అక్రమాలపై ఉపేక్ష ఎందుకు?
అవినీతిపై సభ్యుల గరం గరం
- జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో
- ‘సాక్షి’ కథనం ప్రస్తావన
కరీంనగర్ సిటీ : ‘ఇందిర జలప్రభ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గతంలోనే చెప్పాం.. విచారిస్తామని కలెక్టర్ సభాముఖంగా చెప్పారు.. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు కాదు కదా.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు.. అక్రమాలపై ఎందుకు ఉపేక్షిస్తున్నారు’ అంటూ జిల్లా ప్రజాపరిషత్ స్థాయూ సంఘం సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల సమావేశాలు గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. చైర్‌పర్సన్ తుల ఉమ, సీఈఓ సూరజ్‌కుమార్ హాజరయ్యారు.
ముందుగా సభ్యులు చల్లనారాయణరెడ్డి, ఎండీ.జమీలుద్దిన్, మందల రాజిరెడ్డి ఇందిర జలప్రభ పథకంలో చేపట్టిన బోరుబావులు, విద్యుత్ కనెక్షన్‌లు, మోటార్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా విచారణ కమిటీ వేద్దామనుకున్నామంటూ డ్వామా పీడీ సమాధానం చెప్పడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ వేయడానికే ఏడాది సమయం తీసుకుంటే విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్య తీసుకోవడానికి ఎన్నేళ్లు తీసుకుంటారని ప్రశ్నించగా జెడ్పీ నుంచే కమిటీ వేద్దామని చైర్‌పర్సన్ తుల ఉమ హామీ ఇచ్చారు.
డీఆర్‌డీఏ ఇచ్చే శిక్షణ క్యాలెండర్ వివరాలు సభ్యులకు చెప్పాలని, జిల్లాలో మిగిలిన ఏడు మండలాల్లో గోదాముల నిర్మాణానికి స్థలం సేకరించాలని, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో గృహనిర్మాణం కోసం భూమిని గుర్తించాలన్నారు. జిల్లాలో భర్త వదిలి పెట్టిన ఒంటరి మహిళలు 11వేల మంది ఉన్నారని, వారికి పింఛన్లు ఇవ్వాలని, అభయ హస్తం లబ్ధిదారులకు మార్చి నుంచి పింఛన్ రావడం లేదని సభ్యులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రూ.500 ఇస్తేనే పేర్లు అప్‌లోడ్ చేస్తున్నారని, డాటా ఆపరేటర్లను రిక్రూట్ చేసుకోవాలన్నారు. 75 శాతం కిరోసిన్ నల్లబజారుకు తరలుతోందని, నీలి రంగును తెలుపు చేసి డీజిల్, పెట్రోల్‌లో కలిపి కల్తీ చేస్తున్నారని చెప్పారు. రాజీవ్ యువశక్తి కింద ఇస్తున్న రూ.1లక్ష రుణాన్ని రూ.5 లక్షలకు పెంచాలని తీర్మానించారు.