తెరపైకి అవిశ్వాసం | Infidelity on chairman of DCMC | Sakshi
Sakshi News home page

తెరపైకి అవిశ్వాసం

Published Tue, Nov 11 2014 2:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Infidelity on chairman of DCMC

 సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : సహకార రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాత్కాలికంగా బ్రేక్ పడిన డీసీఎంఎస్(జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ) చైర్మన్ ఐర నారాయణరెడ్డి(కాంగ్రెస్), వైస్ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డిలపై అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి హైకోర్టు స్టే వెకేట్ కావడంతో జిల్లా సహకార అధికారి(డీసీఓ) సూర్యచంద్రరావు సోమవారం డీసీఎంఎస్ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 28న ఉదయం 11గంటలకు డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డెరైక్టర్లు అందరూ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో డీసీఎంఎస్ క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) తన వశం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ.., డీసీఎంఎస్‌పై కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం డీసీఎంఎస్ చైర్మన్‌పై కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లతోనే జూలై 11న అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించారు.

ఈ నేపథ్యంలో డీసీఓ సూర్యచంద్రరావు ఆగస్టు 8న డీసీఎంఎస్ డెరైక్టర్ల సమావేశం ఏర్పాటు చేస్తూ డెరైక్టర్లందరికీ నోటీసులు జారీ చేశారు. పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్‌ఏసీ)లో ఉన్న జిల్లా సహకార అధికారికి ఈ సమావేశం నిర్వహించే అధికారం లేదని నారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశం నిలిచిపోయింది. తాజాగా స్టే వెకేట్ కావడంతో మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు డీసీఓ సూర్యచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. డీసీఎంఎస్‌లో మొత్తం పది మంది డెరైక్టర్లు ఉన్నారు.

ఏడుగురు సభ్యులు(మూడింట రెండు వంతులు) అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే చైర్మన్, వైస్ చైర్మన్లు పదవి నుంచి వైదొలిగిపోతారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు క్యాంపుల్లో ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాంపులో ఉన్న ఒక్కో డెరైక్టర్‌కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు నజరానా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని చైర్మన్ ఎన్నిక అనంతరం ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం అంశం విషయంలో జిల్లా మంత్రి జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిలు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 28న జరగనున్న డీసీఎంఎస్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీ కానున్నాయి. తర్వాత ఈ పదవుల ఎన్నిక కోసం నోటీఫికేషన్ జారీ చేస్తామని, మరోమారు డెరైక్టర్ల సమావేశం నిర్వహించి ఈ పదవుల ఎన్నిక నిర్వహిస్తారని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చైర్మన్ పదవి రేసులో డెరైక్టర్ బి.వినోద్‌రెడ్డి(జామిడి పీఏసీఎస్) ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement