అయోమయంలో ఉన్నా: డొక్కా
తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా.. లేదా రాయపాటి సాంబశివరావుతో కలిసి టీడీపీలో చేరాలా అన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నానని ఏపీ పీసీసీ కో ఛైర్మన్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ అంశంపై రెండు రోజులుగా సంఘర్షణ అనుభవిస్తున్నానని, రేపు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ గురువైన రాయపాటితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
రాయపాటి సాంబశివరావుకు మరో ఆప్షన్ లేకపోవడం వల్లే ఆయన టీడీపీలోకి వెళుతున్నారని, ఆయనపై విధించిన బహిష్కరణను హైకమాండ్ ఎత్తివేసి ఉండాల్సిందని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, తాను ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం తాటికొండ నుంచి పోటీ చేయబోనని తెలిపారు.