- నిషేధం ఉన్నా.. జోరుగా పేకాట
- ఒక్క నెలలోనే 368 కేసులు నమోదు
నిజామాబాద్ క్రైం : జూదం ఓ వ్యసనం. అది ఇచ్చే కిక్కుకోసం ఏం చేయడానికైనా వెనుకాడరు కొందరు. జీవితాలనే పణంగా పెట్టడానికీ సిద్ధపడతారు. సర్వస్వం కోల్పోతున్నా.. పేకాట, మట్కా వంటివాటిని మానరు. చట్టాలను ఉల్లంఘించడమే ఘనతగా భావించేవారి ని నిషేధాజ్ఞలు కట్టడి చేయగలవా? లేదనే చెబుతున్నాయి నమోదవుతున్న కేసులు. గతనెలలో జిల్లాలో 368 పేకాట కేసులు నమోదయ్యాయి.
పేకాడుతున్నవారి నుంచి పోలీసులు రూ. 7.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నా యి. పోలీసులకు చిక్కితే జరిమానా కట్టి.. బయటికి వచ్చి షరామామూలుగా మళ్లీ పేకాడేస్తున్నారు. కఠినమైన చర్యలు లేకపోవడంతో మట్కా, పేకాడేవారిలో మార్పు రావడం లేదు.
జిల్లాలో పేకాట జోరుగా సాగుతుంది. పండుగ ల సమయంలో కోట్లలో పందాలు కాస్తారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన మహేశ్ చంద్ర లడ్డా జిల్లాలో పేకాటను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకున్నారు. పేకాట స్థావరాలపై దాడులు చేయించారు. పేకాడుతున్నవారిపై కేసులు నమోదు చేసి, జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపారు. అప్పట్లో జిల్లాలో పేకాడాలంటే జూదగాళ్లు భయపడేవారు.
పేకాటపై మోజు ఉన్నవారు హైదరాబాద్‌కు వెళ్లి క్లబ్బుల్లో ఆడి వచ్చేవారు. ఆయన బదిలీ అయ్యాక పరిస్థితి మొదటి కి వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాట నియంత్రణపై దృష్టి సారించారు. గతంలో ఆఫీసర్స్ క్లబ్, రిక్రియేషన్ క్లబ్బులలో పేకాటకు అనుమతి ఉండేది. వీటిపై ఫిర్యాదులు రావడంతో ఆయా స్థలాల్లోనూ పేకాటను నిషేధించారు. జిల్లాలో పేకాట పై నిషేధం ఉన్నా.. జోరుగానే పేకాడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలు, నగర, గ్రామ శివార్లలో పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి.
జూదగాళ్లు కొందరు ఆర్డర్ చేసి మద్యం, భోజనం తెప్పించుకుంటూ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు పేకాడుతూనే ఉంటారు. ఫంక్షన్లలో పబ్లిగ్గా నే పేకాట సాగుతుంది. శుభకార్యాలు జరిగే ప్రాంతాలకు పోలీసులు రారన్నది పేకాటగాళ్ల నమ్మకం. కాల క్షేపం పేరుతో రోజంతా పేకాడుతూనే ఉంటారు. ఇలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పేకాట స్థావరాలపై అప్పుడప్పుడు పోలీసులు దాడు లు చేస్తూ డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులకు చిక్కినవా రు వందో రెండు వందల రూపాయలో జరిమానా కట్టి బయటికి వచ్చి మళ్లీ ఆట కొనసాగిస్తున్నారు.
మాట్కా..
జిల్లాలో మాట్కా కేసులు అంతంత మాత్రంగానే నమోదవుతున్నాయి. ఈ ఆటకు ఎక్కువగా పేదలే బలవుతున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డబ్బులను పందెం కాస్తూ.. నష్టపోతున్నారు. దీనిపై నిషేధం ఉండడంతో మట్కా నిర్వాహకులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర కేం ద్రంగా జూదం సాగిస్తున్నారు. చాలా మంది జిల్లా కేంద్రం నుంచి రైలు ద్వారా మహారాష్ట్రకు చేరుకుని, అక్కడ మట్కా ఆడి సాయంత్రానికి ఇళ్లకు చేరుతున్నా రు. ఈ ఏడాది జిల్లాలో 51 మట్కా కేసులు నమోదు కాగా రూ. 1.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్కా స్థావరాలు ఎక్కువగా పొరుగు రాష్ట్రంలో ఉండడంతో కేసులు ఎక్కువగా నమోదు కావడంలేదు.
ఉల్లంఘనులకు కేసులు అడ్డమా?
Published Tue, Dec 9 2014 2:47 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement