
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక రంగం గడిచిన ఐదేళ్లలో విప్లవాత్మక ప్రగతిని సాధించిందని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్–ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషే కారణమన్నారు. ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వ గా, అందులో 8,400 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రా రంభించి 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని అందిస్తున్నాయని చెప్పారు. శనివారం ఇక్కడి పరిశ్రమల భవన్‌లోని తన కార్యాలయంలో బాలమ ల్లు మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ విధానం ద్వారా రాష్ట్రంలో 8,500 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వడం ద్వారా 1.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 12 లక్షలమందికి ప్రత్యక్షంగా, మరో 20 లక్షలమందికి పరోక్షంగా ఉపాధి దొరికిందన్నారు. 23 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పేందుకు అవసరమైన 39,989 ఎకరాలను సేకరించి రూ.1,825 కోట్లతో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు.