు.