సారంగాపూర్ : ఇంజక్షన్ వికటించిన సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలోకలిశాయి. బంధువులు, గ్రామస్థుల కథనం.. రేచపల్లి గ్రామానికి చెందిన కల్లూరి రాజేశం(55)కు కాలుకు నొప్పి రావడంతో చికిత్స కోసం గ్రామానికి చెందిన ఆమానుల్లాఖాన్ అనే ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆయన రాజేశంను పరీక్షించి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చాడు. మూడు నిముషాల వ్యవధిలో రాజేశం మూత్రవిసర్జన చేసుకుని అక్కడిక్కడే కుప్పకూలి మృతిచెందాడు. విషయాన్ని అక్కడికి వచ్చిన కొంతమంది రోగులు మృతుడి కుమారులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న కొడుకులు చిరంజీవి, సంజీవ్ అక్కడి చేరుకున్నారు. గ్రామస్థులు అక్కడిచేరుకొని చికిత్స చేసిన ఆమానుల్లాఖాన్‌ను నిలదీశారు. అనంతరం చితకబాదారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి రోడ్డుపై విసిరేశారు. గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టు ఇన్‌చార్జి కరుణాకర్ నిందితుడు ఆమానుల్లాఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేష్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాలకు తరలించారు.
15 సంవత్సరాలుగా...
ఇంజక్షన్ వికటించి కల్లూరి రాజేశం మృతిచెందిన సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాలకు చెందిన ఆమానుల్లాఖాన్ 15 సంవత్సరాలుగా గ్రామంలో క్లినిక్ పెట్టి నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లోపతి, ఆయుర్వేద మందులు ఇస్తూనే భూతవైద్యం చేస్తున్నట్లు ఆరోపించారు. నాణ్యత లేని మందులు ఇస్తూ.. చిన్న చిన్న జ్వరాలకూ కనీసం రెండువేల ఫీజు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజేశంకు ఎక్కువ డోజ్ ఉన్న ఇంజక్షన్ ఇవ్వడంతో మృతిచెందాడని బంధువులు ఆరోపించారు.
ఇంజక్షన్ వికటించి ఒకరి మృతి
Published Sat, Dec 6 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement