వ్యాధులు ‘అంటు’కుంటున్నాయి.. | Infectious Diseases Are Spreading In Government Hospitals | Sakshi
Sakshi News home page

వ్యాధులు ‘అంటు’కుంటున్నాయి..

Published Thu, Jan 23 2020 3:53 AM | Last Updated on Thu, Jan 23 2020 3:53 AM

Infectious Diseases Are Spreading In Government Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే రోగికి ప్రస్తుతమున్న జబ్బుకు తోడు మరికొన్ని తోడవుతున్నాయి. వారి పక్కనున్న వారికి కూడా ఇన్‌ఫెక్షన్లు, కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంతేకాదు వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి కూడా ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి. 2018లో కేరళలో నిఫా వైరస్‌ సోకిన రోగికి వైద్య సేవలు అందించిన నర్సు ఇన్‌ఫెక్షన్‌కు గురై మృతిచెందింది. అలాగే హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వ పెద్దాసుపత్రిలో గతంలో ఒక ఎయిడ్స్‌ రోగికి ఇచ్చిన ఇంజెక్షన్‌ పొరపాటున గుచ్చుకోవడంతో నర్సుకు కూడా ఎయిడ్స్‌ సోకింది.

కొన్నాళ్ల చికిత్స అనంతరం ఆమె ఈ నెల 5న చనిపోయింది. రోగులకు చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారికి, సందర్శకులకు కూడా ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఇన్‌ఫెక్షన్లు, ఇతరత్రా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అనేక ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నియంత్రణకు వ్యవస్థలు, కమిటీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా ఇన్‌ఫెక్షన్ల నివారణ, నియంత్రణకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

పిల్లల ఆసుపత్రుల్లో అధికం..
మన దేశంలో ఆసుపత్రులకు వచ్చే వారిలో 10 శాతం మంది జీవితంలో ఒక్కసారైనా ఇన్‌ఫెక్షన్‌కు గురై ఉంటారని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 7 శాతంగా ఉంది. ఇన్‌ఫెక్షన్లు ప్రధానంగా రక్తం, మూత్రం ద్వారా కలుగుతాయి. న్యూమోనియా, జీర్ణకోశ వ్యాధుల్లోనూ సంభవిస్తాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలలో ఆపరేషన్‌ చేసిన 30 రోజుల తర్వాత కూడా ఇన్‌ఫెక్షన్లు సంభవిస్తాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్లు ఆపరేషన్‌ చేసిన ఏడాదిలోపు ఎప్పుడైనా సోకే ప్రమాదముంది. వాటిని శస్త్రచికిత్స అనంతర అంటు వ్యాధులుగా పరిగణిస్తారు. జీర్ణకోశ అంటు వ్యాధులు ప్రధానంగా పిల్లల ఆసుపత్రుల్లో లేదా పిల్లల వార్డుల్లో కనిపిస్తాయి.

కలుషితమైన వాతావరణం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, చేతులు సరిగా కడుక్కోకపోవడం వంటి కారణాల వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకుతుంటాయి. బ్యాక్టీరియా కారణంగా పిల్లలకు ఒక్కోసారి తీవ్రమైన విరేచనాలు అవుతాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చే వృద్ధులకు కూడా ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. డయాబెటిస్, కేన్సర్‌ వంటి రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారికి త్వరగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. సరైన వెంటిలేషన్‌ లేకపోవడం, అపరిశుభ్రత వల్ల ఇన్‌ఫెక్షన్లు అధికంగా సోకుతున్నాయి. ఐసీయూ వార్డులు సక్రమంగా లేకపోతే వెంటిలేటర్లపై ఉండే రోగులకు త్వరగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. పరికరాలు సరిగా లేకపోవడం, హెల్త్‌ ప్రొటోకాల్‌ను పాటించకపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి.   

ఇన్‌ఫెక్షన్ల నియంత్రణకు మార్గదర్శకాలు..
►ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ నివారణ, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి.
►రోగులుండే పడకల మధ్య స్థలం ఒకట్రెండు మీటర్ల దూరం ఉండాలి. రోగిని ఆసుపత్రుల్లో చేర్చే ముందు గదిని శుభ్రం చేయాలి. అంతకుముందు ఉన్న రోగి ఉపయోగించిన అన్ని వస్తువులను తీసివేయాలి. బెడ్‌ షీట్లు ఉతికినవి వాడాలి.
►చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
►సురక్షితమైన ఇంజెక్షన్లను మాత్రమే వాడాలి.
►ప్రతి వైద్య పరీక్షకు ముందు శుభ్రమైన చేతి తొడుగులు వాడాలి.
►కత్తెరలు, స్ట్రెచర్లు, నీడిల్స్‌ తదితరమైనవి అత్యంత శుభ్రంగా ఉంచాలి.
►రోగులను చూసేందుకు వచ్చే సందర్శకులపై ఆంక్షలు తప్పనిసరి. ఆసుపత్రుల్లో వారి కదలికను పరిమితం చేయాలి. సందర్శకులు ఆసుపత్రి పడకలపై కూర్చోవడం, పడకలపై పడుకోవడం, కాళ్లు పెట్టడం వంటివి చేయకూడదు.
►సందర్శకులు రోగి గదిలోకి వెళ్లేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో గౌను, మాస్క్‌ ధరించాలి.
►సందర్శకుల సంచులు, ఇతర వస్తువులను రోగి ప్రాంతం వెలుపల ఉంచాలి.  
►వార్డ్‌ నర్సింగ్‌ సిబ్బంది, సంబంధిత వైద్యులు రోగి బంధువులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు తెలియజేయాలి.
►12 ఏళ్లలోపు పిల్లలను రోగి దగ్గరకు అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే రోగిని తాకడానికి ముందు, తర్వాత చేతి పరిశుభ్రత పాటించాలి.
►రోగితో కేవలం ఒక సహాయకునికి మాత్రమే అనుమతి ఉండాలి.
►మొబైల్‌ ఫోన్ల వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబటి రోగులు మొబైల్‌ ఫోన్లను వాడకూడదు.
►సందర్శకుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, దద్దుర్లు లేదా మరేదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే రోగి దగ్గరకు రానీయకూడదు.
►రోగుల మరుగుదొడ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. సందర్శకులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.
►ప్రతి వార్డు, ఐసీయూలు, ఇతరత్రా రోగులుం డే ప్రదేశాలను ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ కమిటీ సందర్శించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement