సాక్షి, హైదరాబాద్: ‘‘పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. లంచం ఇవ్వకుంటే పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా నోటీసులు, తనిఖీల పేరుతో వేధిస్తామని పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. అన్నీ పద్ధతి ప్రకారమే దరఖాస్తు చేసుకున్నా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు..’’
టీఎస్‌ఐపాస్ కింద పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి రెవెన్యూ యంత్రాంగం లంచాలు వసూలు చేస్తున్న వైనంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఇదీ! దరఖాస్తు చేసుకున్నప్పట్నుంచీ పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు, ఆ తర్వాత కూడా ఆమ్యామ్యాలు లేనిదే రెవెన్యూ శాఖలో ఏ పనీ జరగడం లేదని ఈ నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదిక నేపథ్యంలో సీఎంవో కార్యాలయం ఇటీవలే రెవెన్యూ శాఖను హెచ్చరించింది.
టీఎస్‌ఐపాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అవినీతి రహిత కార్యకలాపాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సీఎం భావిస్తున్నారంటూ ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ సీఈవో పేరిట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. టీఎస్‌ఐపాస్ కింద పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో హెచ్చరించడం గమనార్హం. ఈ లేఖకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహారంపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశిస్తూ ఈ నెల 12న సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
అయినా.. తీరు మారలేదు
సాక్షాత్తూ సీఎంవో నుంచి హెచ్చరికలు వచ్చినా క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఓ ప్రైవేటు విద్యుత్ సంస్థకు సంబంధించిన గ్యాస్‌పైప్‌లైన్లను కొన్ని భూముల్లోంచి వేసుకునేందుకు అనుమతినిస్తూ ఇటీవల ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆ ఉత్తర్వులను సదరు కంపెనీ సంస్థ ప్రతినిధికి అందజేసేందుకు లక్షల్లో డిమాండ్ చేసినట్టు తెలిసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తెప్పించుకున్న ఉత్తర్వులను కూడా చివరకు ఎంతో కొంత ముట్టజెప్పి తీసుకెళ్లాల్సిన పరిస్థితి! ఇదేగాకుండా రెండు అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు ఉత్తర్వులను ఇదే డిమాండ్‌తో నిలిపివేశారని సమాచారం. హైదరాబాద్ స్థాయిలోనే వసూళ్ల పర్వం ఇలా ఉంటే... క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకెలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులు
Published Tue, Apr 17 2018 1:35 AM | Last Updated on Tue, Apr 17 2018 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment